ఓ తలైవా...రేపు రా?

ఓ తలైవా...రేపు రా?
x
Highlights

ఓ స్త్రీ రేపురా కొంతకాలం కిందట ప్రతి ఇంటి గోడకూ రాసిపెట్టిన కొటేషన్ ఇది. ఇఫ్పుడు తమిళనాడులోనూ, ఓ తలైవా రేపు రా అంటున్నాయట పొలిటికల్ పార్టీలు. ఇంతకీ...

ఓ స్త్రీ రేపురా కొంతకాలం కిందట ప్రతి ఇంటి గోడకూ రాసిపెట్టిన కొటేషన్ ఇది. ఇఫ్పుడు తమిళనాడులోనూ, ఓ తలైవా రేపు రా అంటున్నాయట పొలిటికల్ పార్టీలు. ఇంతకీ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ను, ఎందుకు రేపు రా అంటున్నాయి రాజకీయ పక్షాలు. అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం ముంగిట్లో, రజినీకాంత్‌పై కొత్తగా జరుగుతున్న వింత ప్రచారమేంటి?

కమల్‌హాసన్‌ పార్టీ పెట్టేశారు ఎన్నికల్లో పోటీ చేసేశారు. ఖుష్బూ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కమలానికి షేక్‌హ్యాండిచ్చారు. సీఎం కుర్చీపై పోట్లాడి పోట్లాడి పళనీ, పన్నీర్‌ సైలెంటయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిల్లో తమిళ రాజకీయం వేడెక్కుతోంది. మరి వస్తాను...ఇరగదీస్తానన్న తలైవా ఇంకా రానేరాడే? ఇప్పుడే రాజకీయాల్లోకి రావొద్దని రజినీపై డీఎంకే ఒత్తిడి చేస్తోందా? పాలిటిక్స్‌లోకి ఇప్పుడే వద్దంటూ తలైవాను స్టాలిన్‌ అడిగారన్న ప్రచారంలో నిజమెంత?

తమిళనాడులో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. కోట్లాదిమంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తలైవా అంటే, అభిమానులు ప్రాణాలిచ్చేందుకు సిద్దపడతారు. తననెంతో అభిమానించే తమిళ ప్రజలకు సేవ చెయ్యాలని తపిస్తున్న రజనీ, రాజకీయాల్లోకి రావాలన్నది రెండు దశాబ్దాలుగా ఆలోచన. కానీ సమయం, సందర్భం కలిసిరావడం లేదని, వెనక్కి తగ్గుతూ వచ్చారు. జయలలిత మరణం తర్వాత, తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని భావించిన రజినీ, ఆ వ్యాక్యూమ్‌ను భర్తీ చేయగలిగేది తానేనని అనుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని చెప్పేశారు. వరుసబెట్టి చాలారోజులు ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగారు. కానీ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నా, రజినీకాంత్‌ నుంచి ఎలాంటి పొలిటికల్‌ హడావుడి, సంసిద్దతా కనపడ్డం లేదు. ఇంతలోనే అనేక రూమర్లు, రజినీ పార్టీపై కమ్ముకుంటూ, డౌట్స్‌ను మరింత పెంచేస్తున్నాయి.

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం హీటెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో అరవ పొలిటికల్ సినిమా గోలగోలగా మారుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తారా? రాజకీయ పార్టీని ప్రకటిస్తారా? అని అభిమానులు, ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీలు సైతం ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార, విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే, రజినీ వస్తే, రెండు పార్టీల్లో ఒకదానికి ఇబ్బంది తప్పదు. అందుకే తలైవా ఎంట్రీ ఇస్తారా ఇయ్యరా వస్తేగిస్తే, ఎలాంటి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు అన్న టెన్షన్‌ పార్టీలది. ఈ క్రమంలోనే తమిళనాట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. రాజకీయ ప్రవేశం చేయవద్దంటూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, రజనీకాంత్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇదే విషయమై డీఎంకే పెద్దలు, రజనీకి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖుడిని ఆయన వద్దకు దూతగా పంపినట్లు వైరల్‌ అవుతోంది. రజనీ ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ,రాజకీయాల్లోకి రావద్దంటూ ఆ దూత ఆయనకు తెలిపినట్లు చెన్నైలో మాట్లాడుకుంటున్నారు.

ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నవేళ, ఖుష్భూను సైతం బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి యుద్దానికి రెడీ అవుతున్న టైంలో, రజినీకాంత్ గురించి ఇలాంటి వార్తలు, జనంలో విపరీతంగా చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ పెట్టడంపై ఆయన ఆలస్యం, ఇలాంటి పుకార్లకు మరింత ఆస్కారం ఏర్పడుతోంది. అయితే, ఇదంతా వట్టి ప్రచారమేనంటున్నారు రజినీ సన్నిహితులు, డీఎంకే కీలక నేతలు. రజినీకాంత్‌ దగ్గరకు వెళ్లి, రాజకీయాల్లోకి రావొద్దంటూ, ఎలాంటి విజ్ణప్తులూ చెయ్యలేదని అంటున్నారు డీఎంకే నేతలు. తమకు అలాంటి అవసరం కూడా లేదంటున్నారు. పాలిటిక్స్‌లోకి రజినీ వచ్చినా, రాకపోయినా డీఎంకేకు నష్టంలేదంటున్నారు.

రజినీ రాజకీయాల్లోకి రావాలంటే, ఎవ్వరూ ఆపలేరు. కరోనా కూడా బంధనం వెయ్యలేదు. కానీ తలైవానే గట్టిగా అనుకోవడం లేదు. లేదంటే, ఈపాటికే పార్టీ పట్టాలెక్కి వుండేది. ఊరూరా జెండాలు ఎగిరేవి. ఏపీలో మరో చిరంజీవి, పవన్‌కల్యాణ్, అలాగే కమల్‌హాసన్‌లా తాను తేలిపోతానేమోనన్న సంశయమే రజినీని వెనకడుగు వేసేలా చేస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ ఏపీలో పరిస్థితి వేరు, తమిళనాడులో వేరంటున్నారు. తమిళనాట ఇప్పుడు రజినీ లాంటి బలమైన ప్రజాకర్షక లీడర్‌ అవసరం వుందని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ రజినీకాంత్‌‌ మాత్రం ఎందుకనో సంశయిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories