జగన్నాథుని రహస్య గదికి సొరంగమార్గం.. 46 మంది రాజుల నిథి ఉన్నట్టా, లేనట్టా?


జగన్నాథుని రహస్య గదికి సొరంగమార్గం.. 46 మంది రాజుల నిథి ఉన్నట్టా, లేనట్టా?
Puri Jagannath Temple: పూరీ టెంపుల్ సీక్రెట్స్.. యావత్ దేశం అటెన్షన్ ఇప్పుడు అక్కడే ఉంది.
Puri Jagannath Temple: పూరీ టెంపుల్ సీక్రెట్స్.. యావత్ దేశం అటెన్షన్ ఇప్పుడు అక్కడే ఉంది. మొన్నటికి మొన్న ఆలయ రహస్య గది తెరవాల్సిందిగా పురావస్తుశాఖ సూచనలిస్తే తాజాగా ఆ సీక్రెట్ రూమ్‌కు అంతకుమించిన రహస్య మార్గం ఉందని చరిత్రకారులు షాకిస్తున్నారు. కనిపించకుండా పోయిన తాళం గురించి వదిలేసి సొరంగ మార్గాన్ని ఫాలో అయితే జగన్నాథుని నిథి మిస్టరీ వీడిపోతుంది అంటున్నారు. ఇంతకూ, పూరీ రత్నభాండాగారం తెరుచుకుంటుందా, లేదా..? మూడోగదికి టన్నెల్ రూట్ ఉందన్న వాదనల్లో నిజమెంత..? అన్నింటికీ మించి ఆ 46 మంది రాజులు స్వామివారి పాదాల చెంత దాచిన సంపద సేఫేనా..?
రత్న భాండాగారం యావత్ దేశం అటెన్షన్ ఇప్పుడు అక్కడే ఉంది. కనిపించకుండా పోయిన తాళం దొరుకుతుందా..? మూడోగది తలుపులు తెరుచుకుంటాయా..? స్వామివారి రత్నభాండాగారంలో అసలు ఎన్ని గదులున్నాయి..? ఎంత సంపద దాక్కొని ఉంది..? ఇలా ఒక్కటేంటి వందల ఏళ్ల మిస్టరీపై వేల ప్రశ్నలు జగన్నాథుని భక్తులతో పాటు దేశ ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రత్న భాండాగారం తెరవకుంటే ఆలయానికే నష్టం అంటూ రీసెంట్‌గా పురావస్తు శాఖ లేఖ రాసింది. కానీ, ఆ మూడో గది తాళం దశాబ్దాలకు ముందు కనిపించకుండా పోయిందన్న కారణంతో రత్న భాండాగారం ఎలా తెరుచుకుంటుందని అందరూ తలలు పట్టుకున్న వేళ ఓ చరిత్రకారుడు ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చారు అదే సొరంగ మార్గం. ఈ దారిలో వెళితే ఒక్క మూడో గది మిస్టరీ ఏంటి దాని కింద దాక్కొని ఉన్న లెక్కకుమించిన నేలమాలిగళ లెక్కలు కూడా తేల్చేయచ్చు అంటున్నారు. దీంతో మరోసారి పూరీ జగన్నాథుని రత్న భాండాగారం టాప్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది.
12వ శతాబ్ధం మొదలు 18వ శతాబ్ధం వరకూ ఉత్కళను పాలించిన 46 మంది రాజుల సంపద మొత్తం జగన్నాథుని సన్నిథిలో ఉన్న రత్న భాండాగారంలోని మూడు గదుల్లోనే ఉంది. ఆ మూడు గదుల్లో అత్యంత రహస్యమైందీ అంతులేని సంపద నిండి ఉన్నదీ శతాబ్దాలుగా తెరుచుకోని మూడో గదిలోనే ఉందని చరిత్ర చెబుతోంది. ఈ గదిని తెరవాలంటే మూడు తాళాలు ఉండాలి. ప్రస్తుతం రెండు తాళాలు ఉన్నప్పటికీ మూడో తాళం దశాబ్ధాలుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ మిస్టీరియస్ గదిని తెరవడం అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలోనే ఓ చరిత్రకారుడు పూరీ జగన్నాథుని సీక్రెట్ రూమ్‌కు తాళంతో పనిలేదని చెప్పి షాకిచ్చారు. ఆ మూడో గదిని చేరుకునేందుకు ఓ సొరంగ మార్గం ఉందన్నారు. అయితే, అక్కడికి చేరుకోవాలంటే అంత సులువేం కాదంటున్నారు. ఆ రహస్య మార్గానికి సంబంధించి 1926లో చెన్నైకు చెందిన అధికారులు కీలక వివరాలు నిథికి సంబంధించిన పట్టీపై రాసినట్టు గుర్తు చేశారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే అనంతపద్మనాభ స్వామి నేలమాలిగళకు మించిన సంపద రత్న భాండాగారంలో బయటపడొచ్చని అంచనా వేస్తున్నారు.
నిజానికి.. 1926లోనే పూరీ రాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిష్ పాలకులు కలిసి పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారు. అందులో 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారు. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్ధాలు రావడమే. దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారు. వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ, జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించ లేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్‌గా అభివర్ణించారు. అంతేకాదు, తమ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ, నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
1926లో లెక్కించింది రెండు గదుల్లో సంపద మాత్రమే. అసలు సంపద ఆ మూడో గదిలోనే ఉందనేది చరిత్ర కారులు చెబుతున్న మాట. శతాబ్ధాలుగా ఆ మూడో గది మిస్టరీని చేధిద్దాం అని ప్రభుత్వాలు, యంత్రాగాలు ప్రయత్నాలు చేసినా గది తలుపులు తెరవడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మూడో తాళం కనిపించకుండా పోవడమే. ఒకవేళ తాళం పగలగొడదామన్నా అదంత ఈజీ కాదని పురావస్తుశాఖ అధికారులే తేల్చేశారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఓ గదికి మూడు తాళాలు అమర్చడం అంటే ఎంత పకడ్బందీగా చేసుంటారో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, స్వామి వారి రత్న భాండాగారం తలుపులు పగలగొడితే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో అనే భయం ఎలాగో ఉండనే ఉంది. మొత్తంగా టెక్నికల్‌గానూ సెంటిమెంట్ పరంగానూ జగన్నాథుని మిస్టీరియస్ గదిని తెరవడం ఇప్పటి వరకూ వీలు పడలేదు. ఇలాంటి సమయంలో అసలు ఆ గదిని తెరిచేందుకు తాళమే అవసరం లేదని, అక్కడికి చేరుకునేందుకు ఓ రహస్య సొరంగం ఉందని చరిత్రకారులు చెప్పడం ఉత్కంఠ రేపుతోంది.
నిజానికి జగన్నాథుని రత్నభాండాగారం గురించి అంతా రహస్యమే. లోపల ఎన్ని గదులున్నాయి..? ఎంత సంపద ఉంది..? ఇవేవీ బయటకు పొక్కవు. మహాలక్ష్మి నిలయంగా భక్తులు విశ్వసించే ఈ భాండాగారంలో విశాలమైన గదులు మూడున్నాయన్నది కేవలం అంచనా మాత్రమే. విలువైన సంపద పుష్కలంగా ఉన్నా దానిని పూర్తిగా చూసిన వారెవరూ లేరు. ఈ భాండాగారాన్ని 1982లో ఒడిశా ప్రభుత్వం తెరవాలనుకుంది. ఆ సమయంలో భాండాగారంలోని రెండు గదులను తెరిచిన అధికారులు అసలైన మూడో గది ప్రధాన ద్వారం వరకూ మాత్రమే వెళ్లి లోపలికి వెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయారు. గది లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని దీంతో అధికారులు లోపలికి వెళ్లలేక పోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, లోపలికి వెళ్లలేకపోవడానికి అసలు కారణం ఆ గదికి సంబంధించిన ఓ తాళం కనిపించకుండా పోవడమే. అంతకుముందే తాళం మిస్సవడంతో డూప్లికేట్ తాళం చెవి చేయించారు. కానీ, అదికూడా కనిపించకుండా పోవడం తీవ్ర దూమారానికి కారణమైంది. అయితే, ఇప్పుడు కనిపించకుండా పోయిన తాళం గురించి పట్టించు కోవాల్సిన అవసరం లేదని ఆ మిస్టీరియస్ గదిని చేరుకోవడానికి సొరంగ మార్గం ఉందని చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర చెబుతున్నారు.
అంతేకాదు, అందరూ అనుకుంటున్నట్టు మిస్టీరియస్ గది ఒక్కటి కాదన్నారు. ఆ గది కింద లెక్కకుమించిన రహస్య గదులున్నాయని 1926లో చెన్నై అధికారులు తేల్చినట్టు తెలిపారు. ఆ సమయంలో భూగర్భంలో ఉన్న ఆ గదుల్లోకి వెళ్లలేక పోవడానికి లోపలి నుంచి వింత శబ్దాలు రావడమే కారణమని అప్పుడు నిథి గురించి రాసిన పట్టికలో పేర్కొన్నట్టు గుర్తు చేశారు. చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర చెప్పిన అంశాల గురించి సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఇప్పటి వరకూ పూరీ రత్న భాండాగారంపై అందరి అంచనాలన్నీ తప్పే. ఆ మొత్తం గదులు తెరిస్తే తప్ప పూరీ జగన్నాథుని పురాతన నిథి ఎంత అన్నది ఓ క్లారిటీ రాకపోవచ్చు. కానీ, సురేంద్ర మిశ్ర చెబుతున్న లెక్కల ప్రకారం జగన్నాథుని రహస్య గదుల్లో అనంతపద్మనాభ నేలమాళిగలకు మించిన సంపద, అది కూడా ఏ ఒక్కరూ అంచనా వేయలేనంత సంపద ఉందన్నది మాత్రం స్పష్టం అవుతోంది.
46 మంది రాజులు.. వందల యుద్ధాలు విజయం సాధించిన ప్రతిసారీ ఆ సంపద వచ్చి చేరేది జగన్నాథుని పాదాల చెంతకే స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర, వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో పూరీ రత్న భాండాగారం గదుల లెక్క తప్పన్న సురేంద్ర మిశ్రా వ్యాఖ్యలను ఏమాత్రం కొట్టిపారేయలేం అంటున్నారు పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారులు. దీంతో చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా చెబుతున్న సొరంగ మార్గంపై అధికారులు దృష్టి పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ సొరంగ మార్గం పరిస్థితి ఎలా ఉంది..? ఆ మిస్టీరియస్ గదుల దగ్గరకు చేరుకోవాలంటే ఏం చేయాలి అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే, సురేంద్ర చెబుతున్నట్టు 1926లో చెన్నై అధికారులు ఇచ్చిన వివరాలను మరోసారి పరిశీలిస్తే రహస్య సొరంగ మార్గం వివరాలు తెలుస్తాయంటున్నారు. మరి ఆ దిశగా ఒడిశా సర్కార్, యంత్రాంగం అడుగులు వేస్తుందా అన్నది మిలియన్ మార్క్ ప్రశ్నగానే కనిపిస్తోంది. మొత్తంగా ఇన్ని శతాబ్ధాల మిస్టరీ వీడేందుకు ఓ దారి ఉందన్న అంచనాలు మాత్రం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire