Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ సీపీ సంచలన ఆరోపణలు

Maharashtra Home Minister told Sachin Waze to Collect Rs 100 Crore says Mumbai Police ex-chief
x

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ సీపీ సంచలన ఆరోపణలు

Highlights

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో విచారణ సరిగా చేయడం లేదంటూ ప్రభుత్వం ఇటీవల ఆయనను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేసింది. తాజాగా, పరమ్‌బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు 8 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్ట్ అయిన అదనపు ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేతోపాటు ఏసీపీ సంజయ్ పాటిల్‌కు నెలకు రూ. 100 కోట్లు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని మంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకోసం మంత్రే మార్గాలు సూచించారని తెలిపారు.

పరమ్​బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. హోంశాఖమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఎన్‌సీపీ నేతలతో శరద్ పవార్ సమావేశం కానున్నారు.

పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలను మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరేణ్ అనుమానాస్పద మృతి కేసులో వాజేతోపాటు పరమ్‌బీర్ సింగ్ హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. అరెస్ట్ భయంతోనే పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారని, పరమ్‌బీర్‌పై పరువునష్టం దావా వేస్తానని అనిల్ దేశ్‌ముఖ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories