Top 6 News @ 6 PM: ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6 PM: ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు: మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

1. ఎస్సీ లను మూడు గ్రూపులుగా విభజించాలి.. కమిషన్ సిఫారసు

ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఎస్సీలో మొత్తం 59 ఉప కులాలను కమిషన్ గుర్తించింది. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3 వర్గీకరించాలని సిఫారసు చేసింది.

గ్రూప్1లోని 15 ఉప కులాలను 1 శాతం, గ్రూప్ 2 రిజర్వేషన్ లోని 18 ఉపకులాలకు 9 శాతం, గ్రూప్ 3లోని 26 ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సూచించింది.

2. ఏపీ ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా పి. రామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా పులపర్తి రామాంజనేయులును నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటీఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావును నియమించారు. దీంతో మూడు ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైందని స్పీకర్ కార్యాలయం తెలిపింది.

3. భూముల వివరాలు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చెప్పలేదు: రేవంత్ రెడ్డి

కులగణన సర్వేలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పాల్గొనలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా ఈ విషయాన్ని సీఎం వివరించారు.

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొనలేదన్నారు.ఎంత భూమి ఉందో సమాచారం చెప్పాలని కోరితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సమాచారం ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

4. సుచిర్ బాలాజీ మృతిపై న్యాయ పోరాటం

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పేరేంట్స్ కోర్టును ఆశ్రయించారు. సుచిర్ మరణానికి సంబంధించి పోలీసులు తమకు స్పష్టమైన వివరాలు అందించలేదని బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది. సుచిర్ బాలాజీ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. దీనిపై సుచిర్ తల్లి పూర్ణిమా అభ్యంతరం వ్యక్తం చేశారు. సుచిర్ నివసించిన ప్లాట్ లో తమకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని చెప్పారు.

2024 నవంబర్ 26న సుచిర్ బాలాజీ మరణించారు. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ప్రకటనపై బాలాజీ తల్లి అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆమె న్యాయ పోరాటానికి దిగారు.

5. అంగన్ వాడీలో బిర్యానీ, చికెన్ ఫ్రై కోరిన చిన్నారి

అంగన్ వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని కేరళలోని శంకు అనే చిన్నారి తన తల్లిని అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోపై మంత్రి వీణా జార్జి స్పందించారు. అంగన్ వాడీలో పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. గుడ్లు, పాలు అందిస్తున్న విషయాన్ని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న ఆహారం గురించి పరిశీలిస్తామన్నారు.

6. శేఖర్ బాషా, మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు

డ్రగ్స్ కేసులో తన పేరును ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని శేఖర్ బాషాపై మన్నేపల్లి లావణ్య మంగళవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను పోలీసులకు ఆమె అందించారు. డ్రగ్స్ ను తన ఇంట్లో పెట్టి ఆ కేసులో తనను ఇరికించే ప్రయత్నించారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories