తల్లిదండ్రులకు సవాల్ గా మారిన పిల్లల పేర్లు..

తల్లిదండ్రులకు సవాల్ గా మారిన పిల్లల పేర్లు..
x
Highlights

మన ముందు తరాల వారి పేర్లన్నీ గ్రామదేవతలు, కులదైవాలు కలిసొచ్చేలా ఉండేవి.

మన ముందు తరాల వారి పేర్లన్నీ గ్రామదేవతలు, కులదైవాలు కలిసొచ్చేలా ఉండేవి. ఇప్పుడలా కాదు నవతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే పుస్తకాలు, ఇంటర్‌నెట్‌లో అన్ని రకాలుగా వడపోత పట్టి మరీ పేర్లు వెతుకుతున్నారు. పేరు పలకడానికి సులువుగా, వినసొంపుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే నామకరణం చేసేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నక్షత్రం, ఇష్టదైవం, అభిరుచి, తదితర అంశాల ఆధారంగా ఉత్తమ పేరు సెలెక్ట్ చేస్తున్నారు. తక్కువ అక్షరాలు, అర్థవంతమైన పదాలతో నామకరణం చేస్తున్నారు.

సాధారణంగా పిల్లలు పుట్టిన 21 రోజులకు నామకరణ మహోత్సవం నిర్వహిస్తారు. వీలుకానివారు మూడో నెలలో ఆ కార్యక్రమం చేస్తారు. జన్మ నక్షత్రం, ఇష్టదైవం, పూర్వీకుల పేర్లు, ప్రదేశాల ప్రాధాన్యత ఆధారంగా తమ అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు పేరు ఎంపిక చేస్తున్నారు. నామకరణ మహోత్సవం రోజున పాప చెవి వద్ద ఆ పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది.

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు అంటే అపారమైన భక్తి, గౌరవం, ప్రేమ. వారి మరణానంతరం కుటుంబంలోని వారికి సంతానం కలిగితే తమ పూర్వీకులే మళ్లీ పుట్టారని భావించి వారి పేరే పెట్టేవారు. మరికొందరు తమ ఇష్టదైవం పేరు పెట్టడానికి ఆసక్తిచూపేవారు. తమ ఇష్టదైవానికి మొక్కుకుని పిల్లలు కలిగాక దేవుని పేరు పెట్టేవారు. అటువంటి సంప్రదాయలు క్రమేణా కనుమరుగౌతున్నాయి. మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలకు పెట్టే పేర్లలోనూ ఆధునికత కనిపించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లేదా మూడు అక్షరాలు కలిగిన పేర్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిణామం మంచిది కాదని ప్రముఖ అర్చకులు చెబుతున్నారు.

పేరుతో కాకుండా పిల్లలను ముద్దుపేరుతో పిలవడం ఇటీవల కాలంలో సాధారణమైంది. ఇదీ ప్రతి ఇంటిలోనూ కనిపిస్తోంది. మిన్ని, బన్ని, డాలి, హనీ, బబ్లూ, పింకూ, చింటు, టింకు, చిన్న, పింకి, యాపిల్, చెర్రీ, సన్నీతదితర పేర్లు మనకు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ముడు అక్షరాల ముద్దు పేర్లని నేటి తరం తల్లిదండ్రులు అసలు పేర్లుగా మార్చేస్తున్నారు, పాఠశాలలలో ఉపాధ్యాయులకి కావచ్చు కుటుంబంలోని సభ్యులు కావచ్చు కొన్నిసార్లు ఆ పేర్లని పలకడానికి ఇబ్బందులు పడుతుంటారు. గతంలో పెద్దల సలహా తీసుకుని నామకరణం చేసేవారు. అయితే నేటి తరం వారు గూగుల్ దృష్టికి తీసుకెళ్లి గూగుల్‌లో వచ్చే మంచి పేర్లని సెలక్ట్ చేసుకొనే పనిలో ఉన్నారు. పేరు పెట్టటంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేరు వినగానే ఆ వ్యక్తి స్త్రీయో, పురుషుడో తెలియాలి. పేరుకి ఉన్న శక్తిని అనుసరించి బిడ్డ పేరుగల వాడు, పేరెన్నిక గలవాడు అవుతాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories