TOP 6 News @ 6PM: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్... రీకౌంటింగ్‌కు ఆప్షన్

TOP 6 News @ 6PM: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్... రీకౌంటింగ్‌కు ఆప్షన్
x
Highlights

1) TSPSC Group 1 results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయోచ్...Telangana Group 1 reults released : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ...

1) TSPSC Group 1 results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయోచ్...

Telangana Group 1 reults released : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది. 563 పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,151 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం గ్రూప్ 1 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రిలీమ్స్ తరువాత మెయిన్స్ కు క్వాలిఫై అయిన వారి సంఖ్య 67.3 శాతంగా ఉంది.

గతేడాది అక్టోబర్ 21 నుండి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. మార్కుల విషయంలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ముగిసిన తరువాత అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తారు. దీంతో గ్రూప్ 1 నియామకాల తుది ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు అవుతుంది.

2) Pranay Murder Case: ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

Pranay Murder Case: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మార్చి 10న తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధం ఉన్నఎనిమిది మందిలో ఏ 1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన దోషులకు ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు ఆయనను హత్య చేశారు.

ప్రణయ్, అమృత చిన్ననాటి స్నేహితులు. ఈ స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమకు అమృత పేరేంట్స్ అభ్యంతరం తెలిపారు.వీరిద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు. దీంతో అమృత పేరేంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రణయ్ ను అమృత కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. 2018 జనవరి 31న అమృత, ప్రణయ్ హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరూ మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ పెళ్లి రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రణయ్ హత్యకు గురయ్యారు. సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు వీరే

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ నుండి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో వీరు నామినేషన్ దాఖలు చేశారు.

శాసన సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చింది. ఆ మిత్ర ధర్మం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి ఇచ్చింది. దీంతో ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యంకు ఆ అవకాశం లభించింది.

ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాసోజు శ్రవణ్‌ పేరును ఆ పార్టీ సిఫార్సు చేసినప్పటికీ, అప్పటి గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది.

4) ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్యలో భారీ పెరుగుదల... ఎందుకో తెలుసా?

Women buying homes: మహిళా శక్తిని చాటి చెప్పే మరో నివేదిక ఇది. మహిళలు అంటే హోమ్ మేకర్స్ మాత్రమే కాదు... వారు హోమ్ బయర్స్ కూడా అని నిరూపించుకుంటున్నారు. ఔను, సొంతంగా ఇల్లు కొంటున్న మహిళల సంఖ్య ఏ ఏడాదికి ఆ ఏడాదికి పెరిగిపోతోంది. 2023 తో పోల్చుకుంటే 2024 లో ఇల్లు కొన్న మహిళల సంఖ్య 14 శాతం పెరిగింది. 2023 లో ఇళ్లు కొన్న మహిళల సంఖ్య 1.14 లక్షలుగా ఉంది. ఇది ఆ ఏడాదిలో ఇల్లు కొనుగోలు చేసిన మొత్తం జనంలో 20 శాతంగా ఉంది. ఇక 2024 ఆ సంఖ్య 1.29 లక్షలకు పెరిగింది. 2024 లో మొత్తం ఇళ్లు కొనుగోలు చేసిన వారిలో ఇది 22 శాతం. అంటే ఏ విధంగా చూసుకున్నా, సొంతింటి కల నిజం చేసుకుంటున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది.

రియల్ ఎస్టేట్ బిజినెస్‌ అభివృద్ధికి బూస్టింగ్ ఇస్తోన్న మహిళలు

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్న స్క్వేర్ యార్డ్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ విషయం వెలుగుచూసింది. 'కీ హోల్డర్స్ ఆఫ్ చేంజ్ - ఉమెన్ డ్రైవింగ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇన్ 2024' పేరుతో స్క్వేర్ యార్డ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధిలో సొంతంగా ఇళ్లు కొనుగోలుచేస్తోన్న మహిళల సంఖ్య పెరుగుతుండటం కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Lalit Modi: లలిత్ మోదీకి షాక్.. వనాటు పౌరసత్వం రద్దు

Lalit Modi: లలిత్ మోదీకి వనాట్ పౌరసత్వం రద్దు చేయాలని ఆ దేశ ప్రధానమంత్రి జోథం నపాట్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ తనభారత పాస్ పోర్టును లండన్ లో భారత అధికారులకు అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు.అదే సమయంలో వనాట్ పౌరసత్వాన్ని కూడా ఆయన పొందారు.

లలిత్ మోదీ వనాటు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఇంటర్ పోల్ స్క్రీనింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి నేరాలకు సంబంధించిన సమాచారం లేవని వనాటు అధికారులు గుర్తించారు. కానీ, లలిత్ మోదీకి వనాటు పౌరసత్వం తీసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో భారత్ ఇంటర్ పోల్ ను లలిత్ మోదీ కోసం అభ్యర్ధించిన విషయాన్ని వనాటు అధికారులు గుర్తించారు.

6) Champions Trophy 2025: ఛాంపియన్ గా భారత్ .. కనిపించని పీసీబీ చైర్మన్.. వివాదాస్పదంగా అక్తర్ ప్రకటన

Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టోర్నమెంట్ ఫైనల్ విజేతకు అవార్డుల ప్రదానోత్సవం జరిగినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఏ అధికారి కనిపించలేదు. దీంతో వివాదం మొదలైంది. దీనికి షోయబ్ అక్తర్ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఆయన చెప్పడం ద్వారా అది మరింత ముదిరింది. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పీసీబీ ఛైర్మన్ ప్రజెంటేషన్ వేడుకలోనే కాకుండా దుబాయ్‌లో కూడా ఎందుకు కనిపించలేదో స్పష్టం అయింది.

వసీం అక్రమ్ ప్రకారం..పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ కోసం దుబాయ్ చేరుకోకపోవడానికి అసలు కారణం ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడమే. స్పోర్ట్స్ సెంట్రల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో దీని గురించి సమాచారం ఇస్తూ..‘‘నాకు తెలిసినంత వరకు పిసిబి చైర్మన్ ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆయన ఫైనల్‌కు వెళ్లలేకపోయారని అన్నారు. పీసీబీ నుండి ఇద్దరు అధికారులు సుమేర్ అహ్మద్, ఉస్మాన్ వాలా - అక్కడికి చేరుకున్నప్పటికీ వారు వేదికపైకి ఎందుకు వెళ్లలేదో తెలియదని వసీం అక్రమ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories