Indigo crisis: ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభం

Indigo crisis: ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభం
x

Indigo crisis: ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభం

Highlights

ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభం విమానాశ్రయాల్లో గంటల తరబడి ప్రయాణికుల అవస్థలు క్యాబిన్ క్రూ, పైలట్ల వంటి సమస్యలతో ఇండిగో సతమతం ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు అన్ని విమానాలు రద్దు

దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రయాణీకులకు సరైన సమాచారం అందడం లేదు. చివరి నిమిషాల్లో విమానాల రద్దుతో గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.. ఎయిర్‌ పోర్టులో గంటల తరబడి తిండి, నిద్ర లేక గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు టికెట్ల ధరలు రెట్టింపై జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిర్వహణపరమైన లోపాలే కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి వరకూ పరిస్థితి ఇంతేనని చెబుతోంది ఇండిగో సంస్థ. ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు పౌర విమానయాన శా‌ఖ‌ అధికారులు.


భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పెద్ద దెబ్బే కొట్టింది. విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో విమానయాన సంస్థ తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం. అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్‌ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల్లో కౌంటర్ల దగ్గర ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


సాధారణంగా అత్యవసర ప్రయాణాలు, వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు విమానాలకు ఎందుకుంటారు. కానీ ఇండిగో విమానాల్లోని ప్రతి మూడింటిలో రెండు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం మొత్తం 550కిపైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 79 విమానాలు రద్దయ్యాయి. దిల్లీలో 172, ముంబయిలో 118, బెంగళూరులో 100, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి.

విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌-ఇన్‌ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై ప్రయాణికులు గ్రహం వ్యక్తం చేస్తున్నారు..


విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌లైన్‌ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు, తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో సరైన చోటు లేక.. చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ‌్యంగా దీక్ష విరమణ కోసం శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇండిగో విమానాల రద్దు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు. తమ కష్టాలను పట్టించుకునే నాధుడేలేడని వాపోయారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్పస్వాముల ఆందోళనకు దిగారు. కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో... ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన సమాచారం కూడా చెప్పడం లేదని.. ప్రయాణికులను పట్టించుకోవడం లేదని.. స్వాములు మండిపడ్డారు.


నిర్దేశిత సమయానికన్నా ఆలస్యంగా విమానాలు బయల్దేరుతాయన్న సమాచారంతో అందుకు సిద్దపడి వేచి చూసినా సర్వీసులు అందుబాటులోకి రాకపోవడం ప్రయాణీకులుల్లో అసహనానికి కారణమవుతోంది మరోవైపు ఇండిగో విమానాల నిర్వహణ గందరగోళ కారణంగా టికెట్ల ధరలు పెరిగిపోయాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్‌ ధరలు దాదాపు రెండు, మూడు రెట్లు పెరిగాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ- ముంబయి మార్గంలో పలు ఎయిర్‌లైన్ల టికెట్‌ ధరలు రూ.20 వేల నుంచి రూ.40 వేలు వరకు ఉన్నాయి. సాధారణ సమయాల్లో చివరి నిమిషంలో బుక్‌ చేసుకున్నా దాదాపు రూ.20వేలు వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ ధర ఏకంగా దాదాపు రూ.60వేలు వరకు పెరగడం గమనార్హం. ముంబయి-శ్రీనగర్‌లలో సాధారణ రోజుల్లో రూ.10వేలు ఉండే టికెట్‌ ధర.. ఇప్పుడు ఏకంగా రూ.62 వేలకు పెరిగింది. రౌండ్‌ట్రిప్‌ అయితే దాదాపు రూ.92వేల వరకు ఉంది.


ఇండిగో విమాన సంస్థ రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిరిండియాతో పోలిస్తే ఇది రెండింతలు. దీంతో 10 శాతం సర్వీసులపై ప్రభావం ఉన్నా.. దాదాపు 200 ఫ్లైట్లు రద్దవుతాయి. అయితే, FDTL నియమాల అమలు విషయంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌’ ఆరోపించింది. రెండేళ్ల సమయం ఉన్నా.. తగిన ప్రణాళికలు రచించలేదని పేర్కొంది. DGCAపై ఒత్తిడి పెంచడం కోసం కావాలనే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం కల్పించారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

కాగా విమానాల నిర్వహణలో అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చుకుంటోంది. సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల షెడ్యూల్‌లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్‌ నియమాలు సమస్యలుగా చెప్పుకొచ్చింది.


ఇటీవల DGCA పైలట్లు సహా ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సమయాల్లో మార్పులు చేసింది. అందులో ముఖ్యమైనవి..

వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు

రాత్రి పనివేళలను అర్ధరాత్రి నుంచి వేకువజామున ఐదు గంటలకు మార్పు. గతంలో ఇది ఆరు గంటల వరకు ఉండేది.

14 రోజుల్లో మొత్తం పనిగంటలు 95 మించకూడదు. గతంలో ఇది 100 గంటలుగా ఉండేది.

ఒక్కరోజులో డ్యూటీ టైమ్‌ 12 గంటలు ఉండగా.. దీన్ని 10 గంటలకు తగ్గించారు.

నైట్‌ డ్యూటీ ముగించుకున్న తర్వాత కనీసం 12 గంటల రెస్ట్‌ ఉండాలి. ఇంతకుముందు ఇది 10 గంటలుగా ఉండేది.

వీటిని డీజీసీఏ 2024 మేలోనే నోటిఫై చేసింది. ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని, నవంబర్‌ 1 నుంచి రెండో దశలో మరికొన్ని నియమాలను ఇండిగో మల్లోకి తీసుకొచ్చింది. దీంతో పైలట్లు, సిబ్బంది తగిన స్థాయిలో అందుబాటులో లేకుండా పోయారు. దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడుకావటంతో గందరగోళం తీవ్రమైంది.


విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యంపై దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో సంస్థ.. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)ను ఆశ్రయించింది. ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ (FDTL) నిబంధనల నుంచి ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని ఎయిర్‌లైన్‌ కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తూ.. డీజీసీఏ ఆదేశాలిచ్చింది. పైలట్లకు వారంపాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ.. నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. దీనిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయడుతో మాట్లాడారు. పరిస్థితిని అమిత్‌షాకు వివరించారు. విమాన సేవలను సాధారణ స్థితికి తేవడమే తమ తక్షణ లక్ష్యమని, సమయ పాలనపై పని చేస్తున్నామని, అయితే అది అంత సులభం కాదని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు.ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories