Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Involvement of four MLAs from Telangana in Drugs Issue
x

Representational Image

Highlights

Drugs Case: రాజకీయ నేతలకు డ్రగ్స్ రాకెట్‌తో లింకులు * తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల ప్రమేయం

Drugs Case: బెంగుళూరు డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.తెలంగాణకు చెందిన పలువురు ఎంఎల్ ఏ లతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు ఈ కేసుతో సంబంధాలున్నట్లు వార్తలు రావటం..దానికి సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు రావటంతో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ కేసులో బెంగుళూరు పోలీసులు ఎలా వ్యవహరించబోతున్నారు..? కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ కు చెందిన శాసనసభ్యులకు,సినీ ప్రముఖులకు బెంగుళూరు సీసీబి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారిస్తారా..? అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది..?

మరోసారి తెలుగురాష్ట్రాల్లో డ్రగ్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. బెంగళూరు కేసులో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది. అయితే ఈసారి ఈ వ్యవహారంలో సినిమావాళ్లే కాదు రాజకీయ నేతలు కూడా చిక్కుకున్నారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్ కాపీ బయటకు రాగా.. కొందరు ఎమ్మెల్యేలకే డ్రగ్స్‌ కేసులో సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డ్రగ్స్ కేస్ హాట్‌టాపిక్‌గా మారింది.

డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నైజీరియన్లు సంచలన విషయాలు బయటపెట్టారు. డ్రగ్స్ రాకెట్‌లో సినీ ప్రముఖులు ,వ్యాపార వేత్తలే కాకుండా ఓ నలుగురు శాసనసభ్యులకు సంబంధాలున్నట్లు బెంగుళూరు సీసీబి పోలీసులు గుర్తించారు. ఒక నటుడితో పాటు వ్యాపారవేత్త సందీప్‌రెడ్డిని విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. వారిచ్చిన సమాచారంతో ఈవెంట్‌ మేనేజర్‌ కలహర్‌ రెడ్డి, పారిశ్రామికవేత్త రతన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే వారింకా హాజరు కాలేదు.

ఇక పొలిటికల్‌ హ్యాండ్‌ విషయానికొస్తే.. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన దగ్గర డ్రగ్స్ తీసుకెళ్లేవారని సందీప్‌రెడ్డి వెల్లడించాడు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరి పేరును మాత్రమే చెప్పటంతో ఎఫ్ఐఆర్‌లో అతడి పేరు ప్రస్తావన ఉంది. అయితే సందీప్ రెడ్డి వెల్లడించిన ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఎమ్మె్ల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో ఇద్దరు నిజామాబాద్, ఒకరు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన వారుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ కు చెందిన ఒ ఎమ్మేల్యే సొదరుడి పాత్రకూడా ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారిలో గుబులు మొదలైంది.

డ్రగ్స్‌ కేసులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలపై బిజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు తీవ్రంగా స్పందించారు. గతంలో డ్రగ్స్‌ కేసు మాదిరి నీరు గార్చకుండా బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ కేసులో విచారణ ముమ్మరం చేశారు బెంగళూరు పోలీసులు. ఓ నిర్మాత ఇచ్చిన పార్టీలో పాల్గొన్న వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు విచారణలో వెల్లడైన వారికి డ్రగ్ రాకెట్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి మస్తాన్ చంద్ర పోలీసులకు అప్రూవర్‌గా మారాడు. ఇప్పటికే అతను అనేకమంది పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ జాబితా ఆధారంగానే ఈ పార్టీలకు హాజరైన ప్రముఖుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని అంచనాకు వచ్చారు పోలీసులు. ఓ కన్నడ నటుడి హోటళ్లో జరిగిన పార్టీలోనే వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడి కాగా ఫుటేజీని సేకరించారు పోలీసులు. పార్టీకి హాజరైన ప్రజాప్రతినిధులు అక్కడ దిగిన ఫోటోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ను సేకరించి పక్కా సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు.

కేసు విచారణకు సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయని విచారణ వేగంగా సాగుతుందని పక్కా ఆధారాలతో ఈ కేసులో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇదిలాఉంటే.. పోలీసులు నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల కాపీలతో పాటు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలు కూడా సోమవారం బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక నగరానికి చెందిన ఎమ్మెల్సీకి డ్రగ్స్‌ కేసులో సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను విచారించినప్పుడు రతన్ రెడ్డి అలియాస్ రతన్ పేరు వెలుగు లోకి వచ్చింది.

మరోవైపు బెంగుళూరు డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఫోకస్ చేసిన హైదరాబాద్ పోలీసులు బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. బెంగుళూరు సీసీబి పోలీసులకు నిందితులు వెల్లడించిన పేర్లలో తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు రావటంతో ఆ వ్యక్తులకు ఈ రాకెట్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

మొత్తానికి గతంలో తెలుగురాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు కంటే ఈ కేసు మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇందులో రాజకీయనేతల ప్రమేయమే ఇందుకు కారణం. మరి వీరికి నోటీసులిస్తారా? బెంగళూరు పోలీసుల నెక్ట్స్‌ స్టెప్ ఏంటనేది చర్చనీయంగా మారింది. మరోవైపు ఈ ఎపిసోడ్ ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ఆగుతుందా? ఇంకా ఎవరికైనా ఈ కేసుతో లింకులున్నాయా? అనే చర్చ సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories