Pranay Murder Case: నల్గొండ కోర్టు సంచలన తీర్పు

Pranay Murder Case: నల్గొండ కోర్టు సంచలన తీర్పు
x
Highlights

Pranay Murder Case: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు మార్చి 10న తుది తీర్పు వెల్లడించింది.

Pranay Murder Case: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మార్చి 10న తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధం ఉన్నఎనిమిది మందిలో ఏ 1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన దోషులకు ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు ఆయనను హత్య చేశారు.

అసలు ఏం జరిగింది?

ప్రణయ్, అమృత చిన్ననాటి స్నేహితులు. ఈ స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమకు అమృత పేరేంట్స్ అభ్యంతరం తెలిపారు.వీరిద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు. దీంతో అమృత పేరేంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రణయ్ ను అమృత కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. 2018 జనవరి 31న అమృత, ప్రణయ్ హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరూ మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ పెళ్లి రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రణయ్ హత్యకు గురయ్యారు.

1600 పేజీల్లో చార్జీషీట్

ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు విచారణ చేశారు. అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కేసుకు సంబంధించి 2019 జూన్ 12న పోలీసులు 1600 పేజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1 గా అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, ఏ2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, ఏ3గా అజ్గర్ అలీ, ఏ4గా అబ్దుల్ బారీ, ఏ5 గా ఎం.ఏ కరీం, ఏ6 గా తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ7 గా శివ, ఏ8 గా నిజాంను నిందితులుగా చేర్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించారని పోలీసులు తమ విచారణలో తేల్చారు.

ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు

ప్రణయ్ హత్య కేసులో ఏ1 గా ఉన్న తిరునగరు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు.హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్యభవన్ లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. అమృత అమ్మ వద్దకు వెళ్లు.. అంటూ ఆయన ఆ సూసైడ్ లేఖలో రాసినట్టు అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. గిరిజా తనను క్షమించాలని ఆయన తన భార్యనుద్దేశించి ఆ లేఖలో రాశారు. హైదరాబాద్ లో ప్రముఖ లాయర్ తో మాట్లాడేందుకు వచ్చి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories