గేదె, ఆవును ఢీ కొంటే రైలుకు డ్యామెజ్ అవుతుందా.. వందే భారత్ రైలు అంత సున్నితమా..?

గేదె, ఆవును ఢీ కొంటే రైలుకు డ్యామెజ్ అవుతుందా.. వందే భారత్ రైలు అంత సున్నితమా..?
Vande Bharat Express: వందే భారత్ ట్రైన్.. దేశ రైల్వే వ్యవస్థను స్పీడప్ చేస్తూ.. పట్టాలెక్కిన రైలు.
Vande Bharat Express: వందే భారత్ ట్రైన్.. దేశ రైల్వే వ్యవస్థను స్పీడప్ చేస్తూ.. పట్టాలెక్కిన రైలు. సుదూర ప్రాంతాలను తక్కువకాలంలో చేరే విధంగా పట్టాలపై పరుగులు పెట్టేందుకు తీసుకొచ్చిన వందే భారత్ ట్రైన్లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. చిన్న ప్రమాదాలకే పెద్ద ఎత్తున ధ్వంసానికి గురవుతున్నాయి. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైళ్లు ఇలా ప్రమాదాలకు గురికావడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ ప్రమాదాలతో వందే భారత్ రైళ్ల పనితీరు తేలిపోయినట్టేనా..? అసలు లోపం ఎక్కుడుంది..? భవిష్యత్తులో వస్తాయంటున్న రైళ్లు పట్టాలెక్కుతాయా..? ఈ రైళ్ల గురించి ప్రస్తుతం ప్రయాణీకులు ఏమనుకుంటున్నారు..?
దేశంలో దూర ప్రయాణాల కోసం సాధారణ పౌరులకు అవకాశంగా ఉన్న ఏకైక ప్రజారవాణ వ్యవస్థ రైల్వేలు. దేశంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. నిత్యం కోట్లాది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే రైల్వేవ్యవస్థలో ప్రభుత్వం చాలాకాలంగా సంస్కరణలు తీసుకొస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక మేకిన్ ఇండియాలో భాగంగా రైల్వేలో భారీ సంస్కరణలు చేపట్టింది. అందులో ముఖ్యంగా సమయపాలనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిర్ణీత సమయానికి రైలు గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేకిన్ ఇండియాలో భాగంగా పట్టాలెక్కినవే వందే భారత్ రైళ్లు. సెమీ హై స్పీడ్ రైళ్లుగా వీటిని పిలుస్తారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినవే ఈ వందే భారత్ రైళ్లు. 2019 లో మొదటిసారిగా వందే భారత్ రైలు పట్టాలెక్కగా గత నెల 30 న గుజరాత్‌లో ప్రధాని మోడీ మూడో వందే భారత్ రైలును ప్రారంభించడంతో మొత్తం మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. న్యూ ఢిల్లీ వారణాసి, న్యూ ఢిల్లీ మాతా వైష్ణోదేవీ కాట్రా, ముంబై గాంధీనగర్ మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రైళ్లు ప్రతిపక్షాల విమర్శలకు ఆయుధాలుగా మారిపోయాయి. మొన్నటి గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు ట్రైన్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. గేదేలు, ఆవులు ఢీ కొట్టడంతో రెండు రైళ్లు ఆగిపోగా మరొకటి మాత్రం సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. దీంతో వందే భారత్ రైళ్ల పనితీరుపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. కేవలం గేదెలను ఢీ కొంటే రైలుకు డ్యామెజ్ అవుతుందా అనేదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మరీ అంత సున్నితమా..?
వాస్తవానికి వందే భారత్ రైళ్ల పనితీరును చాలాకాలంగా పరిశీలిస్తోంది రైల్వేశాఖ. 2019 నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత అప్‌గ్రేడ్‌తో మూడో రైలును పట్టాలెక్కించారు. వాస్తవానికి ఈ రైళ్లను తీసుకొచ్చిన ఉద్దేశ్యమే ప్రయాణీకులను వేగంగా గమ్యస్థానానికి చేర్చేందుకు. ఇది గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ రైలు ప్రత్యేకత. దీంతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కానీ, ఇతర రైళ్ల కంటే వందే భారత్ రైలు ద్వారా ప్రయాణ సమయం 25 నుంచి 45 శాతం వరకు తగ్గనుంది.
వేగం తర్వాత ఈ రైలులో ప్రత్యేకంగా ఆటోమేటెడ్ డోర్స్ ఉంటాయి. మెట్రో మాదిరిగానే పనిచేస్తాయి. అలాగే జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఫై హాట్‌స్పాట్ ను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణంలో పూర్తిగా ఇంటర్నెట్‌తో అనుసంధానం అయి ఉండవచ్చు. ఇక ఈ ట్రైన్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఉంటాయి. బయో వ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్ ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్ ఉంటాయి. సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లిపీలో కూడా లెటర్స్ ఉంటాయి. ప్రతీ క్యాబిన్‌లో వై-ఫై ఫెసిలిటీతో 32 అంగుళాల ఎల్‌సీడీ టీవీ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం క్యాటలిటిక్ యూవీ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను అమర్చారు. స్వచ్ఛమైన గాలి అందించడం కోసం సరికొత్త డిజైన్‌తో ట్రైన్ రూఫ్‌ను నిర్మించారు. సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి.
ఇక్ ప్రయాణీకులకు అందించే ఫుడ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు కలిగిన ఆహార పదార్థాలతో మెనూను ప్రిపేర్ చేసింది. తృణధాన్యాలు, ఓట్స్ వంటి పోషకహార పదార్థాలను అందజేస్తోంది. ప్రీమియం కోచ్‌ల్లో పిల్లల కోసం మాల్ట్ డ్రింక్స్ తీసుకొచ్చారు. బి వోకల్, గో లోకల్ ఐడియాలజీతో ఫుడ్ అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 థీమ్‌కు అనుగుణంగా ఆహార పదార్థాల మెనూ సిద్ధం చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఈ సెమీ హైస్పీడ్ రైలు అత్యాధునిక ప్రమాణాలతో మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి అనుసంధానించారు. మొత్తం 16 ఏయిర్ కండీషన్డ్ బోగీలు ఉంటాయి. అందులో రెండు ఎగ్జిక్యూటీవ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 11 వందలకు పైగా ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. తక్కువ స్టాప్‌లు అందులో మేజర్ స్టాప్‌లోనే ట్రైన్ ఆగుతుంది. 2024 లో స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మొత్తం 75 వందే భారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను అనుసంధానం చేసేలా ఈ రైళ్లను నడపాలని నిర్ణయించారు. అయితే అంతా బాగానే ఉన్నా వరుస ప్రమాదాలతో వందే భారత్ రైలు యొక్క భద్రతపై విమర్శలు వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు మూడు ప్రమాదాలు సంభవించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ గురువారం.. అంటే ఈ నెల 6 వ తేదీన ముంబయి, గాంధీనగర్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్ సమీపంలోని వాట్వా రైల్వేస్టేషను దగ్గర గేదెల గుంపు అడ్డురావడంతో లోకో పైలట్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు మరణించగా ప్రయాణికులకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆ తర్వాత శుక్రవారం అంటే ఈ నెల 7 న మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబయికి బయలుదేరిన అదే రైలు వంద కిలోమీటర్ల దూరంలోని ఆనంద్ స్టేషను సమీపంలో ఓ ఆవును ఢీకొంది. మళ్లీ రైలు ముందుభాగం మరోసారి నొక్కుకుపోయింది. దీంతో రైలు పది నిమిషాలు ఆగిపోయింది. ఇక ఆ తర్వాతి రోజున న్యూ ఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన మరో వందే భారత్ రైలులో ట్రాక్షన్ మోటార్ జామ్ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్ సమీపంలో దన్‌కౌర్, వేర్ స్టేషన్ల మధ్య రైలు సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్ మోటార్‌లో బేరింగ్ పనిచేయలేదు. గ్రౌండ్ స్టాఫ్ ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైల్లోనే ఉన్న సాంకేతిక సిబ్బంది తనిఖీ చేశారు. దగ్గర్లో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆపారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం రాలేదు. దీంతో ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చినట్లు రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
వరుసగా మూడు రోజుల్లో మూడు ఘటనలు జరగడంతో వందే భారత్ రైళ్లపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అయితే ఈ రైళ్లు పట్టాలెక్కకముందే చాలాసార్లు ట్రయల్స్ నిర్వహించారు. పట్టాల సామర్థ్యం, ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నారు. కానీ ప్రమాదాలు చోటు చేసుకోవడం అందునా పశువులు ఢీ కొంటే రైలు ముందు భాగం దెబ్బతినడంపై రైల్వేశాఖ కూడా వివరణ ఇస్తోంది. రైలు ముందు భాగం కావాలనే సున్నితంగా ఉండేలా తయారుచేశామని ఏదైనా ప్రమాదం జరిగితే ఎదుటివారికి భారీ ప్రమాదం సంభవించకుండా ఉండేందుకే ఆ విధమైన ఏర్పాటు చేసినట్లు ఇండియన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



