గాంధీ కుటుంబం ప్రచారానికి రానందుకే మెరుగైన సీట్లు వచ్చాయా?

గాంధీ కుటుంబం ప్రచారానికి రానందుకే మెరుగైన సీట్లు వచ్చాయా?
x
Highlights

మోడీ, అమిత్‌ షాలతో పోలిస్తే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. సోనియా, ప్రియాంక అయితే, అస్సలు అటు...

మోడీ, అమిత్‌ షాలతో పోలిస్తే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. సోనియా, ప్రియాంక అయితే, అస్సలు అటు అడుగుపెట్టలేదు. అయినా రెండు రాష్ట్రాల్లో ఎంతోకొంత సత్తా చాటింది కాంగ్రెస్. హైకమాండ్ గాంధీలు రానందుకే ఇంత బాగా స్కోర్‌ చేసిందా వచ్చుంటే ఇన్ని సీట్లు కూడా దక్కేవి కావా లేదంటే ప్రచారంలో పోటాపోటీగా పాల్గొని వుంటే, మరిన్ని సీట్లు కొల్లగొట్టేదా గాంధీల యాబ్సెంట్‌, ప్లస్సయ్యిందా మైనస్‌ అయ్యిందా?

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బాగా కుంగిపోయింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ అయితే, ప్రెసిడెంట్‌ పోస్ట్ వద్దు బాబోయ్ అంటూ అడవులు పట్టుకుని తిరిగారు. తాత్కాలికంగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు. పార్లమెంట్‌ ఎన్నికల ఘోర పరాజయం, పార్టీలో సంక్షోభం నేపథ్యంలోనే, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముంచుకొచ్చాయి కాంగ్రెస్‌కు. పార్టీలో క్రైసిస్‌ కారణమో, లేదంటే రెండు రాష్ట్రాల్లో ఓటమి తప్పదని ముందే డిసైడయ్యారో కానీ, మహారాష్ట్ర, హర్యానాలో పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు గాంధీల కుటుంబం. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొంటే, హర్యానాలో మరో రెండు ర్యాలీల్లోనే పాల్గొన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రెండు రాష్ట్రాల్లో, ఏ సభలోనూ పాల్గొనలేదు. ఢిల్లీకే పరిమితమయ్యారు.

అటు గాంధీల కుటుంబం ఎన్నికల క్యాంపెయిన్‌కు ముఖం చాటేస్తే, ఇటు మోడీ-షాలు మాత్రం కాలికి బలపం కట్టుకుని మరీ ధాటిగా ప్రచారానికి తిరిగారు. మహారాష్ట్ర, హర్యానాలో దాదాపు 30 సభల్లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ, అమిత్ షా. వీరే కాకుండా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, క్యాబినెట్‌ మినిస్టర్లు నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీలైతే, రెండు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఇలా కాషాయదళమంతా ప్రచార సమరంలో మూకుమ్మడి పాల్గొంటే, కాంగ్రెస్‌ జాతీయ నాయకులు మాత్రం, అస్సలు పట్టించుకోలేదు. కానీ ఫలితాలు మాత్రం, కాంగ్రెస్‌కు ఊహించినదానికంటే ఎక్కువగానే వచ్చాయి. అదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

అసలు గాంధీల కుటుంబం ప్రచారంలో పాల్గొనకపోతేనే ఇన్ని సీట్లు వస్తే, ప్రచారానికి వస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవని ఒకవైపు చర్చ జరుగుతోంది. వీరు సభల్లో పాల్గొని వుంటే, కేడర్‌లోనూ మరింత జోష్ వచ్చేదని కొందరంటున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తరహాలో రిజల్ట్స్ వచ్చేవని, కేవలం సార్వత్రిక ఎన్నికల ఫలితాల కారణంగా, నిస్తేజంలో కూరుకుపోయి, పార్టీని గాలికొదిలేశారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అయితే, పార్టీ అధినేతలు ప్రచారంలో పాల్గొనకపోవడమే మేలు చేసిందన్న చర్చ కూడా ఆసక్తి కలిగిస్తోంది.

కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగలేదు కాబట్టి, రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్చనిచ్చినట్టయ్యిందన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఫ్రీడమ్‌గా బీజేపీ, శివసేనలను ఎదుర్కొన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీలు క్యాంపెయిన్‌కు వచ్చి వుంటే, కాశ్మీర్, ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్‌ల గురించి మాట్లాడాల్సి వచ్చేదని, ప్రజల్లో గందరగోళం పెరిగేదన్న చర్చ సాగుతోంది. మొత్తానికి వీళ్లు రాకుండా మంచిచేశారో, చెడ్డ చేశారో కానీ, కాంగ్రెస్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలైతే వచ్చాయి. కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీనే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories