Top
logo

Oxford Corona Vaccine : ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్‌

Oxford Corona Vaccine : ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్‌
X
Highlights

Oxford Corona Vaccine : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కరోనాని కట్టడి చేసేదిశగా...

Oxford Corona Vaccine : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కరోనాని కట్టడి చేసేదిశగా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కూడా వ్యాక్సిన్ కనిపెట్టి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ను చేసింది. అయితే ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్‌లో ఓ వాలంటీర్ కు ఈ టీకా వేయించుకున్న తరువాత అనారోగ్య సమస్యలు తలెత్తాయని సమాచారం. దీంతో చివరి దశకు చేరుకున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ వేసుకున్న ఆ వాలంటీర్‌కు తలెత్తిన అనారోగ్య సమస్యలేంటో మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక పోతే ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ ప్రకారం వ్యాక్సిన్‌ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ఇక ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు స్పందించారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన డెబోరా ఫుల్లర్‌ అనే ప్రముఖ పరిశోధకుడు స్పందిస్తూ జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలు కాకుండా ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఈయన కూడా మరో పద్ధతిలో ప్రయోగాలు జరుపుతున్నారు. అసలు టీకా వేసుకన్న వారి శరీరం ఏ విధంగా వైద్యానికి స్పందిస్తోంది, వారి ఆరోగ్యం ఎలా ఉంటోంది వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు మాత్రమే తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. దీనిపై పెద్దగా విచారించాల్సిన అవసరం ఏం లేదన్నారు.

అదే విధంగా ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణ విషయమేనని తెలిపారు. ఇది సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్న క్రమంలో అప్పుడప్పుడూ ఒకరిద్దరిలో దుష్ప్రభావాలు తలెత్తడం సాధారణంగా జరగుతుంటుందన్నారు. ఇలా జరిగినప్పుడు మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి తదుపరి ప్రయోగాల్ని కొనసాగిస్తుంటామన్నారు. ట్రయల్స్‌లో ఎలాంటి లోపాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. తాజాగా తలెత్తిన సమస్యపై వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి వ్యాక్సిన్‌ ప్రయోగాల్ని పునఃప్రారంభిస్తామన్నారు.

అదే విధంగా కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మరో పరిశోధకుడు ఏంజిలా రస్‌ముస్సేన్‌ ఈ విషయంపై స్పందించారు. వాలంటీర్ కి తలెత్తిన ఆరోగ్యసమస్య వ్యాక్సిన్‌ వల్ల అయి ఉండదని అంచనా వేశారు. చివరి దశలో భాగంగా భారీ సంఖ్యలో వాలంటీర్లకు టీకా అందజేస్తారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా అమెరికాలో 30 వేల మంది వాలంటీర్లను ప్రయోగాల కోసం తీసుకుంది. ఇంత భారీ మొత్తంలో టీకాను వాలంటీర్ లపై ప్రయోగించడం వల్ల ఫలితాలు మరింత కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రాథమిక దశల్లో పాల్గొన్న వారిలో కనిపించని దుష్ప్రభావాలేమైనా తలెత్తుతాయేమో పరిశీలిస్తారు. దాదాపు మూడు వంతుల మందికి వ్యాక్సి్‌న్‌ అందజేసినట్లు సమాచారం.

ఇక పోతే కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా దాంతో పాటు మరో తొమ్మిది వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. ఈ తొమ్మిది వ్యాక్సిన్ లలో మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. పలు సంస్థలు వ్యాక్సిన్‌ తయారీ, భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేసేందుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా ఇలాంటి తీర్మానాలు చేసుకోవడం ఆ విదంగా చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Web TitleOXFORD University vaccine study paused
Next Story