Devendra Fadnavis: ఫడ్నవీస్‌కే పట్టం కట్టడానికి కారణాలు ఏంటో తెలుసా?


Why BJP high command selected Devendra Fadnavis for Maharashtra CM post: మహారాష్ట్ర ఉత్కంఠకు తెరపడింది. ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తమ ముఖ్యమంత్రి...
Why BJP high command selected Devendra Fadnavis for Maharashtra CM post: మహారాష్ట్ర ఉత్కంఠకు తెరపడింది. ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించింది. ఇక సీఎం పదవిని ఆశించిన షిండేను బుజ్జగించడంతో బీజేపీ సఫలం కావడానికి మార్గం సుగమమైంది. దీంతో బుధవారం జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రేపు గురువారం ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరుకానున్నారు. అయితే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి కారణాలేంటో చూద్దాం.
ఫడ్నవీస్ చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన సామాజిక జీవితాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ నుంచి రాజకీయంగా ఎదిగారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తోనే ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లోనే 27 ఏళ్ల వయసులో నాగపూర్ మేయర్ అయ్యారు. 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. విదర్భ ప్రాంతంలో ఆయన మంచి నేతగా ఎదిగారు.
2014లో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత 2019లో బీజేపీ-శివసేన కూటమి విజయం తర్వాత కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీకి విధేయంగా ఉంటూ సీఎం పీఠాన్ని వదులుకుని ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోవడం ఆయన ఇమేజ్ ను అధినాయకత్వం వద్ద పెంచింది. అంతేకాదు అవినీతి రాజకీయాలకు దూరంగా ఉండడం కూడా ఆయనకు రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశంగా మారింది.
మహాయుతి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదనను బాహాటంగా వ్యతిరేకించారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే తనకు అభ్యంతరం లేదని ప్రతిపాదించారు. ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
అయితే అజిత్ పవార్‌కు షిండేకు మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. చివరి కేబినెట్ భేటీలో తన ఇష్టానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల అజిత్ పవార్ ఆగ్రహంతో భేటీ మధ్యలోనే వెళ్లిపోయారు. ఏక్‌నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడం ఇష్టంలేని అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ కోసం గట్టిగా పట్టుబట్టారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముందుండి నడిపించారు. మూడు పార్టీల మధ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్‌తో సహా అందరి ప్రచార కార్యక్రమాలను ఆయనే డిజైన్ చేశారు. అయితే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన నేతకు పదవి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏ నాయకుడు మనస్ఫూర్తిగా పనిచేయలేరని భావించిన అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓటేసింది. అంతేకాదు మహారాష్ట్రలో అభివృద్ధి పనులు చేయడానికి ఫడ్నవీస్ శక్తివంచన లేకుండా కృషి చేయడం ప్రధాని మోడీ దృష్టిని బాగా ఆకర్షించింది.
నాగ్‌పూర్ నుంచి ముంబైకి సమృద్ధి మహామార్గ్, కోస్టల్ రోడ్, అటల్ సేతు, ముంబై మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు జనానికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫడ్నవీస్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఇవన్నీ ఫడ్నవీస్ సీఎం కావడానికి కలిసొచ్చాయి.
ఫడ్నవీస్ ఐదేళ్ల పరిపాలనలో ఎక్కడా అవినీతి మచ్చ పడలేదు. అంతేకాదు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. నాయకులందరినీ కలుపుకొనిపోవడంలో సక్సెస్ అయ్యారు. అలాగే పార్టీకి మోడీ, అమిత్ షా నాయకత్వానికి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్.. షిండే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేయడానికైనా వెనుకాడలేదు. పార్టీ ఆదేశాలు, పార్టీ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని తన వ్యక్తిగత ఇగోలు కావని ఫడ్నవీస్ బాహాటంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా ఆయన సీఎం కావడానికి దోహదపడ్డాయని విశ్లేణకులు చెబుతున్నారు.
2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే అప్పటికి కూటమిలో ఉన్న అజిత్ పవార్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం 80 గంటల్లోనే ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, శరత్ పవార్ సపోర్టుతో ఉద్దవ్ థాక్రే సీఎం అయ్యారు. కానీ శివసేనలో చీలిక వచ్చి థాక్రే ప్రభుత్వం పడిపోయిన తర్వాత షిండే సీఎం కావడానికి అంగీకరించారు.
పార్టీ కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారని.. తన స్థాయిని తగ్గించుకుని ఉపముఖ్యమంత్రి అయ్యారనే సానుభూతి ఫడ్నవీస్‌పై ఉంది. అయితే ఈ సారి 132 సీట్లు సాధించిన తర్వాత కూడా ఫడ్నవీస్ కు సీఎం పదవిని దూరం చేస్తే కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన అధిష్టానం.. ఫడ్నవీస్‌కే పట్టం కట్టింది.
ఇప్పటి దాకా ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ తమ కన్నా తక్కువ స్థానాలు ఉన్న పార్టీ నాయకులను ముఖ్యమంత్రులను చేస్తూ వస్తోంది. బీహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 258 కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్‌కు కేవలం 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. 102 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ కేవలం ఉపముఖ్యమంత్రి పదవి తీసుకుని చిన్న పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసింది. దీన్ని బీజేపీ మిత్ర ధర్మంగా చెబుతూ వస్తోంది. ఇదే ఫార్ములాతో గతంలో ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తే బీజేపీ శ్రేణులతో పాటు నాయకుల్లో వ్యతిరేకత వస్తుందన్న అంచనాలతో ఈ సారి ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈ సారి దేవేంద్ర ఫడ్నవీస్‌కే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



