ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు మంత్రి

ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు మంత్రి
x
Highlights

చైనాలోని కరోనావైరస్ ప్రభావిత నగరం వుహాన్ నుండి 323 మంది భారతీయ పౌరులను తీసుకువచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురు మాల్దీవులు ప్రయాణించారు.

చైనాలోని కరోనావైరస్ ప్రభావిత నగరం వుహాన్ నుండి 323 మంది భారతీయ పౌరులను తీసుకువచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురు మాల్దీవులు ప్రయాణించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. మాల్దీవులకు చెందిన ఏడుగురిని కూడా ఈ విమానంలో చైనా నుంచి తీసుకొచ్చామని.. వారిని కొంతకాలం నిర్బంధంలో ఉంచుతారు అని ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ స్పందించారు. ఈ వార్తను అబ్దుల్లా షాహిద్ ఆదివారం ఉదయం ధృవీకరించారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'మా ప్రజల్ని తిరిగి తీసుకురావాలనే నిర్ణయం భారతదేశం యొక్క 'పొరుగు మొదటి' విధానం ఫలితం' అని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ కు నిలయమైన వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వుహాన్‌ సిటీకి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. మొదటి విడతలో 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు.

వీరందరిని మనేసర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించారు.. అక్కడే వారిని దాదాపు 14 రోజుల పాటు అబ్జర్వేష‌న్‌లో ఉంచుతున్నారు. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయితే వారిని కంటోన్మెంట్‌ బేస్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇదిలావుంటే కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 గా నమోదయింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,380 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.

అయితే కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరో 23 దేశాలలో సుమారు 100 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనావైరస్ కేసులను ధృవీకరించిన దేశాలు.. దక్షిణ కొరియా , జర్మనీ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ , సింగపూర్ , తైవాన్ , ఆస్ట్రేలియా, మలేషియా, మకావు, రష్యా , ఫ్రాన్స్ , యునైటెడ్ స్టేట్స్ , కెనడా , బ్రిటన్ , వియత్నాం , ఇటలీ, ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, కంబోడియా , శ్రీలంక , ఫిన్లాండ్ , స్వీడన్ మరియు స్పెయిన్ ఉన్నాయి. అయితే ఇందులో తైవాన్, జర్మనీ, థాయిలాండ్, వియత్నాం , జపాన్ , ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్‌లో నమోదైన కేసులలో చైనాకు వెళ్లని రోగులు ఉన్నారని తెలిసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories