Truck Drivers Protest: ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

Truck Drivers Protest Against New Provisition Under Hit And Run
x

Truck Drivers Protest: ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

Highlights

Truck Drivers Protest: చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లారీ డ్రైవర్ల, పెద్ద వాహనాల డ్రైవర్లు

Truck Drivers Protest: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. దీంతో భారీ స్థాయిలో ఇంధన రవాణా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తారు.

భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నింబంధనలను వెంటనే సడలించాలని.. డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు..

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్‌ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. మధ్యప్రదేశ్, భోపాల్, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పించింది. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే, నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.

కాగా.. తెలంగాణలోనూ బంక్‌లకు వాహనదారులు పోటెత్తడంతో.. పలు ప్రాంతాల్లో బంకుల్లో రద్దీ నెలకొంది. ఖాళీ క్యాన్లతో క్యూ కట్టారు. జనం పోటెత్తడంతో.. హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేస్తు్న్నారు. ఉన్నఫళంగా పెట్రోల్ బంకులు రద్దీ నెలకొనడంతో.. వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories