సిల్వర్ కోసం 'స్కార్పియో' రేంజ్ స్కెచ్: వృద్ధురాలిని మంచంతో సహా మోసుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‌లో విస్తుపోయే ఘటన!

Rajasthan: వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో దొంగల కన్ను ఇప్పుడు వెండి ఆభరణాలపై పడింది.

Arun Chilukuri
Published on: 6 Feb 2026 3:04 PM IST
సిల్వర్ కోసం స్కార్పియో రేంజ్ స్కెచ్: వృద్ధురాలిని మంచంతో సహా మోసుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‌లో విస్తుపోయే ఘటన!
X

Rajasthan: వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో దొంగల కన్ను ఇప్పుడు వెండి ఆభరణాలపై పడింది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కోథియా గ్రామంలో బుధవారం రాత్రి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం వెండి కంకణాల కోసం దొంగలు ఏకంగా 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె నిద్రిస్తున్న మంచంతో సహా ఎత్తుకెళ్లారు.

అసలేం జరిగింది?

కోథియా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాథీ దేవి మాలి అత్త చోటీ దేవి (90) బుధవారం రాత్రి ఇంటి వరండాలో మంచంపై నిద్రిస్తున్నారు. ఆమె కాళ్లు, చేతులకు సుమారు 1.5 కేజీల వెండి ఆభరణాలు ఉండటాన్ని గమనించిన దొంగలు, వాటిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ వేశారు.

ఇంట్లో ఉన్న వారు బయటకు రాకుండా తలుపులకు బయటి నుంచి తాళం వేశారు. వృద్ధురాలు అరవకుండా ఆమె నోరు మూసి, మంచంతో సహా ఆమెను సమీపంలోని పొలాల్లోకి మోసుకెళ్లారు. పొలంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నగలని తొలగించేందుకు ప్రయత్నించారు.

గ్రామస్తుల ఎంట్రీతో పలాయనం

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అలికిడి అవ్వడంతో మేల్కొన్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులకు తాళం వేసి ఉండటం, బయట అత్తగారు మంచంతో సహా మాయమవడంతో హడలిపోయారు. వెంటనే కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తాళం పగలగొట్టారు. ఊరంతా కలిసి వెతకడం ప్రారంభించడంతో, టార్చ్‌ లైట్ల వెలుతురు చూసిన దొంగలు వృద్ధురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు.

కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న స్థితిలో చోటీ దేవిని గుర్తించిన గ్రామస్తులు ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. వెండి ధరలు పెరగడం వల్లే ఇలాంటి సాహసోపేతమైన, వింతైన చోరీలకు దొంగలు తెగబడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story