మగోన్మాదానికి మందేది.. నిర్భయ ఘటనకు ఏడేళ్ళు.. నేటికీ అమలు కాని ఉరి

మగోన్మాదానికి మందేది.. నిర్భయ ఘటనకు ఏడేళ్ళు.. నేటికీ అమలు కాని ఉరి
x
Highlights

ప్రియాంక రెడ్డి ఘటన అనంతరం ఇప్పుడు అందరి దృష్టి ఒక్కసారిగా అత్యాచార కేసుల్లో నేరగాళ్ళకు పడే శిక్షలపైకి మళ్ళింది. ఇలాంటి సంఘటనల్లో నేరగాళ్ళకు మరణశిక్ష...

ప్రియాంక రెడ్డి ఘటన అనంతరం ఇప్పుడు అందరి దృష్టి ఒక్కసారిగా అత్యాచార కేసుల్లో నేరగాళ్ళకు పడే శిక్షలపైకి మళ్ళింది. ఇలాంటి సంఘటనల్లో నేరగాళ్ళకు మరణశిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరణశిక్ష అమలులో తప్పొప్పులను పక్కనబెట్టి అసలు నేరగాళ్ళకు ఎలాంటి శిక్షలు అమలవుతున్నాయో చూద్దాం. ఇలాంటి కేసుల్లో ఎన్నటికీ మర్చిపోలేనిది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన. నాటి నుంచి నేటి వరకూ దేశంలో మరెన్నో అత్యాచారాలు జరిగాయి. నేరగాళ్ళను అరెస్టు చేశారు. శిక్షలను మాత్రం అమలు చేయలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతున్నదో కూడా చూద్దాం.

సుమారు ఏడేళ్ళ క్రితం 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ యువతి రెండు రోజుల నరకయాతన తరువాత మరణించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించివేసింది. అత్యాచారాలకు వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రదర్శనలు జరిగాయి. అప్పుడు కూడా పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకోగలిగారు. యావత్ దేశ ప్రజానీకం కోరుకున్నట్లుగానే వారికి మరణశిక్ష పడింది. ఓ భయంకరమైన చేదు నిజం ఏమిటంటే ఆ శిక్షను ఇప్పటికీ అమలు చేయలేకపోయారు. ఉరిశిక్ష పడిన నలుగురు నేరగాళ్ళు నేటికీ ప్రాణాలతోనే ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా వారికి శిక్షలను మాత్రం అమలు చేయలేకపోయారు. తాజా అప్ డేట్స్ కు వస్తే పాటియాలా హౌస్ కోర్టు నవంబర్ 28న తీహార్ జైలుకు ఓ నోటీసు పంపింది. ఉరిశిక్షను అమలు చేసేందుకు వీలుగా న్యాయస్థానాల్లో అభ్యర్థనలకు సంబంధించి ఆ నలుగురు నేరగాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని ఆదేశించింది. అది కూడా నిర్భయ తల్లిదండ్రులు చొరవ తీసుకొని అభ్యర్థించిన కారణంగానే. డిఫెన్స్ న్యాయవాదులు చెప్పేది మాత్రం మరో రకంగా ఉంది. ఈ నలుగురిలో ఒకరి క్యూరేటివ్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మరో ఇద్దరు కూడా అలాంటి దరఖాస్తులనే సుప్రీం కోర్టుకు సమర్పించే యోచనలో ఉన్నారు. ఈ డిసెంబర్ 16కు నిర్భయ ఘటన జరిగి ఏడేళ్ళు పూర్తవుతాయి. ఆలోగానైనా వారికి ఉరిశిక్ష పడుతుందో లేదో తెలియదు. మరో పదేళ్ళు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దేశంలో నిర్భయ ఘటన లో మైనర్ గా ఉన్న వ్యక్తికి సంస్కరణ కేంద్రంలో మూడేళ్ళు గడపాలన్న శిక్ష పడింది. ఆయన ఇప్పుడు ఓ వంటవాడిగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన నలుగురిని విచారించి 2013 సెప్టెంబర్ 10 న నేరగాళ్ళుగా ప్రకటించారు. ఉరిశిక్ష విధించారు. రివ్యూ పిటిషన్ తదితర కారణాలతో ఆ శిక్ష నేటికీ అమలు కాలేదు. అదే సమయంలో నిర్భయ ఘటన న్యాయవ్యవస్థలో మార్పులకు కూడా దారితీసింది. లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో క్రిమినల్ చట్టాలకు చేయాల్సిన సవరణలపై సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. మహిళలపై లైంగిక దాడులకు ప్రధాన కారణం ప్రభుత్వపరంగా, పోలీసులపరంగా చోటు చేసుకుంటున్న వైఫల్యాలే అని ఆ కమిటీ తేల్చి చెప్పింది. అత్యాచార కేసుల్లో గరిష్ఠ శిక్షను యావజ్జీవం నుంచి మరణశిక్షకు పెంచాల్సిందిగా కూడా సిఫారసు చేసింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షించాల్సిందిగా కూడా సూచించింది. తదనంతర కాలంలో చట్టాల్లో అనేక మార్పులు కూడా వచ్చాయి. సామూహిక అత్యాచారం కేసుల్లో కనీస శిక్షను 20 ఏళ్ళుగా చేశారు. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కేసులను ఏర్పాటు చేశారు.

దేశంలో అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి. 2012లో ఒక్క ఢిల్లీ నగరంలోనే 706 కేసులు నమోదయ్యాయి. నిర్భయ కేసు కూడా వాటిలో ఒకటి. దేశంలో పెరిగిపోతున్న అత్యాచార కేసులకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. తాజా గణాంకాలను పరిశీలిస్తే 2016లో దేశంలో మహిళలపై 3.38 లక్షల లైంగిక నేరాలు జరిగాయి. వాటిలో అత్యాచార కేసులు 11.5 శాతం దాకా ఉన్నాయి. ప్రతీ నాలుగు అత్యాచార కేసుల్లో ఒక్క కేసులో మాత్రమే నేర నిరూపణ జరుగుతోంది. 2016లో దేశంలో సుమారు 39 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటిలో 2100 కు పైగా సామూహిక అత్యాచార కేసులున్నాయి. 2007లో దేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. 2016లో ప్రతీ గంటలకు నలుగురు మహిళలపై అత్యాచారం జరిగింది. దాఖలైన కేసుల్లో నేర నిరూపణ శాతం కూడా చాలా తక్కువగా ఉంటోంది. గత పదేళ్ళ కాలంలో ఇది 28 శాతాన్ని మించలేదు.

దేశంలో జరిగే అత్యాచారాల్లో కేసుల వరకూ వచ్చేవి కొన్ని మాత్రమే. వాటిల్లోనూ నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటోంది. నేరగాళ్ళకు పడే శిక్షలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో కింది స్థాయి కోర్టులు నేరగాళ్ళకు మరణ శిక్ష విధిస్తున్నా అవి అమలవుతున్న సందర్భాలు మాత్రం లేవు. దీంతో నేరగాళ్ళను ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఆ విధంగా నేరగాళ్ళను హతమార్చడం తప్పే అయినప్పటికీ పోలీస్ వ్యవస్థ పట్ల, న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో పెరిగిన అసహనాన్ని అది సూచిస్తోంది. ఇక తాజాగా ప్రియాంక రెడ్డి ఘటనలోనూ ఇదే డిమాండ్ వినవచ్చింది. ఇప్పటికైనా అధికార వ్యవస్థలు కళ్ళు తెరవాలి. సత్వరమే న్యాయవిచారణ ముగిసేలా చూడాలి. నేరగాళ్ళకు కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలి. కేవలం కఠిన శిక్షలతోనే సమాజంలో మార్పు తీసుకురాలేం. ఆ మార్పు తీసుకువచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories