గర్జించిన వృద్ద సింహం..ఈడీతో బెదిరించినా అదరని మరాఠా యోధుడు

గర్జించిన వృద్ద సింహం..ఈడీతో బెదిరించినా అదరని మరాఠా యోధుడు
x
Highlights

ఆ పార్టీ పనైపోయిందన్నారు. ఆ వృద్ద సింహం గర్జించలేదన్నారు. మరాఠా యోధుడి మాటల్లో పసలేదన్నారు. ఆ పార్టీ నేతలను లాగారు. ఈడీ కేసులతో వెంటాడారు. పార్లమెంట్‌...

ఆ పార్టీ పనైపోయిందన్నారు. ఆ వృద్ద సింహం గర్జించలేదన్నారు. మరాఠా యోధుడి మాటల్లో పసలేదన్నారు. ఆ పార్టీ నేతలను లాగారు. ఈడీ కేసులతో వెంటాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లాగే, అసెంబ్లీ పోరులోనూ కుదేలవ్వాల్సిందేనని వెటకారాలు చేశారు. కానీ మరాఠా గడ్డపై దిక్కులు పిక్కటిల్లేలా ఆ వృద్ద సింహం, గర్జించింది. బీజేపీ-శివసేనలకు షాకిచ్చేలా రిజల్ట్స్ రాబట్టింది. కాంగ్రెస్‌ కన్నా మిన్నగా ఫలితాలు రాబట్టి, ఇంకా రేసులోనే వున్నానంటూ సమర సంకేతాలు పంపింది. ఆ‍యనే రాజకీయ కురవృద్దుడు, ఎన్సీపీ అధినేత శరద్ ‌పవార్. శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీని మళ్లీ నిలబెట్టిన మరాఠా వీరుడు.

ఒకవైపు హోరున వాన. మరోవైపు ఎన్నికల ప్రచారం ముగింపుకు రెండ్రోజుల ముందు. ఈ వర్షం సాక్షిగా ఎన్సీపీ పునరుజ్జీవమవుతుంది, రాష్ట్రంలో కొత్త ఆశలు మొలకెత్తేలా చేస్తుందని, జోరు వానలో తడుస్తూ, ప్రసంగించారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్. నిజంగా ఈ వర్షం సాక్షిగా, శరద్‌ పవార్ మాటల సాక్షిగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జీవం పోసుకుంది ఎన్సీపీ.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చవి చూసింది ఎన్సీపీ. మహారాష్ట్రలో ఇక కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ పనయిపోయిందన్న వెటకాలు ఎదుర్కొంది. శరద్‌ పవార్‌ వృద్దుడయ్యాడు, పార్టీ పని కూడా అయిపోయిందని శాపనార్థాలు పెట్టారు. కానీ పడిలేచిన కెరటంలా వృద్ద రాజకీయ చతురుడు దూసుకొచ్చాడు. ముదిమి వయసులోనూ ఊరువాడ తిరుగుతూ, విమర్శకుల నోళ్లు మూయించాడు. పార్టీకి పునరుత్తేజం తెచ్చాడు. బీజేపీకి ఎదురులేదు, సొంతంగానే మెజారిటీ సాధిస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించని సంఖ్యలో సీట్లు రాబట్టాడు శరద్‌ పవార్.

సరిగ్గా పోలింగ్‌కు కొన్ని రోజులు ముందు, బీజేపీ ప్రభుత్వం శరద్‌ పవార్‌ను కేసులతో వెంటాడింది. ఈడీని ఉసిగొల్పి, కాలగర్భంలో కలిసిపోయిన కేసులను వెలికితీసి మరీ వేధించింది. అయితే, ఈడీ పిలవకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యేందుకు సిద్దమని చెప్పి, బీజేపీ పాలకులకే షాకిచ్చారు పవార్. ఛత్రపతి శివాజీ గడ్డపై పుట్టిన తాము వెనుకడుగు వేయబోం అంటూ సవాల్ విసిరారు మరాఠా యోధుడు. ఈడీ కేసును బీజేపీ రాళ్లుగా విసిరితే, ఆ రాళ్లనే పూలబాటగా మలచుకుని, సానుభూతి అస్త్రంగా సంధించారు పవార్.

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ ఎన్నికల్లో ఫలితాలు సాధించింది శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ. 2014తో పోలిస్తే స్థానాల సంఖ్యను మరింత పెంచుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం 41 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ దాదాపు అదనంగా మరో 10కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎదురులేదు బెదురులేదంటూ విర్రవీగి, ఏకఛత్రాధిపత్యం సాగించాలనుకుంటున్న బీజేపీ పాలకులకు, ఈ ఫలితాలు చెంపపెట్టు. శివసేనతో మరో ఐదేళ్ల పాటు కలహాల కాపురం చేసేందుకు సిద్ధపడేలా చేసింది. తనను అన్ని విధాలుగా వేధించి, వేటాడిన బీజేపీకి షాకిచ్చారు పవార్. బీజేపీ పాలనపై ప్రజల నిరసనగా ఈ ఫలితాలను చూడాలన్నారు పవార్.

ఎన్సీపీ బలాన్ని ముందే అంచనా వేసిన బీజేపీ, ఆపార్టీని నిలువునా చీల్చే ప్రయత్నం చేసింది. ఎన్సీపీ నేతలు చాలామంది బీజేపీ-శివసేనలో చేరారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని కీలక నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. దెబ్బ మీద దెబ్బతో మరింత కుంగిపోయింది ఎన్సీపీ. అయినా పట్టు వీడలేదు శరద్‌ పవార్. ప్రజల ముందు ఈ అంశాలన్నింటినీ చర్చకు పెట్టారు. ఫలితాలు రాబట్టారు. అందుకే వృద్ద సింహాలను తక్కువ అంచనా వేయకూడదు. రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆడితే, ఎలా వుంటుందో చెప్పడానికి నిదర్శనం శరద్‌ పవార్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories