మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పవార్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా పవార్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పవార్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా పవార్
x
శరద్ పవార్
Highlights

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాంటి పదాలను సాధారణంగా క్రికెట్లోనే వింటుంటాం. మహారాష్ట్ర రాజకీయాలు సైతం అందుకు ఏమీ తీసిపోలేదు. ప్రధానంగా...

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాంటి పదాలను సాధారణంగా క్రికెట్లోనే వింటుంటాం. మహారాష్ట్ర రాజకీయాలు సైతం అందుకు ఏమీ తీసిపోలేదు. ప్రధానంగా రెండు జట్లు ఒక అంపైర్ తరహాలోనే మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మ్యాచ్ ఓ నెల రోజుల పాటు కొనసాగింది. తాజా పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ ముగిసనట్లుగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో చూద్దాం.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీ 54 స్థానాలు గెలవడంతోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా 79 ఏళ్ళ శరద్ పవార్ ఎంపికయ్యారు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా జంట బాడీలైన్ బౌలింగ్ ను ఆయన తట్టుకోగలిగారు. ఇక మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ను పక్కకు తప్పించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శరద్ పవారే అయ్యారు. ఈ రెండు పురస్కారాలు ఆయనకే దక్కడం ఎలా సాధ్యపడిందో కూడా చూద్దాం.

రాజకీయాలు అయినా క్రికెట్ అయినా రెజ్లింగ్ అయినా తిరుగులేని మరాఠా వీరుడు శరద్ పవార్ అనడంలో సందేహం లేదు. మహారాష్ట్ర తాజా ఉదంతం దీన్ని మరోసారి నిరూపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయనది చాణక్య రాజకీయం. ఒకప్పుడు కాంగ్రెస్ లో హవా కొనసాగించిన ఈ నాయకుడు ఆ తరువాత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారు. తిరిగి అదే కాంగ్రెస్ తో జట్టు కట్టారు. విదేశీ మహిళ అనే అస్త్రంలో సోనియా గాంధీని వ్యతిరేకించారు. తిరిగి ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ తోనే పొత్తు కుదుర్చుకున్నారు. ఆయన ప్రొఫైల్ కూడా గొప్పదే. నాలుగు సార్లు మహారాష్ట్ర సీఎంగా పని చేశారు. లోక్ సభలో విపక్షనేతగా వ్యవహరించారు. పీవీ నరసింహారావు హయాంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. తాజాగా మహారాష్ట్ర ఎపిసోడ్ లో ఆయన చాణక్యనీతిని ప్రదర్శించారు.

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల సభల్లో ఎన్సీపీ - కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శరద్ పవార్ చెప్పేవారు. బీజేపీ ని ఎదుర్కొనే మల్లయోధుడెవరూ బరిలో లేరని అప్పట్లో ఫడ్నవీస్ అంటుండేవారు. అయితే మహారాష్ట్ర స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ కు పవార్ ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. అదే విషయాన్ని పవార్ తన ప్రత్యర్థి ఫడ్నవీస్ కు గుర్తు చేశారు. తమకు ప్రతి చోట బరిలో మల్లయోధులు ఉన్నారని ఫడ్నవీస్ అనడాన్ని ఎగతాళి చేశారు. వారంతా మల్లయోధులే కానీ మల్ల యుద్ధం చేయడం వారికి తెలియదు అంటూ చమత్కరించారు. అంతేకాదు మల్లయోధుల పట్టువిడుపులు, ఒడుపులు బాగా తెలిసిన శరద్ పవార్ వాటన్నిటినీ ఎన్నికల సమయంలో ప్రయోగించారు. ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చరమాంకంలో తానే స్వయంగా బరిలోకి దిగారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిజం చెప్పాలంటే మొత్తం ఎన్నికల మ్యాచ్ లో అజిత్ పవార్ రెండు సందర్భాల్లో తనకు తెలియకుండానే శరద్ పవార్ కు బాగా తోడ్పడ్డారు.

ఎన్నికలు జరిగేందుకు కొద్ది రోజుల ముందు ముంబై పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ కలసి శరద్ పవార్ పై, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాయి. 25 వేల కోట్ల రూపాయలతో ముడిపడిన మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ తో వారికి ప్రమేయం ఉందని ఆరోపించాయి. దాంతో శరద్ పవార్ ఆ విచారణకు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. ఈడీ కార్యాలయానికి నడుచుకుంటూ వస్తానని ప్రకటించారు. దాంతో భయపడిన మహారాష్ట్ర పోలీసులు అలా చేయవద్దంటూ శరద్ పవార్ తో కాళ్ళబేరానికి వచ్చారు.అలా శరద్ పవార్ రాజకీయ ప్రచారం ఒక విధమైన సింపతీతో మొదలైంది. ఇక్కడ ప్రత్యక్షమైన అజిత్ పవార్ తాజా ఉదంతం చివరి అంకంలో రాజీనామాతో మరోసారి కీలకపాత్ర పోషించారు.

ఎన్నికల ముందే పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, శివసేనల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడాన్ని శరద్ పవార్ ఓ సువర్ణావకాశంగా తీసుకున్నారు. యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ప్రారంభించారు. కత్తులు దూసుకునే కాంగ్రెస్, శివసేనలను ఒకే గూటికి చేర్చారు. ఇక తమ కల నిజం అయ్యే వేళ అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరడాన్ని మాత్రం సహించలేకపోయారు. అసలు అజిత్ పవార్ బలమేంటో ఆయనకు అర్థమయ్యేలా చేశారు. ఎన్సీపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారిపోకుండా చూశారు. అటు ఉద్భవ్ థాకరే, ఇటు సోనియా గాంధీ సైతం అధికారం పై ఆశలు కోల్పోయినా శరద్ పవార్ మాత్రం విజయమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆ రెండు పార్టీలకూ ధైర్యం చెప్పారు. అంతిమంగా విజయం సాధించారు. అంతేకాదు అటు ఎన్సీపీకి, ఇటు పవార్ పరివార్ కు సైతం తానే బిగ్ బాస్ అని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నకలైనా లోక్ సభ ఎన్నికలైనా శరద్ పవార్ ఓడిపోయిన దాఖలాలు లేవు. బీసీసీఐ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన అంతకన్నా పెద్దదైన ఐసీసీ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన సత్తా చాటేందుకు ఇలాంటి ఉదంతాలెన్నో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎపిసోడ్ లో అది మరోసారి నిజమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories