Top
logo

విక్రమ్ ల్యాండర్ కి కౌంట్ డౌన్!?

విక్రమ్ ల్యాండర్ కి కౌంట్ డౌన్!?
Highlights

చంద్రుడిపై విక్రమ్ ఏం చేస్తున్నట్లు? విక్రమ్ సాఫీగానే దిగిందా? ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ ఎందుకు తెగింది?...

చంద్రుడిపై విక్రమ్ ఏం చేస్తున్నట్లు? విక్రమ్ సాఫీగానే దిగిందా? ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ ఎందుకు తెగింది? చంద్రయాన్-2 ల్యాండింగ్ సందర్భంగా తలెత్తిన సాంకేతిక లోపాలు లేవనెత్తిన ప్రశ్నలెన్నో. దేశం మొత్తం ప్రపంచ వ్యాప్తం చంద్రయాన్-2 ప్రయోగంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. ఇస్రో ప్రయోగం ఆఖరి నిమిషంలో ల్యాండర్ నుంచి సంకేతాలు తెగిపోవడంతో ఏం జరిగిందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఇస్రో చైర్మన్ శివన్ చేసిన ప్రకటన అందరిలోనూ కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. ఆర్బిటర్ ని గుర్తించామన్న స్వీట్ న్యూస్ ని ట్వీట్ చేశారు.

విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడిపై దిగుతూన్న సమయంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలను ఛేదించే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలున్నారు. తాజా పరిశోధనలో సాంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో గుర్తించింది. దీనిపై ఇస్రో ఛైర్మన్ శివన్ ఓ ట్వీట్ చేశారు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను ఆర్బిటర్ ద్వారా గుర్తించామని, ఈ సమాచారంపై విశ్లేషిస్తామని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో దానితో కమ్యూనికేషన్ జరుపుతామని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ చిత్రీకరించింది. ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్టు ఆర్బిటర్ పంపిన చిత్రాలు ద్వారా తెలుస్తోంది.

సెప్టెంబరు 7 తెల్లవారు జామున 1.53 గంటలకు విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని భావించారు. ల్యాండింగ్‌కు మూడు నిమిషాల ముందు నిర్దేశిత లక్ష్యం నుంచి ల్యాండర్ తప్పుకోవడంతో సంకేతాలు నిలిచిపోయాయి. విక్రమ్ నుంచి సంకేతాలు నిలిచిపోవడానికి గల కారణాలపై ఫెల్యూర్ ఎనాలిసిస్ కమిటీ ఆరా తీస్తోంది. ల్యాండర్ పనితీరు క్షితిజ సమాంతర వేగం కంటే ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయినట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విక్రమ్ నుంచి సంకేతాలు నిలిచిపోవడంతో మాండ్రిడ్‌లోని నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్, మారిషష్‌లోని ఇండియన్ స్టేషన్ నుంచి మెషీన్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పరిశీలించారు. మాండ్రిడ్, మారిషస్‌లతో కమ్యూనికేషన్ లేదని, విక్రమ్ సంకేతాలు ఆగిపోయాయని ఎఫ్ఏసీ తెలిపింది.

కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ల్యాండర్‌తో తిరిగి అనుసంధానం కోసం 14 రోజుల పాటు ప్రయత్నాలు చేస్తామని ఇస్రో అంటున్నది. చంద్రయాన్-2 యాత్ర చివర్లో నిర్వహించిన 'పవర్‌ డిసెంట్‌' అంచెలో నాలుగు దశలు ఉన్నాయని, మొదటి మూడు అద్భుతంగా సాగాయన్నారు. చివరిది మాత్రం సాఫీగా జరగకపోవడం వల్లే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని శివన్ వివరించారు. తాజాగా ల్యాండింగ్ లోకేషన్ గుర్తించడంతో శాస్త్రవేత్తల్లో ఆశలు చిగురించాయి.

మరోవైపు దేశం మొత్తం మీ వెంటే ఉందని ప్రధాని ఇస్రోని ప్రోత్సహించడం, భావోద్వేగానికి గురైన ఇస్రో చైర్మన్ శివన్ ని ఓదార్చిన ఘటనలు దేశాన్నే కాదు అంతర్జాతీయ సమాజానికి కూడా ప్రేరణగా నిలిచాయి. నాసా ఇస్రోని అభినందించింది. మీరు మాకు స్ఫూర్తినిచ్చారు భవిష్యత్తులో మీతో కలిసి పనిచేస్తామంటున్నది నాసా. చంద్రుడి ఉపరితలంలో దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దింపడానికి ఇస్రో చేసిన ప్రయత్నాన్ని నాసా శ్లాఘించింది.

చంద్రుడిపై అధ్యయనానికి చంద్రయాన్-2 ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిని ప్రతి ఒక్కళ్లు అభినందిస్తున్నారు. చివరి మెట్టుపై ల్యాండర్ ఆగిపోయినా ఇందులో శాస్త్రవేత్తల పడిన కష్టాన్ని గుర్తించి, గౌరవిస్తున్నారు. అయితే ఈ 14 రోజుల్లో రెండు రోజులు గడిచాయి. మరో 12 రోజులు మాత్రమే మిగిలాయి. మరి ఏం జరగనుంది?

విక్రమ్ ల్యాండర్ కి కౌంట్ డౌన్ నడుస్తున్నది. ఇస్రో... విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కేవలం 14 రోజుల నిడివి ఉండే పగటి సమయంలోనే మనుగడ సాగించేలా రూపొందిచారు. ఆతర్వాత 14 రోజుల నిడివి ఉండే దశ మొదలవుతుంది. ఆ దశలో ఉష్ణోగ్రతలు 180 మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. అంత శీతల వాతావరణాన్ని ల్యాండర్ తట్టుకోలేదు. కాబట్టి ఈ 12 రోజుల్లోనే ల్యాండర్ పునరుద్ధరణ జరగాలి. సౌరశక్తితో రీచార్జ్ కావాలి. ఈ లోగా చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.

ల్యాండర్ ఏమైంది? చంద్ర మండలంపై ఏం జరుగుతున్నది? అసలు ల్యాండర్ పని చేస్తున్నదా? అటు శాస్త్రవేత్తల్ని, ఇటు సామాన్యులని తొలుస్తున్న ప్రశ్నలివి. ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయి ఉంటుందనే అంతా భావిస్తున్నారు. కమ్యూనికేషనే లేకపోవడమే అసలు సమస్య. చంద్రుడిపై వాతావరణ సమస్యలు మారితే సమాచారం కూడా చేరవచ్చనే విశ్వాసం వ్యక్తమవుతున్నది. ఆర్బిటర్ నుంచి వచ్చే సమాచారంతోనే ల్యాండర్ స్థితిగతులని అంచనా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇస్రో ఈ సమాచార సేకరణకు విఫలయత్నం చేస్తున్నది.

కమ్యూనికేషన్ పోవడానికి కారణాలేంటి? పునరుద్ధరణ సాధ్యమేనా? ఒకవేళ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోతే పరిస్థితి ఏంటి? గంటకు 6వేల కీలోమీటర్ల నుంచి 1,630 కిలో మీటర్ల లకు స్పీడ్ తగ్గించుకున్న ల్యాండర్ ఆ పై వేగాన్ని అదుపు చేసుకోలేదన్నది శాస్త్రవేత్తల అనుమానం.

మరైతే చంద్రయాన్-2 విఫలమా? సఫలమా? ల్యాండర్ కమ్యూనికేషన్ అందించనంత మాత్రాన చంద్రయాన్-2 విఫలం అయినట్లు కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్-2లో మొత్తం 13 పరిశోధనా పరికరాలున్నాయి. అందులో 8 పరికరాలు ఆర్బిటర్ లోనే ఉన్నాయి. ల్యాండర్ లో 3 పరికరాలు, రోవర్ లో 2 పరికరాలున్నాయి. ప్రస్తుతం ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో విజయవంతంగా తిరుగుతున్నది. అంటే అందులోని 8 పరికరాలు పని చేస్తాయి. కాబట్టి రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు, ఫోటోలు తీయడం, చంద్రుడి బాహ్య వాతావరణాన్ని పరిశీలించడం, నీటి జాడలు తెలుసుకోవడం వంటి పనులు చేస్తూనే ఉంటుంది. అంటే చంద్రయాన్-2 విఫలం కానట్లేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పుడు చంద్రుడి మీద పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ ని ఏడాది కాలం పని చేసేలా ఇస్రో రూపొందించింది. చంద్రయాన్ 2 ప్రయోగ సమయంలో జిఎస్ఎల్ వి మార్క్-3 అంచనాలకు మించి పనిచేయడంతో నిర్దేశిత ప్రదేశానికన్నా ఎత్తులో అది పరిభ్రమిస్తున్నది. దీంతో ఆర్బిటర్ లోని ఇంధనం ఆదా అయిందని, దాని జీవిత కాలం మరింతగా పెరిగి ఏడున్నరేళ్ళకు చేరుతుందని ఇస్రో అంచనా. భూమికి చంద్రమామకి మధ్య దూరం 3లక్షల 84వేల కిలోమీటర్లు. చంద్రయాన్-2 3లక్షల, 83వేల, 998 కిలోమీటర్లు దిగ్విజయంగా ప్రయాణించింది. ఈ లెక్కన అత్యంత స్వల్ప తేడాతోనే అత్యద్భుత ఆవిష్కరణ మిస్సైంది.

మరి భవిష్యత్తేంటి? చంద్రయాన్-2 ద్వారా ఏమి జరగుతుంది? అంటే... ఇప్పుడు ఇదే విషయమై ఇస్రో... కమ్యూనికేషన్ డాటాను విశ్లేషిస్తున్నది. విక్రమ్ కూలిపోయిందా? లేక సాఫ్ట్ ల్యాండ్ అయిందా? అన్నదాన్ని తేల్చే పనిలో ఉంది. ప్రయోగ ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రయోజనాలు మాత్రం కచ్చితంగా చేకూరుతాయని ఇస్రో అంటున్నది. బెస్ట్ విషెస్ టు ఇస్రో.

Next Story

లైవ్ టీవి


Share it