Top
logo

మ‌రో లాక్‌డౌన్‌కు అవ‌కాశం ఇవ్వొద్దు: సీఎం

మ‌రో లాక్‌డౌన్‌కు అవ‌కాశం ఇవ్వొద్దు: సీఎం
X

మ‌రో లాక్‌డౌన్‌కు అవ‌కాశం ఇవ్వొద్దు: సీఎం

Highlights

కంటికి కనిపించని శత్రువు మళ్లీ దాడి చేస్తోంది. అవును దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ...

కంటికి కనిపించని శత్రువు మళ్లీ దాడి చేస్తోంది. అవును దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నా కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతుంది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ప్రజలు ఇలాగే వ్యవహరిస్తే లాక్‌డౌన్‌ విధించడం తప్పనిసరంటూ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటిస్తారా..? లేక లాక్‌డౌన్‌ ఎదుర్కొంటారా..? అని ప్రజలకు వెల్లడిస్తున్నారు.

ప్రధానంగా మహారాష్ట్ర, ముంబైలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చెప్పాలంటే మహారాష్ట్రలో మునుపటి రోజులు పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్‌ అక్కడ వికట్టహాసం చేస్తోంది. వరుసగా మూడు రోజులుగా ఆరు వేలకుపైనే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తే ఈ జాబితాలో ఆరాష్ట్ర ప్రముఖులు ఉండటం కలవరపరుస్తోంది. రాష్ట్రంలో రెండో వేవ్‌ కొనసాగుతుందా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సిచ్‌వేషన్‌ చేయి దాటిపోయిందంటున్నారు అధికారులు. దీంతో కరోనా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది.

ఇదిలా ఉండగా ముంబైలో కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. ముంబైలో రోజుకు రెండువేలకుపైగా కేసులు నమోదుకాడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అలర్ట్‌ అయింది. దీంతో నగరంలో వేయి బిల్డింగ్‌లను అధికారులు మూసివేశారు. అయితే సీల్‌ చేసిన బిల్డింగ్‌లో కరోనా కేసులు బయటపడటంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే బిల్డింగ్స్‌ను మూసినట్లు అధికారులు చెబుతున్నారు. అటు బీఎంసీ సరికొత్త నిబంధనలు జారీ చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి ముంబైకి వచ్చేవారు కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.

మహారాష్ట్రలో మహమ్మారి కరోనా విజృంభిస్తుండడంతో లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని ఆరాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే హెచ్చరించారు. మరో రెండు రోజుల పాటు కేసుల సంఖ్య పెరిగితే లాక్‌ విధిస్తానని మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోమారు లాక్‌డౌన్‌ కోరుకుంటున్నట్లేనని ఆయన అన్నారు. లాక్‌డౌన్‌ వద్దనుకునే వారు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర ఉండటంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ‌్యంగా ప్రజల రవాణాతో ఒకరినుంచి మరొకరికి వైరస్‌ వేగంగా సోకుతుందనే భయాందోళన జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో వేలాది మంది రాకపోకలను తగ్గించారు. ముఖ్యంగా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అటు వైరస్‌ వ్యాప్తి నియంత్రించేందుకు వైద్యారోగ్యాశాఖ అధికారులు అలెర్ట్‌ అయ్యారు.

ప్రధానంగా మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చేవారికి ర్యాట్‌ విధానంలో కరోనా పరీక్షలు చేయిస్తున్నట్లు తెలియజేశారు. పరీక్షలు చేసిన అనంతరం వారం రోజుల క్వారంటైన్‌లో ఉండేలా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాలన్నారు. సాధ్యమైనంత వరకు మహారాష్ట్రకు రాకపోకలు చేయకూడదని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా నుంచి కోలుకోలేకపోయినా మహారాష్ట్ర నుంచి ముప్పు ఉండటంతో కరోనా విస్తరించకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మహారాష్ట్రలో ప్రధానంగా యావత్మాల్‌, నాందేడ్‌, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌, అమరావతి ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే అకోలా, అమరావతి వంటి ప్రాంతాలలో చేయి దాటిపోయింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాక్‌డౌన్‌ విధించారు అధికారులు. అదేవిధంగా నాగ్‌పూర్‌ జిల్లా పరిధిలో పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లను తాత్కాళికంగా మూసినట్లు ప్రకటించారు. మార్చి 7వ తేదీ వరకు నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు తెలియజేశారు.

Web TitleLockdown If Cases Rising Says, Uddhav Thackeray
Next Story