India Pollution: కాలుష్యం ముప్పు.. అత్యంత కాలుష్యం కలిగిన దేశాల్లో టాప్3లో భారత్

India 3rd Place In The Most Polluted Countries
x

కాలుష్యం ముప్పు.. అత్యంత కాలుష్యం కలిగిన దేశాల్లో టాప్3లో భారత్

Highlights

భారత్‌లో కాలుష్యం ఊహించని రీతిలో పెరిగిపోతుంది. దేశమంతా కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3లో నిలవడమే ఇందుకు నిదర్శనం.

India Pollution: ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తోంది. మానవ మనుగడతో పాటు జీవకోటి మనుగడలో కీలకపాత్రను పోషించిన సహజ వనరులు అన్నీ కలుషితమై జీవ మనుగడకు విఘాతంగా మారిపోతున్నాయి. గాలి, నీరు, ఆహారం పెద్ద ఎత్తున కలుషితమై పోతున్నాయి. నదులన్నీ కలుషిత వ్యర్థాలను మోసుకుపోయే మురికి కాలువలుగా మారిపోతున్నాయి. ఇక అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్3లో నిలిచింది.

భారత్‌లో కాలుష్యం ఊహించని రీతిలో పెరిగిపోతుంది. దేశమంతా కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3లో నిలవడమే ఇందుకు నిదర్శనం. రియల్ టైమ్ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024లో కాలుష్య దేశాల జాబితాను విడుదల చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

2024లో 140 AQIతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. 115 AQIతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. 111 గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో ఉంది. టాప్10లో 103తో బహ్రెయిన్, 100తో నేపాల్, 92తో ఈజిప్ట్, 90తో UAE, 89తో కువైట్, తజకిస్థాన్, 87తో కిర్గిస్థాన్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ఏకైక ఆసియేతర దేశంగా ఈజిప్టు ఈ జాబితాలో చేరింది.

సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణించబడుతాయి. అయితే AQI విడుదల చేసిన లిస్ట్ లో టాప్ 50 కాలుష్య నగరాల్లో ఎక్కువ భాగం ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. అందులో దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఉంది. 169 AQIతో ఢిల్లీ కాలుష్యంలో ముందంజలో ఉంది. వాహనాలు, పారిశ్రామిక కార్యకలాపాలతో ఢిల్లీలో తీవ్రమైన పొల్యూషన్ ఏర్పడుతుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఢిల్లీ తర్వాత స్థానంలో 166 గాలి నాణ్యతతో గ్రేటర్ నోయిడా, 161 AQIతో నోయిడా, 159తో ఘాజియాబాద్, 154 AQIతో ఫరియాబాద్, గురుగ్రామ్, బివాండీ 153, పాట్నా, సోనిపట్ 145, ముజఫర్ నగర్ 144 AQI అత్యంత కలుషితమయంగా మారాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 140 గాలి నాణ్యతతో 13 స్థానంలో నిలిచింది. AQI డేటా ప్రకారం భారత్‌లోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితంగా ఉన్నా రియల్ టైం డేటాలో మాత్రం దక్కన్ పీఠభూమి దిగువ ప్రాంతాలు టాప్‌లో ఉంటున్నాయి.

2023తో పోల్చితే దేశ వాయు నాణ్యతలో ఎలాంటి పురోగతి లేకపోవడం మరింత ఆందోళనకరం. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని నగరాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. మరోవైపు కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రతియేటా రికార్డులు బద్దలు కొడుతోంది. 2024 నవంబర్‌లో 795 ఏక్యూఐతో నాలుగేళ్లల్లో అత్యంత దారుణ పరిస్థితులను చూసింది ఢిల్లీ. సగటున 169 ఏక్యూఐతో దేశంతో పాటు ప్రపంచంలోనే కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్న నగరంగా నిలిచింది. నవంబర్ నుంచి జనవరి వరకు పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. 43 రోజులు ప్రమాదకర కాలుష్యం కేటగిరీల్లోకి వెళ్లాయి. వాహనాలు నుంచి వచ్చే కాలుష్యం, నిర్మాణాలు, పంట వ్యర్థాలు దహనం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వంటివి దేశ రాజధానిలో ఈ పరిస్థితులకు కారణమని నివేదిక పేర్కొంది.

ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. కాలుష్యం నియంత్రణ కోసం భారత ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లేదంటే కాలుష్యం కారణంగా భారత్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories