India Population: జనాభాలో చైనాను అధిగమించిన భారత్‌.. ప్రపంచ జనాభాలో మనమే నంబర్‌ 1

India Has Overtaken China In Population
x

India Population: జనాభాలో చైనాను అధిగమించిన భారత్‌.. ప్రపంచ జనాభాలో మనమే నంబర్‌ 1

Highlights

India Population: వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకటన

India Population: జనాభాలో చైనాను భారత్‌ అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ అవతరించినట్టు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకటించింది. 2022 చివరి నాటికి భారత జనాభా 141 కోట్ల 7లక్షలు కాగా 2023 జనవరి 18 నాటికి ఈ సంఖ్య 142 కోట్ల 3 లక్షలకు చేరుకున్నట్టు తెలిపింది. మాక్రోట్రెండ్స్‌ అనే సంస్థ కూడా మన దేశ జనాభా 142 కోట్ల 8 లక్షలకు చేరువైందని అంచనా వేసింది. గత 60 ఏళ్లలో తొలిసారిగా చైనా జనాభా తగ్గినట్టు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం చైనా జనాభా 141కోట్ల2 లక్షలని ఆ దేశం ప్రకటించింది. చైనా జనాభాను భారత్‌ 2023 చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్య రాజ్యసమితి ఇదివరకు అంచనా వేసినప్పటికీ ఈ రికార్డును భారత్‌ ఇప్పటికే అధిగమించినట్టు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెల్లడించింది.

ఇండియా జనాభా పెరుగుదల నెమ్మదించినా కూడా 2050 వరకు పెరుగుతూనే ఉంటుందని, అప్పటికి దేశ జనాభా 167 కోట్లకు చేరుకుంటుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ సంస్థ అంచనా వేసింది. కాగా, ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే మన దేశంలో 2021లో కొవిడ్‌ కారణంగా జనగణన జరగలేదు. 2022 నుంచి 2050 వరకు పెరగనున్న ప్రపంచ జనాభాలో సగం భారత్‌ సహా మరో ఏడు దేశాల నుంచే ఉంటుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది.

మన దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్‌ అని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి నుంచి దేశం దూరమవుతున్నందున, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాల్సి ఉందని సూచిస్తున్నారు. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ల లోపు వారేనని, ప్రతి యేటా లక్షల సంఖ్యలో యువత శ్రామికశక్తిగా మారుతుందని, వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories