Raihan Vadra: గాంధీ కుటుంబంలో పెళ్లి సంబురాలు.. ఘనంగా ప్రియాంకా కుమారుడి ఎంగేజ్ మెంట్..!!

Raihan Vadra: గాంధీ కుటుంబంలో పెళ్లి సంబురాలు.. ఘనంగా ప్రియాంకా కుమారుడి ఎంగేజ్ మెంట్..!!
x
Highlights

Raihan Vadra: గాంధీ కుటుంబంలో పెళ్లి సంబురాలు.. ఘనంగా ప్రియాంకా కుమారుడి ఎంగేజ్ మెంట్..!!

Raihan Vadra: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ.. రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రా త్వరలో కొత్త జీవితానికి అడుగుపెట్టబోతున్నారు. తన బాల్య స్నేహితురాలు అవివా బేగ్‌తో రైహాన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని చారిత్రక వన్యప్రాణి ప్రాంతం రణథంబోర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక వైభవంగా నిర్వహించారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి.

విడుదలైన చిత్రాల్లో రైహాన్ వాద్రా డార్క్ కలర్ షేర్వాణీలో సింపుల్ కానీ ఎలిగెంట్ లుక్‌తో ఆకట్టుకోగా, అవివా బేగ్ ఎంబెల్లిష్డ్ శారీలో సంప్రదాయ అందంతో మెరిసిపోయారు. ఈ ఫొటోలతో పాటు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక పాత చిత్రాన్ని కూడా వారు షేర్ చేశారు. చిన్న వయసులో మొదలైన స్నేహం ఎలా జీవితాంతం బంధంగా మారబోతోందో చెప్పకనే చెప్పేలా ఆ ఫొటోలు ఉన్నాయి.స్నేహం నుంచే మా ప్రయాణం మొదలైంది అంటూ పోస్ట్ చేశారు.

అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన యువతి. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపార రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి కాగా, తల్లి నందితా బేగ్ పేరొందిన ఇంటీరియర్ డిజైనర్. నందితా బేగ్‌కు ప్రియాంకా గాంధీతో దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’కు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్‌లో కూడా నందిత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అవివా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మోడరన్ స్కూల్‌లో చదువుకుని, అనంతరం జర్నలిజంలో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం ఆమె ఇంటీరియర్ డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఇక రైహాన్ వాద్రా విషయానికి వస్తే… 25 ఏళ్ల రైహాన్ తన విద్యాభ్యాసాన్ని ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ డూన్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో ఆయన తాత రాజీవ్ గాంధీ, మామ రాహుల్ గాంధీ కూడా చదువుకోవడం విశేషం. ఆ తర్వాత లండన్‌లోని ఎస్‌వోఏఎస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన రైహాన్ ప్రస్తుతం విజువల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ లైఫ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ రంగాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ముంబైలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీల్లో ఆయన తీసిన ఫొటోలు ఇప్పటికే ప్రదర్శితమయ్యాయి.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినప్పటికీ రైహాన్ కళారంగంలో తనదైన మార్గాన్ని ఎంచుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. సృజనాత్మకతే కేంద్రంగా సాగుతున్న తన ప్రయాణంలో అవివా బేగ్‌తో కలిసి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. వీరి వివాహం వచ్చే కొన్ని నెలల్లో జరగనుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబంలో మరో శుభకార్యానికి రంగం సిద్ధమవుతుండటంతో, రాజకీయ, సామాజిక వర్గాల్లో ఈ నిశ్చితార్థం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories