ప్రధాని చెప్పింది నిజమే: అమిత్‌షా

ప్రధాని చెప్పింది నిజమే: అమిత్‌షా
x
అమిత్‌షా
Highlights

దేశవ్యాప్తంగా 'పౌరసత్వ' నిరసనల సెగ రేగుతున్న సమయంలో జాతీయ జనాభా(ఎన్‌పీఆర్) రిజిస్టర్‌ నవీకరణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం కలకలానికి దారితీస్తోంది....

దేశవ్యాప్తంగా 'పౌరసత్వ' నిరసనల సెగ రేగుతున్న సమయంలో జాతీయ జనాభా(ఎన్‌పీఆర్) రిజిస్టర్‌ నవీకరణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం కలకలానికి దారితీస్తోంది. ఎన్‌పీఆర్ అప్‌డేట్ చేయడానికి సేకరించే వివరాలను జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) కోసం వినియోగిస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటి ఆందోళన అనవసరమని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే అమిత్ షా కూడా కీలక ప్రకటన చేశారు. ఎన్‌పీఆర్‌కు ఎన్‌ఆర్‌సీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఎన్‌ఆర్‌సీపై ప్రధాని నరేంద్రమోడీ చెప్పిందే నిజమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. దీనిపై పార్లమెంట్‌, కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చ అవసరం లేదని చెప్పారు. ఢిల్లీలో ఓ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ అంశంలో దుష్ప్రచారం చేసేవారితో మైనారిటీలు, పేదలకు నష్టం జరుగుతోందన్నారు. మీరు దేశ పౌరులా? అనే ప్రశ్నలు ఎన్‌పీఆర్‌లో ఉండవని చెప్పారు. 2010లోనే యూపీఏ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ ప్రక్రియ చేపట్టిందన్నారు. అప్పుడు దీనిపై ఎవరూ ప్రశ్నించలేదని ఇప్పుడెందుకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఎవరి పౌరసత్వం లాక్కునే ప్రసక్తే లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.

కేరళ, పశ్చిమబెంగాల్‌లాంటి పేద రాష్ట్రాలకు సీఏఏతో ఉపయోగం ఉంటుందని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని పునఃపరిశీలించాలని విపక్షాలను ఆయన కోరారు. ''కాంగ్రెస్‌ తీసుకొచ్చిన ప్రక్రియనే తాము కొనసాగిస్తున్నామన్నారు ఎన్‌పీఆర్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించినట్టు తెలిపారు. ఎన్‌పీఆర్‌లో ఆధార్‌ సంఖ్య, ఓటరు నంబరు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలు సేకరించడంలో ఎలాంటి తప్పూ లేదని, ఇలాంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేకరిస్తాయన్నారు. దేశ జనగణన వేరు ఎన్‌పీఆర్‌ వేరు రెండింటికీ చాలా తేడా ఉందన్నారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు సంబంధం లేదన్నారు. సీఏఏను వ్యతిరేకించే రాష్ట్రాలతో చర్చిస్తామని, ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సీఏఏతో పేదలకు కలిగే లాభాలను ఆయా రాష్ట్రాలకు వివరిస్తామన్నారు అమిత్‌షా.

ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ తమ అజెండా కాదన్న అమిత్‌షా గతంలో యూపీఏ తెచ్చిన అజెండా అని చెప్పారు. జనగణన, ఎన్‌పీఆర్‌ ప్రక్రియ 2020 ఏప్రిల్‌లో గృహాల మ్యాపింగ్‌తో ప్రారంభమైందన్నారు. 2021 ఫిబ్రవరిలో జనగణన, ఎన్‌పీఆర్‌ చేపడతామని చెప్పారు. ఎన్‌పీఆర్‌లో పేరు గల్లంతైనా వారి పౌరసత్వానికి ఢోకా లేదని, ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సీఏఏకు సంబంధంలేని రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీఏఏపై ప్రజలకు ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని, ప్రభుత్వ కార్యక్రమాలతో ఎంతోమందికి అవగాహన పెరిగిందని చెప్పారు. దేశంలో నిర్బంధ కేంద్రాలు ఎప్పట్నుంచో కొనసాగుతున్న ప్రక్రియ అన్నారు. ఎన్‌ఆర్‌సీ ద్వారా పౌరసత్వాన్ని కోల్పోయిన వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచబోమని చెప్పారు షా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories