logo
జాతీయం

చెత్తకుప్పలను తలపిస్తున్న చార్‌ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు..

Kedarnath Littered With Plastic Waste and Garbage
X

చెత్తకుప్పలను తలపిస్తున్న చార్‌ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు..

Highlights

Char Dham Yatra: పుణ్యం కోసమని వెళ్తూ పాపానికి పాల్పడుతున్నారు.

Char Dham Yatra: పుణ్యం కోసమని వెళ్తూ పాపానికి పాల్పడుతున్నారు. పవిత్రమైన నాలుగు క్షేత్రాలను దర్శించేందుకు వెళ్లే భక్తులు చార్‌ధామ్‌ రోడ్లను చెత్తకుప్పలుగా మారుస్తున్నారు. హిమసానువుల్లో కొలువైన కేదార్‌నాథ్‌, బదిరీనాథ్, గంగ్రోత్రి, యమునోత్రి క్షేత్రాల వెళ్లే మార్గాల్లో ఏ రహదారిలో చూసినా.. ప్లాస్టిక్‌తో సహా పలు రకాల వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. బ్యాగులు, సీసాలు, ఇతర వ్యర్థాలతో డంప్‌ యార్డులను తలపిస్తుండడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్‌ధామ్‌ కోసం తరలివస్తున్న వేలాది మంది భక్తుల కోసం సరైన పారిశుధ్య సౌకర్యాలను కల్పించడంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విఫలమవ్వడమే అందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కోవిడ్‌ అనంతరం రెండేళ్ల తరువాత చార్‌దామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హిమసానువుల్లో కొలువైన కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిస్తున్నారు. నాలుగు పుణ్యక్షేత్రాల్లోని వాతావరణ పరిస్థితులు కారణంగా ఏటా ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు. మేలో వచ్చే అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు ఈ ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈనెల 3న గంగోత్రి, యమునోత్రి, 6న కేదార్‌నాథ్‌, 8న బదరీనాథ్‌ ఆలయాలు తెరుచుకున్నాయి. వీటిలో ముఖ్యంగా జ్యోతిర్లంగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌థామ్‌ యాత్రకు వెళ్లే భక్తులు ఉత్తరాఖండ్ పర్యాటక పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్‌ థామీ సూచించారు. ఆమేరకు ఇప్పటి వరకు పోర్టల్‌లో లక్షా 50 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్య క్షేత్రాలకు తరలిస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభమైన తొలిరోజే కేదార్‌నాథ్‌ యాత్రకు 13వేల మంది మేర భక్తులు తరలివచ్చారు. ఓ వైపు భక్తులు భారీగా వస్తుండగా మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత కఠినమైన చార్‌ధామ్‌ మార్గాల్లో రహదారులు వరదకు కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రిషికేశ్‌ - యుమునోత్రి జాతీయ రహదారిపై జంకిచట్టి వద్ద రహదారి భద్రతా గోడ కూలిపోయింది. భారీ వరదలకు సయనచట్టి, రణచట్టి మధ్య ఉన్న రహదారి వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలను అధికారులు నిలిపేశారు. తరచూ యాత్రలకు అంతరాయం ఏర్పడడంతో భక్తులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు. గుడారాలు వేసిన రోజుల తరబడి దర్శనం కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు పడేసిన వ్యర్థాలతో చార్‌థామ్‌ రోడ్లన్నీ డంప్‌యార్డులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వస్తువులైన బ్యాగులు, సీసాలు, ఇతర వ్యర్థ పదార్థాలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కేదార్‌నాథ్‌ మార్గంలో అత్యధికంగా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నట్టు పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుణ్యం కోసం పవిత్ర క్షేత్రాలకు వస్తున్న భక్తులు పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి తీరని నష్టాన్ని కలుగజేస్తాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఉత్తరాఖండ్‌లోని జలప్రళయం వంటి ఘటనలు మళ్లీ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సంభవింక్షే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారీ వినాసనకరమైన వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదముందంటున్నారు. పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగారు. అయితే అందుకు అనుగుణంగా అక్కడ పారిశుధ్య ఏర్పాటు లేవు. నడక దారిలోనే ఎక్కువ చెత్త పడుతున్నదని ఆయా మార్గాల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నాయి. లేదంటే భక్తులు పడేసే వ్యర్థాలతో హిమాలయాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అటు కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

మరోవైపు చార్‌థామ్‌ యాత్రలోని వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఎత్తైన కొండల్లో ఆక్సిజన్‌ అందక పలువురు భక్తులు మృత్యువాత పడుతున్నారు. ఈనెల 3న చార్‌థామ్‌ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 48 మంది మృతి చెందినట్టు ఉత్తరాఖండ్‌ అధికారులు తెలిపారు. వారిలో 46 మంది గుండెపోటుతోనే మృతి చెందారు. అధిక రక్తపోటు, హార్ట్‌ అటాక్‌, మౌంటెన్‌ సిక్‌నెస్‌ అందుకు కారణమని చెబుతున్నారు. నాలుగు పుణ్య క్షేత్రాలు ఎత్తైన మంచు కొండల ఉండడంతో భక్తులు అలయాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది యాత్రికులు ప్రయాణం మధ్యలో మరణిస్తున్నారు. అయితే, ప్రభుత్వం యాత్ర మార్గంలో అనేక ప్రదేశాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. కాగా, యాత్రికులు ప్రయాణం మొదలు పెట్టేముందు పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది. యాత్రికులు తమ ఆహారం, నీళ్లు ముందే సమకూర్చుకుంటే ఇబ్బంది ఉండదని చెబుతోంది.

ఏదైమైనా అత్యంత కఠినమైన నాలుగు పుణ్య క్షేత్రాలకు వెళ్లే మార్గంలో చెత్త నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయడంతో పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని ఇప్పటికైనా అప్రమత్తమవ్వాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Web TitleKedarnath Littered With Plastic Waste and Garbage
Next Story