లాక్ డౌన్ ముగిసిపోతే ప్రమాదం పోయినట్టేనా?

లాక్ డౌన్ ముగిసిపోతే ప్రమాదం పోయినట్టేనా?
x
Highlights

ఇప్పుడు దేశ ప్రజలంతా లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనాకు భయపడి ఇళ్లల్లోనే స్వీయ బంధిలుగా ఉంటున్నారు. 21 రోజుల లాక్...

ఇప్పుడు దేశ ప్రజలంతా లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనాకు భయపడి ఇళ్లల్లోనే స్వీయ బంధిలుగా ఉంటున్నారు. 21 రోజుల లాక్ డౌన్ ముగియగానే ఏం చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. 22వ రోజు తమ పనులు ఎలా మొదలు పెట్టాలో ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే అసలు ఎవరెవరు ఏం చేయాలని అనుకుంటున్నారు..? 22వ రోజు తర్వాత దేశ ప్రజల వ్యవహార తీరు ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది..? లాక్‌ డౌన్ తర్వాత ఏం చేయాలి.. ఏం చేయకూడదు..? ముందుచూపు లేకపోతే వచ్చే విపత్తు ఎంత తీవ్రంగా ఉంటుంది..? సెకండ్ వేవ్ వస్తే ఏం జరుగుతుంది..? తెలుసుకుందాం.

21 రోజుల లాక్ డౌన్. దేశమంతా బంద్. రైళ్లు లేవు, బస్సులు లేవు. ప్రజా రవాణా ఆగిపోయింది. రాష్ట్రాల సరిహద్దులు మూసివేశారు. బయటకు రావాలంటేనే ఆంక్షలు. దీంతో ఇళ్లల్లోనే గడుపుతున్న ప్రజలు 22వ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు పండుగ చేసుకుందామనుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ రోజు.. సాయంత్రం ఐదు గంటలకు కొంత మంది జాతీయ జెండాలతో రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు అలానే 22వ రోజు దేశంలోని చాలా మంది ఇళ్ల నుంచి రోడ్లపైకి జాతీయ జెండాలతో రావాలని చూస్తున్నారు. దేశభక్తి గీతాలుప్లే చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వాలనుకుంటున్నారు. తాము కరోనాతో యుద్ధాన్ని గెలిచామనే భావనలో ఉండే అవకాశం కూడా ఉంది. అయితే అక్కడే ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మనం వైరస్‌ను పూర్తిగా నాశనం చేయలేదు కేవలం దాని ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నాం అంతే.

ఇక నగరాల్లోని ఉన్నత వర్గాల వారు 22వ రోజు సినిమా థియేటర్లకు, రెస్టారెంట్లకు, మాల్స్‌కు వెళ్లాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇంట్లోనే విసిగిపోయిన వారు ఆ రోజు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే అక్కడే సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదన్న నిజాన్ని మర్చిపోతున్నారు. ఇక కార్పొరేట్ కార్యాలయాల నుంచి చిన్న, మధ్య తరహా వ్యాపారాల వరకు వేటికవి తమ యాధావిధి సమయాల్లో పనిచేయడం మొదలు పెడతాయి. వీలైతే లాక్ డౌన్ టైంలో కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పనివేళలు పెంచడం, మరింత మంది సిబ్బందితో పనులు చేయించుకోవాలని చూస్తాయి.

ఇక లాక్ డౌన్ వల్ల గ్రామాలకు వెళ్లి పోయిన ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఎంతోకొంత సంపాదించుకుందామని పట్టణాల బాటపడతారు. అందుబాటలో ఉన్న ప్రజారవాణా ద్వారా నగరాలకు రావాలని చూస్తారు. అయితే వీరిలో ఎవరికో ఒకరికి కరోనా ఉండొచ్చు. అది అతడికి కూడా తెలియకపోవచ్చు. ఈ ప్రయాణంలో అతడు మరికొంత మందికి వైరస్ అంటించే అవకాశం కూడా ఉంది. ఒక్క సారిగా ప్రజలు ప్రజారవాణను వినియోగించుకోవడం ద్వారా.. భారీగా వైరస్ వ్యాప్తి చెందే ఛాన్స్ చాలా ఎక్కువ.

మాస్కులు, సానిటైజర్లు పక్కన పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత మరిచిపోయి మనం 21 రోజులు ఇంట్లో ఉన్నాం కదా మనకు ఏమీ కాదనే నిర్లక్ష్యం తగదు. అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు వైరస్ కార్చిచ్చులా దేశాన్నే దహించివేస్తుంది.


లాక్ డౌన్ తర్వాత 22వ రోజు ప్రజలు జాగ్రత్తలు విస్మరిస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి..? ఒక వేళ మనం అన్ని మర్చిపోయి ఎప్పటిలానే ఉంటే మళ్లీ లాక్ డౌన్ తప్పదా..? అసలు 22వ రోజు నుంచి మనం పాటించాల్సిన నియమాలేంటి..? ఒకసారి చూద్దాం.

భారత ప్రజలంతా లాక్ డౌన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. మనం కరోనాను జయించేశామనే భావన ఏ మాత్రం తగదు. ఎందుకుంటే కరోనా ముప్పు.. అప్పుడు కూడా పొంచి ఉంటుంది. 2009లో H1N1 వైరస్ విజృంభించినప్పుడు ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఆ తర్వాత ప్రజలంతా సాధారణ జీవనంలోకి వచ్చేశారు. అయితే అప్పుడే రెండో సారి ఆ వైరస్ విరుచుకుపడింది. 22వ రోజు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే 21 రోజుల లాక్ డౌన్ వ్యర్థమే అంటున్నారు నిపుణులు. ప్రజలకు 22వ రోజు ఏం చేయాలో అవగాహన కల్పించకపోతే మరో లాక్ డౌన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కొన్ని సూచనలు తప్పక పాటించాలి. 22వ రోజు పార్టీలు చేసుకోవద్దు. లాక్ డౌన్ సమయంలో ఎలా నియమాలు పాటించారో వాటినే ఎవరికి వారు కంటిన్యూ చేయాలి.

లాక్ డౌన్ తర్వాత పరిణామాలపై ప్రభుత్వంతో పాటు విద్యావంతులు ప్రజలకు అవగాహన కల్పించాలి. 22వ రోజున ప్రజలు ఏం చేస్తే ప్రమాదమో గుర్తించి వాటిని అరికట్టడానికి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకే సారి కాకుండా వివిధ దశల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలి. వారం తర్వాత వారం ఆంక్షలు తగ్గించాలి. లాక్ డౌన్ పూర్తయ్యింది. 22వ రోజు నుంచి మా పని మేం ఇక చేసుకుంటామంటే కదురదు. ఎందుకంటే వైరస్ ఎక్కడొ ఒక చోట పొంచి ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది వైరస్‌కు అంతం కాదు. అంతానికి ఆరంభం మాత్రమే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories