Indian Navy: ఇండియన్ నేవీకి ఇవి ఎందుకు తిరుగులేని బ్రహ్మస్త్రాలు? వాటి ప్రత్యేకతలేంటి?

Pavan Reddy
Updated on: 17 Jan 2025 10:03 AM IST
What are the features, strengths of INS Surat, INS Nilgiri, INS Vagsheer and why they are game changers in Indian Navy
X

Indian Navy: ఇండియన్ నేవీకి ఇవి ఎందుకు తిరుగులేని బ్రహ్మస్త్రాలు? వాటి ప్రత్యేకతలేంటి?

Indian Navy gets new arms: భారత రక్షణ రంగానికి భారీ బూస్టింగ్ వచ్చింది. భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో మూడు భారీ అస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాని మోదీ ఐఎన్ఎస్ వాగ్‌షీర్ సబ్‌మెరైన్‌, ఐన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనే రెండు భారీ యుద్ధ నౌకలను జనవరి 15న జాతికి అంకితం చేశారు. ఈ మూడు అస్త్రాల రాకతో ఇండియన్ నేవీలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది.

సింపుల్‌గా చెప్పాలంటే, ఈ మూడు యుద్ధ నౌకలు భారత్‌పై శత్రువుల కన్ను పడకుండా అడ్డుగోడలా నిలుస్తాయి. అంతేకాదు... రక్షణ రంగంలో భారత్‌ను ప్రపంచదేశాల్లో బలమైన ఆయుధ సంపత్తి కలిగిన దేశాల సరసన నిలిచేలా చేశాయి. మరి ఈ మూడింటిలో ఏయే యుద్ధ నౌకకు ఎలాంటి ప్రత్యేకతలున్నాయి?, శత్రువులను గడగడలాడించేంతగా వాటికున్న గొప్ప బలమేంటి? వీటితో కొత్తగా దేశానికి వచ్చే లాభమేంటనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

ఐఎన్ఎస్ సూరత్

ఐఎన్ఎస్ సూరత్ భారత్ అమ్ముల పొదిలోకి వచ్చి చేరిన అధునాతన యుద్ధ నౌక. శత్రు దేశం విసిరే మిసైల్స్‌ను ఆకాశంలోనే ధ్వంసం చేస్తుంది. సముద్రంలో గస్తీ కాస్తూ శత్రువులను వెతికి వెంటాడి పట్టుకుంటుంది. ఒక్క మాటలో ఇది సముద్రంలో తిరిగే పెద్ద ఆయుధాల గోడౌన్. ఈ నౌక సుదూర ప్రాంతాల్లోని శత్రువుల కదలికలను నిరంతరం 360 డిగ్రీలలో కనిపెడుతుంది. లక్ష్యాలను కచ్చితంగా టార్గెట్ చేస్తుంది.

అత్యాధునిక సర్వెలియెన్స్ రాడార్స్, సెన్సార్లు కలిగిన ఈ నౌక పొడవు 163 మీటర్లు. ఇది 16 బ్రహ్మోస్ యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను మోసుకెళ్తుంది. ఈ యుద్ధ నౌకపై 32 బరాక్-8 సర్‌ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, నాలుగు 533MM టోర్పడోస్, రెండు RBU-6000 యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్స్ ఉంటాయి. శత్రు దేశం ఎప్పుడు దాడి చేసినా... ఆ దాడులను సముద్రంపై నుండే తిప్పికొట్టే తిరుగులేని ఆయుధాలతో ఐఎన్ఎస్ సూరత్‌ సిద్ధంగా ఉంటుంది.

అంతేకాదు, ఒక మెరాలా 76MM నావల్ గన్, నాలుగు AK-630M గన్స్, రెండు 12.7-mm M2 రిమోట్ గన్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఈ నౌక సొంతం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా రెండు యుద్ధ హోలీక్యాప్టర్లను కూడా వెంట తీసుకెళ్లగలదు.

ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ 15-A కింద గతంలో ఐఎన్ఎస్ కోల్‌కత, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై వంటి యుద్ధ నౌకలను తయారు చేశారు. ఆ తరువాత తీసుకొచ్చిన ప్రాజెక్ట్ 15-B కింద ముందుగా ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మొర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ తయారు చేశారు. అదే కోవలో వచ్చిన నాలుగో యుద్ధనౌకనే ఈ ఐఎన్ఎస్ సూరత్. ఇవన్నీ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం సహాయంతో ముంబైలోని మజ్‌గావ్ డాక్‌యార్డ్ కంపెనీ తయారు చేసినవే కావడం విశేషం. ఐఎన్ఎస్ సూరత్ నౌకతో కలిపి భారత్ చుట్టూ సముద్రంలో మొత్తం 13 డిస్ట్రాయర్స్ దేశానికి కాపలా కాస్తున్నాయి. అత్యంత బరువైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కిమీ వేగంతో వెళ్తుంది.

