ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న అన్నదాతల ఆందోళనలు

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న అన్నదాతల ఆందోళనలు
x
Highlights

నిరసనపై పిటిషన్లను 11న విచారిస్తామన్న సుప్రీంకోర్టు

వర్షాన్ని లెక్కచేయడం లేదు.. వణికించే చలిని బేఖాతరు అంటున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. 8న మరోసారి కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండగా.. నిరసనలపై దాఖలపై పిటిషన్లు అన్నింటిపై సోమవారం విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏడోసారి చర్చలు కూడా విఫలం కావడంతో.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. ఇక రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలవగా.. వాటన్నింటిపై ఈ నెల 11న విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ సందర్భంగా అన్నదాతల ఉద్యమంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. చలి, వర్షంలో రైతుల పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని చెప్పింది. ఐతే సాగు చట్టాలపై రైతులతో చర్చలు మెరుగ్గా కొనసాగుతున్నాయని కేంద్రం తెలపగా... ఆందోళన అంశంలో ఎలాంటి పురోగతి రాలేదని కోర్టు అభిప్రాయపడింది.

కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే రెండు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. చర్చలను ప్రోత్సహిస్తామని తెలిపిన ధర్మాసనం.. సాగు చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి సోమవారం విచారిస్తామని వెల్లడించింది. ఇక మరోవైపు కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 8వ తేదీన మరోసారి చర్చలు జరగనున్నాయ్.

ఇక అటు మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. వర్షం కురుస్తున్నా.. చలిగాలులు వీస్తున్నా అన్నదాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని... ట్రాక్టర్ల ర్యాలీని వాయిదా వేసిన అన్నదాతలు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఆందోళనలో భాగంగా రిపబ్లిక్ డే రోజు కిసాన్‌ పరేడ్‌ పేరుతో భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయ్.

.

Show Full Article
Print Article
Next Story
More Stories