
Union Budget 2025: బడ్జెట్ 2025 ఎఫెక్ట్ ఎలా ఉంటుంది?
Impacts of Budget 2025 on middle class: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టారు. 12 లక్షల వార్షిక...
Impacts of Budget 2025 on middle class: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టారు. 12 లక్షల వార్షిక ఆదాయానికి నో ట్యాక్స్ అంటూ గుడ్ న్యూస్ ప్రకటించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ప్రజల సంపద పెంచే బడ్జెట్ ఇది అని అధికార బీజేపీ చెబుతోంది. ఈ బడ్జెట్ పట్టాలు తప్పిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
కేంద్ర బడ్జెట్ ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పన్నుల వాత ఎవరిపై పడింది? మధ్య తరగతిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది? తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఎలా ఉందో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
రూ. 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ తొలిసారి 50 లక్షల కోట్లు దాటింది. 2025-26 లో 50,65,345 కోట్లతో బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టింది. రెవిన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, అప్పులు, ఇతర వసూళ్లు 15,68,936 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీడీపీలో ఆర్ధికలోటు 4.8శాతం. 2025-26 లో ద్రవ్యలోటు 4.4 శాతం ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. రక్షణ రంగానికి 4.91 లక్షల కోట్లు, వ్యవసాయానికి 1.7 1లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. విద్యకు 1.28 లక్షల కోట్లు కేటాయిస్తే, వైద్యానికి 98,311 కోట్లు కేటాయించారు.
నిర్మలా సీతారామన్ రికార్డ్
నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వరుసగా ఇలా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన చరిత్ర ఇప్పటివరకు లేదు. 2019లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్ లో ఆమె మరోసారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ఫిబ్రవరి 1, 2025న ప్రవేశ పెట్టారు.
మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ లను ప్రవేశ పెట్టారు.1959 నుంచి 1964 వరకు ఆరు బడ్జెట్ లను ఆయన ప్రవేశ పెట్టారు. 1967 నుంచి 1969 వరకు మరో నాలుగు బడ్జెట్ లను ఆయన ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం తొమ్మిది బడ్జెట్ లు ప్రవేశ పెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్ లు ప్రవేశ పెట్టారు.
2020లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ గా రికార్డుల్లోకెక్కింది.అప్పట్లో ఆమె రెండు గంటల 40 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు.ఫిబ్రవరి 1, 2025 న 86 నిమిషాల్లో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు.
అతి తక్కువ సమయం బడ్జెట్ స్పీచ్ గా 1977 లో నమోదైంది. అప్పటి ఆర్ధిక మంత్రి హీరూబాయ్ ముఖర్జీ పాటిల్ ప్రసంగం 800 పదాలు మాత్రమే.
ప్రజల కొనుగోళ్లు పెంచేందుకు
రానున్న రోజుల్లో మధ్య తరగతి ప్రజల కొనుగోళ్లు శక్తిని పెంచే ఉద్దేశ్యంతో 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయానికి ట్యాక్స్ ఎత్తేశారు. దీంతో పాటు ఆర్ధిక అవసరాల కోసం ప్రైవేట్ పెట్టుబడులను పెంచేందుకు కూడా బడ్జెట్ లో ఫోకస్ చేశారు. యువత, రైతులు, మహిళల కోసం పథకాలను ప్రకటించారు. దేశంలో 8 శాతం గ్రోత్ రేట్ సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైనప్పుడే దేశంలోని యువతకు అవసరమైన ఉపాధిని కల్పించే అవకాశం ఉంది. 2024 జులై తర్వాత బడ్జెట్ లో ఉద్యోగాల కల్పనతో పాటు వ్యక్తులపై ఆర్ధిక భారాన్ని తగ్గించే పన్ను ప్రతిపాదనలు చేశారు.
ఎలక్ట్రానిక్స్ తయారీలో మేకిన్ ఇండియాను ప్రోత్సహించనున్నారు. ప్లాట్ ప్యానెల్ డిస్ ప్లే లపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది. తోలు, హస్తకళ ,రైల్వేలు, విమానాల నిర్వహణ, మరమ్మత్తు సేవలను ప్రోత్సహించనున్నట్టు బడ్జెట్ లో సంకేతాలు ఇచ్చారు. MSME లను ప్రోత్సహిస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. గిగ్ వర్కర్లకు భీమా కల్పించనున్నట్టు తెలిపింది.
తక్కువ ఉత్పత్తి వచ్చే 100 జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎం ధన ధాన్య కృషి యోజన పథకం కేంద్రం తెచ్చింది. దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తెచ్చారు. అధిక ఉత్పత్తి చేసే వంగడాల తయారీకి ప్రత్యేక జాతీయ మిషన్ ను కేంద్రం ప్రకటించింది. క్యాన్సర్ సహా ప్రాణాంతక జబ్బులకు సంబంధించి 36 రకాల మందులపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేసింది. దీంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్ కు సంబంధించిన పరికరాల ధరలు దిగి రానున్నాయి.
రూ. 12 లక్షల వరకు నో ఇన్‌కమ్ ట్యాక్స్ వెనుక...
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండు మూడేళ్లుగా ఆదాయ పన్ను పరిమితిని పెంచాలనే డిమాండ్ ఉంది. కానీ, మోదీ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనిపై ఆర్ధిక మంత్రి సీతారామన్ ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొన్నారు. దేశంలో 43.2 కోట్ల మంది మధ్య తరగతి జనాభా ఉంటారని ప్రైస్ సంస్థ 2022లో విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది.
20246 నాటికి ఈ జనాభా 100 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. వేతన జీవులకు ఊరట కలిగించాలనే డిమాండ్ ను విపక్షాలు కూడా లేవనెత్తుతున్నాయి. 12 లక్షల వరకు ట్యాక్స్ ఎత్తివేయడంతో ఒక్కొక్కరు అత్యధికంగా 80 వేలు లబ్ది పొందొచ్చు. ట్యాక్స్ ఎత్తివేతతో వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగులు పెట్టుబడులపై మళ్లించే అవకాశం ఉంది. ఇలా
ఆర్ధిక వ్యవస్థలోకి లక్షల కోట్లు వెళ్తాయి. ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా పన్నుల రూపంలో పరోక్షంగా ఆదాయం రానుంది. ఈ నిర్ణయం ఆటోమొబైల్, రియల్ ఏస్టేట్ రంగాలకు మేలు చేకూర్చనుంది. మరో వైపు వచ్చే వారంలో ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఫైనాన్స్ బిల్లులో మార్పులు చేర్పులతో ఈ బిల్లును రూపొందించనున్నారు.
పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం 30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157.53 కోట్లుగా తెలిపింది. 2025-26 బడ్జెట్ లో రూ. 5,936 కోట్లు
కేటాయించింది.విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3,295 కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించింది. దీనికి తోడు ఇతర పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ లో కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు రూ. 15 వేల కోట్లు కేటాయించారు.మోదీ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక భాగస్వామి. దీంతో ఏపీలో కీలక ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయిస్తోంది. ఈ బడ్జెట్ లో మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
తెలంగాణలో కేటాయింపులపై
తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రెండో ఫేస్ వంటి ప్రాజెక్టులకు రూ.1,632 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధుల విషయంలో బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు. అయితే ఇతర ప్రాజెక్టులు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ , రోడ్లు వంతెనల నిర్మాణం వంటి పథకాలకు కేంద్రం నిధులు కేటాయించింది. బడ్జెట్ లో తెలంగాణకు సరిగా కేటాయింపులు లేవని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. బడ్జెట్ లో తెలంగాణకు సున్నా ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్.. బీహార్ కు వరాలు
కేంద్రంలో మోదీ ప్రభుత్వం టీడీపీ,జేడీయూ సహకారంతో ఏర్పడింది. ఈ రెండు పార్టీలు ఎన్ డీ ఏలో భాగం. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సెంటర్, మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మిథిలాంచల్ లో 50 వేల హెక్టార్లకు ప్రయోజనం కలిగించే కోసి కెనాల్ కు ఆర్ధిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.
నిర్మలకు మోదీ కితాబు
ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. ప్రజల జేబులు నింపేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు బడ్జెట్ చాలా బాగుందని అందరూ అంటున్నారని నిర్మలా సీతారామన్ ను మోదీ అభినందించారు. మరో వైపు ఈ బడ్జెట్ పట్టాలు తప్పిందని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్ ఆరోపించారు.
ప్రజల కొనుగోలు శక్తి పెంచే దిశగా కేంద్రం బడ్జెట్ పై ఫోకస్ చేసింది. ఈ బడ్జెట్ తో తమకు అంతగా ప్రయోజనం లేదనే కార్పోరేట్ వర్గాలు భావనతో ఉన్నాయి. బడ్జెట్ తర్వాత మార్కెట్లు కుప్పకూలాయి. గతకొంత కాలంగా ప్రజలకు ఉన్న డిమాండ్లను ఈ బడ్జెట్ లో ప్రతిబింబించేలా కేంద్రం ప్రయత్నించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




