ఐదు రాష్ట్రాల్లో నిప్పులు కురిపిస్తున్న భానుడు...

Heat Wave Warning For 5 States
x

ఐదు రాష్ట్రాల్లో నిప్పులు కురిపిస్తున్న భానుడు...

Highlights

Heat Wave: ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ప్రజలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

Heat Wave: ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ప్రజలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఐదు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోవు ఐదు రోజుల్లో మరో రెండు డిగ్రీలు పెరిగి.. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాజస్థాన్‌, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ఒడిశాలో వచ్చే వారం మరింత వేడిమి పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌, యూపీలో ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.

ఢిల్లీలోనూ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఇవాళ గరిష్ఘంగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు విలవిలలాడారు. నగరంలో మరికొన్ని చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకారు. పలువురు వేడిమి నుంచి కాపాడుకోవడానికి గొడుగులతో కనిపించారు. మరోవైపు వృద్ధులు, చిన్నారులు వడగాల్పులకు తీవ్ర అవస్థలు పడ్డారు. రెండ్రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాజధాని వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలను విద్యుత్‌ కొరత వేధిస్తోంది. ఇప్పటికే ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి.. 20వేల లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రెండ్రోజుల్లో బొగ్గు కొరత ఏర్పడనున్నదని వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్‌లో నాలుగు గంటల పాటు విద్యుత్‌ కోత విధించారు. రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతంలోని పల్లెల్లో విద్యుత్‌ కోతల ప్రజలు విలవిలలాడుతున్నారు. గుజరాత్‌, ఏపీలోనూ విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లోనూ ఎండలు మండుతున్నాయి. శీతాకాల రాజధాని జమ్ములో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇక్కడ కూడా విద్యుత్‌ కొరత నెలకొంది.

ఇక ఒడిశాను మూడ్రోజులుగా ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా భవనేశ్వర్‌లో 40 డిగ్రీల టెంపరేచర్‌ నమోదయ్యింది. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వం ఈనెల 30 నుంచి విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. ఒడిశా పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ భానుడి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఇక్కడ కూడా మే 2 నుంచి విద్యాసంస్థలకు మమతా బెనర్జీ ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. ఇక 122 ఏళ్ల తరువాత దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో 2004 తరువాత 30 డిగ్రీలకు మించిన ఈ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పైనే పలు రాష్ట్రాల్లో నమోదవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories