Karnataka: రాజీకొచ్చిన డీకే.. డిప్యూటీ సీఎంకు గ్రీన్‌సిగ్నల్‌..!

Siddaramaiah to be Karnataka CM And Shivakumar his Deputy
x

Karnataka: రాజీకొచ్చిన డీకే.. డిప్యూటీ సీఎంకు గ్రీన్‌సిగ్నల్‌..!

Highlights

Karnataka: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పోటీదారులైన మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉడుం పట్టు పడుతుండడంతో ఎవరిని ఆ పదవిలో నియమించాలో తేల్చుకోలేక కాంగ్రెస్‌ అధిష్ఠానం తలపట్టుకుంటోంది. అగ్ర నేత రాహుల్‌గాంధీ స్వయంగా చర్చించినా.. సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్‌ చేసి మాట్లాడినా డీకే వెనక్కి తగ్గడం లేదు. తనకే సీఎం పదవి ఇవ్వాలని.. లేదంటే దళిత నేతకు కట్టబెట్టాలని.. సిద్దూకు మాత్రం ఇవ్వడానికి వీల్లేదని శివకుమార్ కుండబద్దలు కొట్టారు.

తనకివ్వకుంటే మూడో వ్యక్తికి ఇవ్వాలని .. శివకుమార్‌కు మాత్రం ఇవ్వొద్దని.. ఆయనపై పలు ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు ఉన్నాయని.. ఆయనకు పదవి కట్టబెడితే, దర్యాప్తు సంస్థలు ఆయన్ను అరెస్టు చేస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినడమే గాక అస్థిరత ఏర్పడుతుందని సిద్దరామయ్య వాదించినట్లు తెలుస్తోంది. తాను, డీకే చెరి రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకుంటామని కూడా మరోసారి ప్రతిపాదించారు. మొదట తానే ఉంటానన్నారు. ఈ ఫార్ములాకు శివకుమార్‌ సుముఖత తెలిపినా.. మొదట తనకే అవకాశమివ్వాలని షరతు పెట్టారు. దీంతో సీనియర్ల ఈ పీఠముడి విప్పేందుకు తలలు పట్టుకుంటున్నారు.

నిన్న ఉదయం తొలుత సిద్దూ, తర్వాత డీకే 10–జన్‌పథ్‌లో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. అరగంట చొప్పున చర్చించారు. అక్కడ ఉండగానే సోనియాగాంధీ డీకేతో ఫోన్లో మాట్లాడారు. మరోసారి ఖర్గేను కలవాలని సూచించారు. దాంతో ఆయన వెళ్లి ఖర్గేను కలిశారు. కాంగ్రెస్‌ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్‌ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. ఈ భేటీల్లో వారు డీకే ముందు రెండు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. సిద్దూ కేబినెట్‌లో ముగ్గురు నలుగురు ఉపముఖ్యమంత్రులు ఉండరని.. శివకుమార్‌ ఒక్కరినే చేస్తామని.. ఆయన కోసం ఒక్కరికి ఒకటే పదవి అన్న విధానాన్ని మినహాయిస్తామని.. పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిస్తామని.. అంతేగాక తనకు నచ్చిన ఆరు కీలక శాఖలు ఎంచుకోవాలన్నది మొదటి ప్రతిపాదన.

ఇది వద్దంటే ఐదేళ్లలో తొలి రెండేళ్లు సిద్దూ సీఎంగా ఉంటారని.. మిగతా మూడేళ్లు శివకుమార్‌ ఉండేలా రెండో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇందుకు శివకుమార్‌ ససేమిరా అన్నారు. గతంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే ఒప్పందం కుదిర్చారని.. కానీ అశోక్‌ గహ్లోత్‌ అప్పటి పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌కు, భూపేశ్‌ బఘేల్‌ తన మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని, వారు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన గుర్తు చేశారు. దీనివల్లే ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీలో సంక్షోభం కొనసాగుతోందని అన్నారు. దీంతో ఆయన్ను ఒప్పించడం అధిష్ఠానం తరం కావడం లేదు.

రాహుల్‌తో సిద్దూ, డీకే వేర్వేరుగా సమావేశమవడం, సోనియా సిమ్లా నుంచి ఫోన్‌లో వారిద్దరితో మాట్లాడిన పరిణామం నేపథ్యంలో నిన్నంతా హైడ్రామా నడచింది. సిద్దూను సీఎంగా, డీకేను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారని.. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు శివకుమారే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని.. ఆయనకు విద్యుత్‌, నీటిపారుదల శాఖలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది.

సిద్దరామయ్యను సీఎంగా ఎంపిక చేశారన్న ప్రచారం జరగడంతో.. ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకోగా.. శివకుమార్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో సుర్జేవాలా ఖర్గే నివాసం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సీఎం ఎంపికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. ఇవాళ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. 48–72 గంటల్లో కొత్త కేబినెట్‌ కొలువు తీరుతుందని చెప్పారు. సీఎం ఎంపికపై బీజేపీ నేతలు వదంతులు వ్యాపింపజేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు. ఏకాభిప్రాయం, ఏకగ్రీవం, ఐకమత్యం అనే మూడు సూత్రాలను ఖర్గే విశ్వసిస్తారని.. సీఎంను ఎంపిక చేసే బాధ్యతను సీఎల్పీ ఆయనకు అప్పగించిందని.. సముచిత సంప్రదింపులు జరిపిన తర్వాత పేరు ప్రకటిస్తారని తెలిపారు.

డీకేను ఏదో రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగేళ్లు పార్టీ కోసం కష్టించి పనిచేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపడం.. భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో అధిష్ఠానం ఆయన్ను విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన్ను పక్కనపెడితే రాజస్థాన్‌లో మాదిరిగా అంతఃకలహాలు రేగుతాయని ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌, ఖర్గే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories