తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు
x
Highlights

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలు వర్ష విలయంలో చిక్కుకున్నాయి.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది..

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలు వర్ష విలయంలో చిక్కుకున్నాయి.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాదాపు 15 వందలకు పైగా కాలనీలలో వర్షపు నీరు చేరింది. బుధవారం ఉదయం నుంచి కాస్త తెరిపినిచ్చిన వాన మళ్లీ మొదలైంది.. రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మరోసారి ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటు ఏపీలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, ఏలూరు వంటి నగరాల్లోని లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది.

ఇక తెలంగాణ మీద కొనసాగుతున్న వాయుగుండం కర్ణాటక మీదుగా గుల్బర్గాకు 80 km, సోలాపూర్ కు 160 km దూరంలో కేంద్రీకృతం అయింది. ఇది12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ వరకూ సముద్రం అలజడిగా ఉంటుందని.. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో అక్కడ అక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories