వధువు 'కిల్లర్' స్కెచ్: పెళ్లి కొడుకును చంపేందుకు ప్రియుడికి లైవ్ లోకేషన్ షేరింగ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!

Arun Chilukuri
Published on: 3 Feb 2026 3:17 PM IST
వధువు కిల్లర్ స్కెచ్: పెళ్లి కొడుకును చంపేందుకు ప్రియుడికి లైవ్ లోకేషన్ షేరింగ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!
X

సినిమా కథను తలపించేలా ఒక వధువు తన పెళ్లిని ఆపుకోవడానికి వేసిన కిరాతక ప్లాన్ ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కోపంతో, తన మాజీ ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడినే మట్టుబెట్టాలని చూసిందా కిలేడీ. ఈ ఘటనలో వరుడు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

అసలేం జరిగింది?

చామరాజనగర్‌ జిల్లా కొల్లేగాళ టౌన్‌కు చెందిన రవీశ్ అనే యువకుడికి, సమీప గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. జనవరి 30న కొళ్లేగాలలోని వేంకటేశ్వర మహల్‌లో రిసెప్షన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికి ఒక రోజు ముందు, వరుడు రవీశ్ కారులో వేడుక కోసం మండపానికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో వధువు ప్రియుడు దర్శన్ తన స్నేహితులతో కలిసి మరో కారులో వచ్చి రవీశ్ కారును అడ్డగించాడు. ఏమాత్రం ఆలోచించకుండా రవీశ్ కడుపులో కత్తితో బలంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన రవీశ్‌ను బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో అసలు నిజాం బయటపడింది.

లోకేషన్ షేరింగ్: వరుడు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడు? కారులో ఎప్పుడు బయలుదేరాడు? వంటి వివరాలను వధువే ఎప్పటికప్పుడు తన మాజీ ప్రియుడు దర్శన్‌కు చేరవేసింది.

షాకింగ్ నిజం: గాయపడిన వరుడిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన వధువు.. అక్కడ డ్రామా చేస్తూ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మెల్లగా చెప్పింది. కానీ పోలీసులు ఆమె వాట్సాప్ చాట్స్ చూశాక, అసలు మాస్టర్ మైండ్ ఆమెనే అని తేల్చారు.

నిందితుల అరెస్ట్

పోలీసులు యువతితో పాటు దాడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు దర్శన్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. యువతి తల్లిదండ్రులు స్పందిస్తూ.. ఆమెకు గతంలో ప్రేమ వ్యవహారం ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆమె అంగీకారంతోనే పెళ్లి నిశ్చయించామని, ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని వాపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story