వివాదంలో కర్నాటక మురుగపీఠం మఠాధిపతి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు

Shivamurthy Murugha Sharanaru was Detained in an Alleged Sexual Assault Case
x

వివాదంలో కర్నాటక మురుగపీఠం మఠాధిపతి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు

Highlights

Shivamurthy Murugha Sharanaru: స్వామిజీలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

Shivamurthy Murugha Sharanaru: స్వామిజీలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కోరికలను అదుపు చేసుకోవాల్సిన సర్వ సంగ పరిత్యాగులు లౌకిక వ్యవహారాల్లో ఇరుక్కుంటున్నారు. జ్ఞానయోగులు కావాల్సిన గురువులు కామాగ్నికి దహించిపోతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలపై దేశంలో మరో స్వామి కేసులు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక చిత్రదుర్గలోని ప్రముఖ మురుగా మఠాధిపతి శివమూర్తిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇద్దరు దళిత బాలికలను లైంగికంగా వేధించిన ఘటనలో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.

కర్ణాటక చిత్రదుర్గలోని ప్రముఖ మురుగా పీఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగా శరణరుపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా వేధించారంటూ పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శివమూర్తితో పాటు మరో ఇద్దరిపై ఇదే చట్టం కింద కేసులు నమోదు కావడం కర్ణాటకలో కలకలం రేపుతోంది. తొలుత ఈ కేసును మైసూరు పోలీసులు టేకప్ చేయగా తర్వాత దీన్ని చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు బాధితులను దళిత బాలికలుగా గుర్తించారు. దీంతో కేసు తీవ్రత మరింత పెరిగింది. ఇద్దరి బాలికల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చాక్లెట్లు, పండ్లు ఇస్తామని చెప్పి స్వామివారు తన గదికి పిలిపించుకునే వారని తమను లైంగికంగా వేధించారని బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాలికలకు వైద్య పరీక్షలు చేయించి రిపోర్టులు వచ్చాకే తదుపరి విచారణ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు నిర్ధారణ అయితే కేసులో ఉన్నవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు దళితులు కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదుకు అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ ఇద్దరు అమ్మాయిల్లో ఓ అమ్మాయి మీద 3 సంవత్సరాల నుంచి మరో అమ్మాయి మీద 18 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. తొలుత ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మైసూరులోని నజరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ కంప్లైంట్ చేశారు. శివమూర్తి లైంగికదాడి చేయడంతో పాటు ఈ దారుణానికి మఠంలోని మరికొందరు సహకరించారని స్వచ్చంద సంస్థ నిర్వహకులు పోలీసులకు తెలిపారు. ఈ ఇద్దరు బాలికలు మఠం నిర్వహించే విద్యాలయంలోనే చదువుతున్నారని తెలిపారు. శివమూర్తి స్వామీజీకి మఠం వార్డెన్‌ రశ్మీ, మఠం మరిస్వామి, లాయర్ గంగాధరయయ, లీడర్ పరమశివయ్య సహకరిస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కర్ణాటకలోని మఠాధిపతుల్లో శివమూర్తి మురుగా శరణరు అత్యంత ప్రముఖులు. ఈయనపై ఇలాంటి కేసు నమోదు కావడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠానికి అధిపతిగా డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు చాలాకాలంగా ఉంటున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ మఠాన్ని దర్శించుకుంటారు. శివమూర్తి స్వామీజీని చాలామంది భక్తులు అనుసరిస్తారు. ఆయన బోధలు పాటిస్తారు. ఆయన భక్తులు బడా రాజకీయ నాయకులు ఉన్నారు. కేంద్ర మంత్రుల నుంచి లోకల్ లీడర్ల వరకు ఆయన్ని సేవిస్తుంటారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై స్వామీజి స్పందించారు. ఇది తనమీద జరుగుతున్న కుట్ర అని అన్నారు. మఠానికి చెందినవారే ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటికీ సమాధానం కాలమే చెబుతుందని తెలిపారు. ఇటువంటి కుట్రలు తనమీదే కాదని సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన చాలామంది మహానీయులపై కూడా జరిగాయని చెప్పుకొచ్చారు. సమాజాన్ని మార్చాలని ప్రయత్నించే వారిని అణగదొక్కే ప్రయత్నాలు ప్రతీ చోటా జరుగుతాయన్నారు. ఇటు శివమూర్తిపై వచ్చిన ఆరోపణలపై సీఎం బసవరాజు బొమ్మై కూడా స్పందించారు. పోలీసుల విచారణ జరుగుతుందని అది పూర్తయ్యాకే నిజం వెలుగు చూస్తుందని సీఎం తెలిపారు.

మరోవైపు విచారణ నిమిత్తం చిత్రదుర్గలోని మురుగా మఠంలో చిత్రదుర్గ ఏసీపీ పర్యటించారు. కానీ సమయంలో శివమూర్తి స్వామిజీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మఠానికి చెందిన లాయర్ మాట్లాడుతూ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అయితే లింగాయత్‌లు చాలాకాలంగా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. బసవేశ్వరుడు బోధించిన ధర్మాలను పాటించే వారంతా లింగాయత్‌లుగా పిలవబడుతారు. శివుడే సర్వస్వం అని నమ్మే వీరంతా ఎక్కువగా కర్ణాటకలో ఉంటారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉంటారు. ఈ లింగాయత్‌ల్లో చాలా వరకు గురు శిష్యుల సంబంధమే ఉంటుంది. గురువులంతా శిష్యుల చేత పూజలు అందుకుంటారు. ప్రతీ గురువుకూ ఓ మఠం ఉంటుంది. అయితే లింగాయత్‌ల జనాభా భారీగా ఉండటంతో రాజకీయ నాయకులు సైతం వీరి సేవలో తరిస్తారు. అన్ని పార్టీలకు చెందిన పెద్దలంతా వీరి చుట్టూ తిరుగుతారు. ముఖ్యమంత్రుల నుంచి గల్లీ లీడర్ల దాకా వీరిని అనుసరిస్తారు. ప్రస్తుతం సీఎం బసవరాజు బొమ్మై కూడా లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడే. మాజీ సీఎం యాడ్యూరప్ప కూడా అదే వర్గానికి చెందిన నాయకుడే. ఈ లింగాయత్‌ల ఆశీర్వాదం ఉంటే చాలు రాజకీయంగా అందలం ఎక్కడం ఖాయమనే భావన అక్కడి రాజకీయ నాయకుల్లో ఉంటుంది.

మొన్నటికిమొన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం ఇదే శివమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన నుంచి ఇష్ట లింగ దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా రాహుల్ నుదుట విభూతిని రాయడంతో పాటు మెడలో శివలింగం పొదిగిన మాల వేశారు. అయితే లింగాయత్ సెమినరీలో ఉన్న హవేరీ హోసముట్ స్వామిజీ మాట్లాడుతూ భవిష్యత్ భారతానికి రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. రాహుల్‌ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ ప్రధానులయ్యారని వారి బాటలో రాహుల్ కూడా ఈ దేశానికి ప్రధాని అవుతారని చెప్పుకొచ్చారు. అయితే శివమూర్తి మాత్రం ఈ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు. ఇది వేదిక కాదని ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మఠంపై ఇలాంటి ఆరోపణలు రావడం మఠాధిపతే ఈ కేసులో ఇరుక్కోవడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మఠాధిపతి శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories