Uttarakhand: ఒక్కసారిగి విరిగిపడ్డ కొండ చరియలు.. తృటిలో తప్పించుకున్న ఎంపీ

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్న గర్హ్వాల్‌ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

Arun Chilukuri
Published on: 18 Sept 2025 2:27 PM IST
Uttarakhand: ఒక్కసారిగి విరిగిపడ్డ కొండ చరియలు.. తృటిలో తప్పించుకున్న ఎంపీ
X

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్న గర్హ్వాల్‌ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్‌కి ముందు బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో ఎంపీ, ఆయన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలీ, రుద్రప్రయాగ్‌లలో పర్యటించిన అనంతరం ఎంపీ బలూనీ తిరిగి రిషికేశ్‌కు వెళ్తుండగా దేవప్రయాగ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటం గమనించారు. వెంటనే అప్రమత్తమై కారు దిగి, సిబ్బందిని, ఇతరులను అప్రమత్తం చేశారు. అయితే, వారు తేరుకునేలోపే పర్వతంలోని భారీ భాగం ఊహించని విధంగా విరిగిపడింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.

ఈ భయానక అనుభవాన్ని బలూనీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. నిన్న సాయంత్రం నేను ఎదుర్కొన్న భయానక దృశ్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే మన రాష్ట్రం ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందో తెలుస్తుంది," అని ఆయన పోస్ట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ఆయన అభినందించారు.

ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఉత్తరాఖండ్ వరుసగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా అనేక జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం నందా నగర్‌లోని కుంటారీ, ధుర్మా ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ వల్ల దాదాపు 10 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story