logo
జాతీయం

Snake Venom: పామే వారికి జీవనోపాధి.. పాము విషం..

Irula Tribe’s Method of Extracting Snake Venom Will Surprise You
X

Snake Venom: పామే వారికి జీవనోపాధి.. పాము విషం..

Highlights

Snake Venom: పాము పేరు చెబితేనే అందరూ పారిపోతారు.

Snake Venom: పాము పేరు చెబితేనే అందరూ పారిపోతారు. కానీ అక్కడ మాత్రం పామే వారికి జీవనోపాధి. పాములతోనే వారికి ఓ నాలుగు రాళ్లు కనిపిస్తాయి. గతంలో పాము విషం కోసం వాటి ప్రాణాలు తీసే గిరిజనులు పర్యావరణ అవగాహన కలగడంతో పాముల్ని సంరక్షిస్తున్నారు. కాసింత మెరుగైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

పాము పేరు చెప్పగానే పరుగులు తీస్తారు ప్రజలు. అయితే మనుషులు గుర్తొచ్చినా పాములు కూడా అంతే భయపడతాయని అనుభవజ్ఞులు చెబాతారు. కాకపోతే ఆ విషయం మనుషులకు తెలియదు. ఇక అసలు విషయానికొస్తే పాము కాటుకు పాము విషమే విరుగుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ విషాన్ని ఎలా సేకరిస్తారు? ఎవరు సేకరిస్తారు? ఎవరికి అమ్ముతారు అన్నది కొంతమందికే తెలుసు. అయితే ప్రభుత్వాలే పాముల నుంచి విషాన్ని అధికారికంగా సేకరించడం మళ్లీ పాములకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వాటిని సంరక్షించడం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతినిస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉండే ఇరులా తెగ గిరిజనులు పాముల్ని పట్టడంలో సిద్ధహస్తులు. ఈ జాతిలో పుట్టిన ప్రతిఒక్కరూ పాములను ఎంతో తేలిగ్గా లొంగదీసుకుంటారు. అయితే ఆ అలవాటే వారికి జీవనోపాధిగా కూడా మారింది. వాళ్లు ఎంత నిపుణులు అంటే చేతికి కనీసం గ్లోవ్స్ కూడా లేకుండానే పాముల్ని పట్టేస్తారు. వాటి నుంచి విషాన్ని కక్కిస్తారు. ఇరులా తెగ మనిషి ఓ విషనాగును ఎంతో ఒడుపుగా పట్టుకుని ఉత్త చేతులతోనే దాని తలను చిక్కించుకొని ఓ గ్లాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. గ్లాస్ ను శత్రువుగా భావించిన పాము దాన్ని కాటేస్తుంది. అప్పుడా విషం గ్లాసుపాత్రలోకి జారిపోతుంది. ఒకసారి పాము నుంచి విషం తీశాక పాము దిగువ భాగంలో ఓ ముద్ర వేస్తారు. దాన్నుంచి విషం తీసిన రోజు ఆ ముద్రలో కనిపిస్తుంది. దాన్నుంచి మళ్లీ విషం ఎప్పుడు తీయాలో దాని ద్వారా తెలుస్తుంది.

పాముల నుంచి విషం తీశాక వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుండల్లో సురక్షితం చేస్తారు. వాటికి ఆహారం అందించడం ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ విషం తీయడం ఇలా ఓ పద్ధతి ప్రకారం పాములకు హాని జరగకుండా ఇరులా తెగ ప్రజలు నిర్వహిస్తున్నారు.

నాగుపాము, కోడెనాగు, రక్తపింజర, కట్లపాము వంటి వివిధ రకాల జాతుల్లో అత్యంత విలువైన, శక్తిమంతమైన విషం ఉంటుంది. ఆ పాములు గనక కరిస్తే కొన్ని నిమిషాల్లోనే మనిషి నరాల్లోకి పాకిపోయి శరీరం రంగు మార్చేసి నిర్జీవితుణ్ని చేసింది. అది నాణేనికి ఒక కోణం మాత్రమే. అలాంటి పాములు కరిచినప్పుడు దానికి విరుగుడు కూడా అంతే వేగంగా అందితే మనిషి బతుకుతాడు. ఆ విరుగుడు మందు కూడా పాము విషం నుంచే తయారవడం విశేషం. ఇక భారత్ లో గ్రామీణ ప్రాంతలే అధికం. గ్రామాల్లో పొలానికి వెళ్లే రైతులు, కూలీల నుంచి సామాన్య ప్రజల వరకు ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సంచరిస్తుంటారు. అందువల్ల గ్రామాల్లోని చాలామంది పాముకాటుకు గురవుతూ చనిపోతున్నారు. పాముకాటు నుంచి రక్షించే ఇంజక్షన్లు గ్రామాల్లో కాకుండా చాలాదూరంగా ఉండే పట్టణాల్లోనే లభ్యమవుతున్నాయి. యాంటీ పాయిజన్ ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తమిళనాడు సర్కారు ఓ వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇరులా గిరిజన తెగ ప్రజలు ఉంటారు. వీరిలో ఆదివాసీ ఇరులా, మైదాన ప్రాంత ఇరులా అనే రెండు వర్గాలవారున్నారు. ఆదివాసీ ఇరులా తెగ నీలగిరి జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో నివసిస్తుంది. ఒక్క నీలగిరిలో మాత్రమే గాక కోయంబత్తూర్ జిల్లా అటు కర్నాటక, కేరళ ప్రాంతాల్లోనూ వీరు కనిపిస్తారు. వీరి జీవనోపాధి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆహారం కోసం అందుబాటులో ఉండే ఎలుకల మీద ఎక్కువగా ఆధారపడతారు. ఇక ఎలుకల్ని వేటాడే పాముల నుంచి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇందుకోసం ఇరులా తెగ ప్రజలు ఎప్పట్నుంచో నాటు పద్ధతిలో పాములు పట్టడం చేస్తున్నారు. ఆ పాముల నుంచి విషాన్ని సేకరించి తమిళనాడులోని ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పాముల విషం సేకరించేటప్పుడు వారు మొరటుగా వ్యవహరిస్తుండడంతో పాములు అర్ధంతరంగా చనిపోయేవి. కాసింత విషం కోసం పాముల్ని దారుణంగా చంపేసేవాళ్లు. ఇది పర్యావరణ కోణంలో ఇబ్బందులకు కారణమైంది. భూమ్మీద అన్ని ప్రాణులూ సమపాళ్లలో ఉన్నప్పుడే ప్రాణికోటి జీవచక్రం సాఫీగా జరుగుతుంది కదా. విషం కోసం పాముల ప్రాణాలు తీయడాన్ని కాస్త ఆలస్యంగానైనా పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు గ్రహించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విషం కోసం విచక్షణ లేకుండా పాముల ప్రాణాలు తీయడాన్ని అరికట్టాలంటూ విజ్ఞప్తులు చేశారు.

దాన్ని పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు సర్కారు ఇరులా తెగవారితో అధికారికంగా ఒక ఒప్పందం చేసుకుంది. ఇరులా తెగ ప్రజలే విషాన్ని సేకరించి ఫార్మా కంపెనీలకు అమ్మేలా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాముల్ని పట్టేవాళ్లంతా ఒక సోసైటీగా తయారై చాలా ప్రొఫెషనల్ గా విషాన్ని సేకరిస్తూ ఫార్మా కంపెనీలకు ఎగుమతి చేస్తున్నారు. 1978లో ఏర్పాటైన ఇరులా స్నేక్ క్యాచర్స్ సొసైటీలో ఇప్పుడు 300 మంది ఉన్నారు. వీరు పాముల్ని సంరక్షించడం, వాటి నుంచి విషాన్ని సేకరించడం సొసైటీ ద్వారా ఉపాధి పొందడం చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలగకుండా ఇరులా తెగ ప్రజలు ఎంతో పరిపక్వతతో పాముల విషంతో ఉపాధి పొందుతున్నారని అటవీ విభాగానికి చెందిన ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ట్వీట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఆ విషయం వైరల్ అవుతోంది.


Web TitleIrula Tribe’s Method of Extracting Snake Venom Will Surprise You
Next Story