ఐఎన్ఎస్ నీలగిరి

ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకను ఫ్రిగేట్ అని అంటారు. ఇప్పటివరకు చెప్పుకున్న డిస్ట్రాయర్ కంటే ఫ్రిగేట్ కొంచెం తక్కువ సైజులో ఉంటాయి. ఇవి డిస్ట్రాయర్స్ కంటే కొంత వేగంగా వెళ్లడానికి అనువుగా డిజైన్ చేస్తారు. సముద్రంలో శత్రువుల కదలికలపై కన్నేసి పెడుతూనే వాణిజ్యానికి సంబంధించిన ఓడలకు ఇవి రక్షణ కల్పిస్తుంటాయి. మర్చంట్ షిప్స్‌ను సోదాలు చేయడానికి ఫ్రిగేట్స్ ఉపయోగిస్తారు. ఆ ఓడలకు శత్రువుల నుండి రక్షణ కల్పించడానికి కూడా ఈ ఫ్రిగేట్స్ సహాయపడతాయి.

రహదారిపై వీఐపీల కాన్వాయ్‌కు రక్షణగా పైలట్ వాహనం ఎలా ముందుండి నడిపిస్తుందో... సముద్రంలో ఈ ఫ్రిగేట్ నౌకలు కూడా అంతే. ఇవాళ ప్రధాని మోదీ సముద్ర జలాల్లోకి వదిలిన మూడు యుద్ధ నౌకల్లో ఒకటైన ఐఎన్ఎస్ నీలగిరి కూడా ఈ రకం కిందకే వస్తుంది.

ఈ ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకపై ఎల్లవేళలా 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ రెడీగా ఉంటాయి. శత్రువుల మిస్సైల్స్‌ను నింగిలోనే ఛేదించి సముద్రంలోనే కూల్చేసే శక్తి వీటి సొంతం. ఇవేకాకుండా ఒక 76mm గన్, మరొక AK-630 గన్ వంటి అత్యాధునిక ఆయుధాలు కూడా ఉంటాయి. అత్యవసరంలో ఫైటర్స్ నింగిలోకి ఎగిరేందుకు హెలీక్యాప్టర్స్‌ను కూడా మోసుకెళ్తుంది. ఆగస్టులోనే ఈ నౌకపై ట్రయల్స్ పూర్తి చేశారు. ప్రపంచంలో ఏ ఫ్రిగేట్ నౌక అయినా ఈ ఐఎన్ఎస్ నీలగిరి తరువాతే. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధనౌక విశిష్టతల గురించి చెబుతూ నౌకను తయారు చేసిన మజ్‌గావ్ డాక్ యార్డ్ కంపెనీ చెప్పిన మాట ఇది.

ఐఎన్ఎస్ వాగ్‌షీర్ సబ్‌మెరైన్

ఇదొక డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్. కల్వరి క్లాస్ ప్రాజెక్ట్ 75 కింద ఈ సబ్‌మెరైన్‌ను తయారు చేశారు. సముద్రం అట్టడుగున చాలా నిశ్శబ్దంగా తిరుగుతూ శత్రువుల కదలికలు గుర్తించడం, వారిని దెబ్బకొట్టడం ఈ సబ్‌మెరైన్ ప్రత్యేకత. సముద్రం పైనుండి, సముద్రంలోపల నుండి శత్రువుపై మిస్సైల్స్‌తో దాడి చేయడంలో ఐఎన్ఎస్ వాగ్‌షీర్ దిట్ట.

ఇది సముద్రం లోపల గంటకు 37 కిమీ వేగంతో వెళ్తుంది. సముద్రంపై గంటకు 20 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీలను కూడా అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ సబ్‌మెరైన్‌ను తయారు చేశారు.

దేశ చరిత్రలో ఇలా ఒకేసారి రెండు యుద్ధ నౌకలు, ఒక సబ్‌మెరైన్‌ను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ మూడు యుద్ధ నౌకలను ఒకేసారి లాంచ్ చేసి భారత్ తమ శత్రు దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ఈ రెండు యుద్ధ నౌకలతో పాట వాగ్‌షీర్ జలాంతర్గామిని కూడా భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించారు. వీటిని జాతికి అంకితం చేయడం ద్వారా భారత్ తన ఆయుధ సంపత్తి కోసం ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదని కూడా చెప్పినట్లయింది.

Pavan Reddy

Pavan Reddy

Next Story