వరుసగా నాలుగోసారీ..నిరాశ పరచిన తెలుగు టైటాన్స్

వరుసగా నాలుగోసారీ..నిరాశ పరచిన తెలుగు టైటాన్స్
x
Highlights

ఏ ఆటలోనైనా.. ఏ జట్టుకైనా సొంత గడ్డపై ఆడుతుంటే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎంత పేలవ ఫాం లో ఉన్నా నాల్గింట ఒక్కటన్నా గెలుపు దక్కేలా ఆడుతారు. కానీ, ప్రో...

ఏ ఆటలోనైనా.. ఏ జట్టుకైనా సొంత గడ్డపై ఆడుతుంటే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎంత పేలవ ఫాం లో ఉన్నా నాల్గింట ఒక్కటన్నా గెలుపు దక్కేలా ఆడుతారు. కానీ, ప్రో కబడ్డీ లీగ్ లో మన తెలుగు టైటాన్స్ కు ఆ శక్తి లేకుండా పోయింది. వరుసగా నాలుగోసారి ఘోర పరాజయం పాలైంది. పాట్నా పైరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో శుక్రవారం ఓటమి పాలై అభిమానులను నిరాశకు గురిచేసింది.

శుక్రవారం రాత్రి పట్నా పైరెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22-34 తేడాతో తెలుగు టైటాన్స్ జట్టు ఘోరంగా ఓడింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా డిఫెండర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో టైటాన్స్ స్టార్ రైడర్లు సూరజ్ దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్లు తేవడానికి ఇబ్బంది పడ్డారు. బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ 4 రైడింగ్ పాయింట్లు, ఒక టాకిల్ పాయింట్, ఒక బోనస్‌తో మొత్తం ఆరు పాయింట్లను మాత్రమే సాధించగలిగాడు.

బుధవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 18 పాయింట్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సూరజ్ దేశాయ్.. ఈ మ్యాచ్‌లో ఒక్క రైడింగ్ పాయింట్ మాత్రమే తేగలిగాడు.

పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించగా.. లీ జాంగ్‌కున్ 3 పాయింట్లను సాధించాడు. జైదీప్ 6 టాకిల్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమిపాలైన పట్నా.. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచి వెనుకంజలోనే ఉన్న టైటాన్స్ ఏ దశలోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది.

సొంత ప్రేక్షకుల మద్దతు నడుమ ఆడుతున్న తెలుగు టైటాన్స్ జట్టు అంతకు ముందు యు ముంబా, తమిళ్ తలైవాస్, దబాంగ్ ఢిల్లీ జట్ల చేతుల్లో ఓడిన సంగతి తెలిసిందే. సొంత గడ్డ మీద ఆఖరి మ్యాచ్‌లోనూ పట్నాపై తెలుగు టైటాన్స్ ఆకట్టుకోలేకపోయింది.

శుక్రవారం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యున్ గెయింట్స్ 44-19 తేడాతో యూపీ యోధాను ఓడించింది. గుజరాత్ ఆటగాడు రోహిత్ గులియా 9 రైడింగ్ పాయింట్లు సహా 11 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories