దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం పిలుపు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం పిలుపు
x
Highlights

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సిద్ధమైంది. కార్మికుల హక్కులను...

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సిద్ధమైంది. కార్మికుల హక్కులను కాలరాసేలా తెచ్చిన విధానాలను, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు, బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే నిర్ణయాలను, 12 గంటల పని విధానాలను, నూతన విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టింది. ఈ సమ్మెలో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నట్టు కార్మిక ఐక్యవేదిక ప్రకటించింది.

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా పలు డిమాండ్లు చేస్తూ ఈ సమ్మెను చేపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కీమ్‌ వర్కర్లు, గృహ, నిర్మాణ, బీడీ కార్మికులు, వెండార్లు, వ్యవసాయ కార్మికులు, స్వయం ఉపాధి పొందిన వారు రాస్తారోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆటో, టాక్సీ డ్రైవర్లు కూడా రోడ్డుపైకి వాహనాలు తీసుకురావొద్దని నిర్ణయించారు. సమ్మెలో అఖిల భారత బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, అఖిల భారత బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొనున్నాయి. దీంతో బ్యాంకింగ్‌ సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

ఎన్నో దశాబ్దాలపాటు పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను కాలరాస్తూ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, అందరికీ పెన్షన్‌, ఎన్‌పీఎస్‌ రద్దు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ చేపట్టాలని సూచిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు 7వేల 500 బదిలీ చేయాలని, నిరుపేదలకు నెలకొ ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత రేషన్ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో 200 రోజులకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

సార్వత్రిక సమ్మెకు పలు పార్టీలు, సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు తెలిపింది. అలాగే కార్మిక యూనియన్ల సమ్మెకు ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌, టీయూడబ్ల్యూజే, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం మద్దతు ప్రకటించాయి. సింగరేణి మొదలుకొని ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రక్షణ శాఖ బ్యాంకింగ్‌ ఫెడరేషన్‌, రైల్వే ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ వంటి ట్రేడ్‌ యూనియన్లు సమ్మెను విజయవంతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నూతన విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు, నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల యజమాలు కూడా పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories