పార్లమెంట్‌లో కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు JPC Report పై ఇంత రగడ ఎందుకు? ఫుల్ స్టోరీ


JPC report on Waqf Amendment Bill 2024 : పార్లమెంట్‌లో రచ్చరచ్చకు కారణమైన JPC Report లో ఏముంది?
What is Waqf Amendment Bill 2024 : ఫిబ్రవరి 13న పార్లమెంట్ సమావేశాల్లో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుపై...
What is Waqf Amendment Bill 2024 : ఫిబ్రవరి 13న పార్లమెంట్ సమావేశాల్లో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుపై కేంద్రం జేపీసీ రిపోర్ట్ ప్రవేశపెట్టడం కాగా రెండోది కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టానికి సంబంధించిన బిల్లుపై పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుపై జేపీసీ రిపోర్ట్ విషయంలోనే ఇవాళ పార్లమెంట్‌లో పెద్ద రగడ జరిగింది.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ విపక్షాలు సభలోనే ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో కొంతమంది మైనార్టీ ఎంపీలు పోడియంలోకి వెళ్లి మరీ కేంద్రం తీరుపై నిరసన తెలిపారు. ఇంతకీ ఈ రగడకు కారణం ఏంటి? జేపీసీ రిపోర్టుపై విపక్షాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయి? అసలు ఈ జేపిసి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లును కేంద్రం ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు ఎందుకు?
1995 నాటి వక్ఫ్ చట్టంలో పలు సవరణలు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ఈ వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు తీసుకొస్తోంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు ఆస్తుల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యం అని కేంద్రం చెబుతోంది. పైగా వక్ఫ్ చట్టంలో సవరణలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి?
వక్ఫ్ అనే పదం అరబిక్ నుండి వచ్చింది. అరబిక్‌లో వక్ఫ్ అంటే సంక్షేమ కార్యకలాపాల కోసం ఒక సంస్థకు ఇచ్చే బహుమతి లేదా దానం అని అర్థం. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం, వారి కోసం నడిచే విద్యా సంస్థల నిర్వహణ కోసం దానం రూపంలో వచ్చిన భూములు, ఇతర ఆస్తుల నిర్వహణ కోసం ఏర్పడిందే ఈ వక్ఫ్ బోర్డ్.
వక్ఫ్ బోర్డ్ చట్టం ప్రకారం.. ఒకరు ఒక ఆస్తిని వక్ఫ్ బోర్డుకు రాసిచ్చారంటే... అది ఇక అల్లాకు చెందినట్లేనని భావిస్తారు. ఆ ఆస్తిని వెనక్కు తీసుకునేందుకు కానీ లేదా యాజమాన్యం హక్కులు మార్చడానికి కానీ వీల్లేదు. ప్రస్తుతం 1995 నాటి వక్ఫ్ చట్టం అమలులో ఉంది. వక్ఫ్ ఆస్తులు ప్రైవేటువ్యక్తుల పరం కాకుండా కాపాడటమే వక్ఫ్ బోర్డ్ లక్ష్యం.
రూ. 1.20 లక్షల కోట్ల ఆస్తులు
గతేడాది ఆగస్ట్ 8న వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అప్పటికే దేశంలో ఉన్న 32 వక్ఫ్ బోర్డుల వద్ద మొత్తం 8 లక్షల 70 వేల ఆస్తులు ఉన్నాయి. అందులో దేశం మొత్తం 9 లక్షల 40 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ ఆస్తుల మొత్తం విలువ 1 లక్షా 20 వేల కోట్లు ఉంటుందని ఒక అంచనా.
ఇండియాలో ఇండియన్ రైల్వే, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ తరువాత ఎక్కువ మొత్తం భూములు ఉన్న సంస్ఖ వక్ఫ్ బోర్డ్ అని చెబుతుంటారు.
చట్టంలో తీసుకొస్తున్న కీలకమైన మార్పులు ఏంటి?
ఇప్పుడున్న వక్ఫ్ చట్టం పేరు మార్చి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్ 1995 గా మార్చాలనేది కేంద్రం ఉద్దేశం. ఇక ఇందులో కొన్ని ముఖ్యమైన సవరణలను పాయింట్స్ వారీగా చూద్దాం.
1) చట్టపరంగా ఒక ఆస్తిపై అన్ని హక్కులు ఉన్న వారు మాత్రమే వక్ఫ్‌కు ఆ ఆస్తిని రాసివ్వాలి. తగదాల్లో ఉన్న ఆస్తిని వక్ఫ్ కోసం రాసిస్తే తరువాత ఆ ఆస్తులపై కేసులు దాఖలవుతున్నాయి. ఆ సమస్యను నివారించడం కోసమే ఈ సవరణ తీసుకొస్తున్నారు.
2) వక్ఫ్ చట్టం తీసుకురావడానికి ముందున్న ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తుల జాబితాలో చేర్చినట్లయితే, చట్టరీత్యా అది చెల్లదు అనేది రెండో సవరణ.
3) ప్రస్తుతం వక్ఫ్ ఆస్తుల తగాదాలను వక్ఫ్ ట్రైబ్యునల్స్ విచారిస్తున్నాయి. ఈ విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. అందుకే ఒక ఆస్తి ప్రభుత్వానిదా లేక వక్ఫ్ బోర్డుదా అని నిర్ధారించే హక్కు ఆ జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉండాలి కానీ వక్ఫ్ ట్రైబ్యునల్స్‌కు కాదని కేంద్రం సవరణలు సూచిస్తోంది.
4) ప్రస్తుతం మసీదులు, ముస్లిం స్మశానవాటికలను వక్ఫ్ ఆస్తులుగా చెబుతున్నారు. అందులో కొన్నింటికి అధికారిక డాక్యుమెంట్స్ లేనప్పటికీ వాటిని వక్ఫ్ ఆస్తులుగానే పరిగణిస్తున్నారు. కానీ కేంద్రం తీసుకురానున్న కొత్త బిల్లు ప్రకారం అధికారికంగా వక్ఫ్‌నామా డాక్యుమెంట్స్ ఉంటేనే వాటిని ఆస్తులుగా గుర్తించాల్సి ఉంటుంది.
5) ప్రస్తుతం ఉన్న స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలకు మాత్రమే చోటుంది. కానీ కేంద్రం కొత్తగా సూచించిన సవరణల ప్రకారం స్టేట్ వక్ఫ్ బోర్డులో సీఈఓ స్థాయి వ్యక్తుల్లో ముస్లింయేతర వ్యక్తులకు కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరు ముస్లింయేతర వ్యక్తులు ఉంటారు.
కేంద్రం సూచిస్తున్న ఈ సవరణను కొంతమంది సమర్ధిస్తున్నారు. కొంతమంది ముస్లింలు దీనిని పూర్తిగా వ్యితిరేకిస్తున్నారు. ముస్లిం కమ్యునిటీని చీల్చడంతో పాటు ఆ వర్గంపై పట్టుసంపాదించుకోవడం కోసమే కేంద్రం ఈ సవరణ తీసుకొస్తుందంటున్నారు.
కేంద్రం తీసుకొచ్చే ఈ సవరణలు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని ఈ కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లును వ్యతిరేకించే వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు... ఇది వక్ఫ్ బోర్డ్స్‌కు పోస్ట్‌మార్టం చేయడమే అవుతుందని అంటున్నారు.
జేపీసీ ఎందుకు ఏర్పాటైంది?
కేంద్రం మొత్తం 25 సవరణలు సూచిస్తూ కొత్త అమెండ్‌మెంట్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, కొంతమంది ముస్లిం మైనార్టీలు ఈ కొత్త అమెండ్‌మెంట్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కొన్ని సవరణలపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుపై కేంద్రం గతేడాది ఆగస్టు 8న జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. జగదాంబకి పాల్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గతేడాది నవంబర్ 29న జేపిసీ రిపోర్ట్ అందించాల్సిందిగా సూచించింది. కానీ తమ అభిప్రాయాలు తీసుకోకుండానే కొత్త అమెండ్‌మెంట్ బిల్లు డ్రాఫ్ట్ ఎలా పూర్తి చేస్తారని విపక్షాలు అభ్యంతరం చెప్పడంతో జనవరి 29వ తేదీ వరకు ఆ గడువును పొడిగించారు.
ఆ తరువాత జేపీసీ కొత్త అమెండ్‌మెంట్ బిల్లు విషయంలో కేంద్రం నుండి వచ్చిన అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుంది. అయితే, విపక్షాల సవరణలను తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. ఈ జాయింట్ పార్లమెంటరీ రిపోర్టునే గురువారం కేంద్రం ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. జేపీసీ రిపోర్టులో తాము చెప్పిన అభిప్రాయాలను తొలగించారంటూ విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి.
నకిలీ జేపిసి రిపోర్ట్ - మల్లికార్జున ఖర్గే
రాజ్యసభలో ఇదే విషయమై ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెప్పిన అభిప్రాయాలను రిపోర్టులోంచి తొలగించడం అప్రజాస్వామికమే అవుతుందని అన్నారు. ప్రజామోదం లేకుండా ఏకపక్షంగా తయారు చేసిన ఈ నకిలీ రిపోర్టును తిప్పి పంపాలని రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్‌ను కోరారు. కానీ రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు.
మల్లికార్జున ఖర్గే వాదనలను అధికారపక్షం కూడా ఖండించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
అయితే, లోక్ సభలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఎంపీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిసి జేపీసీ రిపోర్టులో తొలగించిన అంశాలను తిరిగి చేర్చాలని పట్టుబట్టారు.
ఏదేమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు రూపొందితే దానిని అంగీకరించేది లేదని ప్రతిపక్షాలు తెగేసి చెబుతున్నాయి. మరోవైపు వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు తీసుకురావాలని బలంగా కోరుకుంటున్న కేంద్రం ఎలాగైనా ఈ బిల్లు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
ఈ కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు అన్ని చట్టాల తరహాలోనే ముందుగా లోక్ సభలో ఆమోదం పొందితే ఆ తరువాత పెద్దల సభకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తరువాత కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. కానీ ఈలోగా ఈ బిల్లు విషయంలో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయనేదే ప్రస్తుతానికి అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోన్న ప్రశ్న. ఇదీ లేటెస్ట్ ట్రెండింగ్ స్టోరీ.
Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



