Top
logo

BUDGET 2020 : రెండు పేజీలు మిగిలి ఉండగానే ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. కారణం ఏంటంటే...

BUDGET 2020 : రెండు పేజీలు మిగిలి ఉండగానే ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. కారణం ఏంటంటే...
X
Highlights

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో...

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ రెండోసారి బడ్జెట్‌ పాఠం చదివి వినిపించారు. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. అయితే సుదీర్ఘంగా బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింపు వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ ఇది. బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్దపీట వేసిన సర్కార్‌ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేసింది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. నూతన సాంకేతిక పద్దతులు అమలు చేస్తామని, మోడీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు.

ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు భారీగానే చేసిన కేంద్రం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద అర్హులుగా ప్రకటిస్తామని మంత్రి లోక్‌సభలో తెలిపారు. వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యంగా, వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం అయ్యే విధంగా, వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. కేంద్ర చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇస్తూనే అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం తీసుకుంటామని తెలిపింది. 2020-21లో అగ్రికల్చర్‌ రీఫైనాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ధారించిన సర్కార్‌ స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తామని ప్రకటించింది.

ఇక వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు, కేవలం వ్యవసాయానికి మాత్రం రూ.1.60 లక్షల కోట్లు కేటాయించిన సర్కార్‌ గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు ఇస్తామని తెలిపింది. త్వరలో కొత్త విద్యా విధానం తీసుకొస్తామని చెబుతూనే మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టున్నట్టు ప్రకటించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్ ఇస్తూనే వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించింది. జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.11,500 కోట్లు, ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు ఇస్తున్నట్టు తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన కేంద్రం స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు ఇచ్చింది. ఇక- రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ‌ను ఏర్పాటు చేస్తామన్నది. ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేస్తామని తెలిపిన నిర్మలసీతారామన్‌. మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.

త్వరలో నేషనల్ లాజిస్టిక్ పాలసీని పరిచయం చేస్తామని చెప్పిన నిర్మల పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లను ప్రవేశపెడుతామని చెప్పారు. క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు, బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు, షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ. 85 వేల కోట్లు, షెడ్యూల్‌ తెగల కోసం రూ.53,700 కోట్లు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు, జమ్మూకశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు ,లఢక్‌ అభివృద్ధికి రూ.5,958 కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 3.50 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.8శాతం గా ఉందన్న నిర్మలా ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల విక్రయానికి అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ఆదాయ పన్ను స్లాబులో మార్పులు చేస్తూనే పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికం చేశారు.


Web TitleUnion Budget 2020 highlights by Nirmala Sitharaman
Next Story