ఇవాళ తిరువనంతపురంలో ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం

Southern Zonal Council Meeting at Thiruvananthapuram
x

ఇవాళ తిరువనంతపురంలో ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం

Highlights

Zonal Council Meeting: తెలంగాణ తరపున మహమూద్ అలీ, అధికారుల బృందం

Southern Zonal Council Meeting: ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ రెండో స‌మావేశం ఇవాళ కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో జ‌ర‌గ‌నుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు తిరువనంతపురం చేరుకున్న అమిత్ షా, తమిళనాడు సీఎం స్టాలిన్ కు కేరళ సీఎం పినరాయి విజయన్, ఇతర మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాలు సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర కారణాలతో సమావేశానికి హాజరు కావడంలేదు. తెలంగాణ డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై బలంగా వాదనలు వినిపించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచనలు చేశారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలు, కృష్ణా జలాల పంపిణీ, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన తదితర అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 9వ, 10వ షెడ్యూళ్ళ సంస్థల విభజన అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున 16 అంశాలను ఎజెండాలో పెట్టినప్పటికీ తెలంగాణ తరఫున ఒక్క అంశాన్ని కూడా అధికారికంగా కేంద్ర హోంశాఖకు సమర్పించలేదు. గత ఏడాది నవంబరు 14న తిరుపతిలో జరిగిన సమావేశానికి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలతో పాటు ఈ ఏడాది మే 28న తిరువనంతపురంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాలపై ఇప్పుడు సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగులో చర్చించనున్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి 6700 కోట్లు రావాలని ఏపీ చెబుతుండగా ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ నుంచి తమకు 12వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం మరోసారి ప్రస్తావనకు రానుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల సంబంధిత అంశాలు సహా విభజన వివాదాలు, సమస్యలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రెండు ప్రతిపాదనలను తిరస్కరించిన తెలంగాణ ఈ సమావేశంలో ఎలాంటి వైఖరిని వెల్లడించనున్నదనేది ఆసక్తికరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories