Top
logo

భార్యాభర్తల నడుమ ఆర్థిక సంక్షోభం సమసేనా?

భార్యాభర్తల నడుమ ఆర్థిక సంక్షోభం సమసేనా?
Highlights

భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు చాలా కామన్‌. ఆదాయానికి మించిన ఖర్చులపై ఇద్దరూ వాదులాడుకోవడం మామూలే....

భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు చాలా కామన్‌. ఆదాయానికి మించిన ఖర్చులపై ఇద్దరూ వాదులాడుకోవడం మామూలే. ఇంట్లో ఆర్థిక సంక్షోభంపై, ఓ మోస్తరు యుద్ధము లాంటివి కూడా జనరలే. ఇప్పుడు ఓ ఇద్దరు ప్రముఖ దంపతుల మధ్య కూడా, ఆర్థికం గురించి పెద్ద గొడవే జరిగింది. కానీ హోమ్‌ ఫైనాన్స్ గురించి కాదు, దేశ ఫైనాన్స్‌ గురించి. వాళ్లెవరో కాదు, కేంద్ర ఆర్థికమంత్రి, నిర్మలా సీతారామన్, ఆమె భర్త, ప్రముఖ పొలిటికల్ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్‌ల మధ్య, దేశ ఆర్థికమాంద్యంపై చిన్నపాటి సమరం సాగింది. జాతీయస్థాయిలోనూ వీరి పరస్పర కామెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక మంత్రి, పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్ ఇద్దరూ భార్యాభర్తలు. ఒకరు దేశ ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటే, మరొకరు ఆ ఆర్థిక విధానాల మంచీ చెడ్డలను విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు ఆర్థికరంగం గురించి వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధంలాంటిది జరిగింది. దేశంలోని ఆర్థికస్థితి మందగమనంపై దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తోందని, పరకాల వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. సాక్షాత్తు భార్య ఆర్థికమంత్రిగా ఉన్న టైంలో, పరకాల చేసిన వ్యాఖ్యలపై, దేశమంతా చర్చ జరుగుతోంది.

గతంలో టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా, అంతకుముందు ప్రజారాజ్యంలో కీలక నేతగా పని చేసిన పరకాల ప్రభాకర్, ప్రముఖ ఇంగ్లీష్‌ దిన పత్రిక ది హిందూకు ఆర్థికాంశాలపై వ్యాసాలు రాస్తుంటారు. తాజాగా దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్థిక విధానాలకు బాటలు చూపిన పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్ ఆర్థిక నమూనాను అనుసరించాలని పరకాల సూచించారు. పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక విధానాలు నేటికీ సవాలు చేయలేనివిధంగా, ఉద్దీపనతో కూడినవిగా ఉన్నాయన్నారు.

పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, తన భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్థాగత సంస్కరణలను చేపట్టిందన్న నిర్మలా సీతారామన్, ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందనేది గుర్తించే క్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ల హయాంలోనే వీటికి బీజం పడిందన్నది వెల్లడైందని చెప్పారు. మన్మోహన్‌ టైంలో, బయటి నుంచి కాంగ్రెస్‌ నేతలు ఫోన్‌లు చేసినా, కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల అన్నారు.

మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థపై భర్త పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, వాటికి పరోక్ష కౌంటర్‌ అన్నట్టుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇతరులెవరో బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి వుంటే, ఈ వ్యాఖ్యలకు ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదు. కానీ భార్య ఆర్థికమంత్రిగా వున్న టైంలో, ఆర్థిక వ్యవస్థ ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్న తరుణంలో, భర్త పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తానికి దంపతుల డైలాగ్‌ వార్‌ దేశమంతా ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, వృత్తిలో భాగంగా పరకాల కామెంట్లు చేశారని, వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఇంటి బయట కలకలం రేపుతున్న వీరిద్దరి వ్యాఖ్యలు, ఇంట్లోనూ రగడ సృష్టిస్తాయో లైట్‌ తీసుకుంటారో.


లైవ్ టీవి


Share it
Top