"ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే.. కోర్టుకు వస్తారా?" - ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీం షాక్!

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై న్యాయపోరాటం చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వ్యూహం ఫలించలేదు.

Arun Chilukuri
Published on: 6 Feb 2026 12:42 PM IST
ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే.. కోర్టుకు వస్తారా? - ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీం షాక్!
X

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై న్యాయపోరాటం చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వ్యూహం ఫలించలేదు. 2025 నవంబర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ 'జన్ సూరజ్' (Jan Suraaj) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో తిరస్కరించారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం న్యాయ వ్యవస్థను వాడుకోవాలని చూస్తున్నారా?" అని ధర్మాసనం ప్రశ్నించింది. "మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు మిమ్మల్ని ఓడించాక రిలీఫ్ కోసం జుడిషియల్ ఫోరంను ఆశ్రయించడం ఏంటి?" అని కోర్టు నిలదీసింది. ప్రభుత్వం అమలు చేసే పథకాలను అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నిస్తూ, ఈ పిటిషన్‌ను బీహార్ హైకోర్టుకు బదిలీ చేసింది.

పిటిషన్‌లో జన్ సూరజ్ ఆరోపణలు

ఎన్నికల సమయంలో అధికార ఎన్డీయే (NDA) ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జన్ సూరజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత 'ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన' కింద సుమారు 36 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున జమ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉండగా డీబీటీ (DBT) ద్వారా డబ్బులు పంపి ఓటర్లను ప్రలోభపెట్టారని, అందుకే ఎన్నికలను రద్దు చేయాలని కోరారు.

ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే..

2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గానూ 238 స్థానాల్లో జన్ సూరజ్ పోటీ చేసింది. అయితే, ఒక్క సీటు కూడా గెలవకపోగా, మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 202 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story