Himachal Pradesh: మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత

Former Himachal Pradesh Chief Minister Virbhadra Singh Passed Away
x

వీరభద్రసింగ్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ కన్నుమూశారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ కన్నుమూశారు. వీరభద్ర సింగ్‌ రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఆయనకు తొలిసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఛండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకుని ఏప్రిల్‌ 30న ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇంటికి వచ్చిన కొద్ది గంటల తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయనకు జూన్‌ 11న మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు.

1934 జూన్ 23న హిమాచల్ ప్రదేశ్ లోని సరహాన్ లో జన్మించిన వీరభద్రసింగ్ 1960లో రాజకీయాల్లోకి వచ్చారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ కు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మొదట జాతీయ రాజకీయాల్లో ముద్రవేసి ఆ తర్వాత రాష్ర్ట రాజకీయాల్లోకి వచ్చారు. 1962లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహాసు స్థానం నుంచి గెలిచి తొలిసారిగా లోక్ సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1967, 1971, 1980లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

వీరభద్రసింగ్ 1983 అక్టోబర్ లో రాష్ర్ట అసెంబ్లీకి వచ్చారు. జుబ్బల్-కొట్కాయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ కు నాలుగో ముఖ్యమంత్రి కూడా ఆయనే అంతేకాకుండా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కూడా వీరభద్రసింగే. ఆ తర్వాత వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆరుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన అర్కీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1977, 1979, 1980, 2012లో హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. వీరభద్రసింగ్‌ సతీమణి ప్రతిభా సింగ్‌, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రతిభ సింగ్ గతంలో ఎంపీగా పనిచేశారు. విక్రమాదిత్య సిమ్లా రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

వీరభద్ర సింగ్ మృతి పట్ల రాష్ర్టపతి, ప్రధానమంత్రి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ట్వీటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. వీరభద్ర సింగ్‌ మరణం బాధాకరం. ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 6 దశాబ్దాల పాటు హిమాచల్‌ ప్రజలకు నిబద్ధతతో సేవ చేశారని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పాలనపరంగా, చట్టపరంగా అపార అనుభవం ఉన్న వ్యక్తి వీరభద్రసింగ్ అని హిమచల్‌ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు ప్రధాని మోడీ. ప్రజలు, పార్టీ పట్ల వీరభద్రసింగ్ నిబద్ధత ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories