ఢిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

ఢిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు
x
Highlights

ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది.

ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్రం దిగిరావడం లేదు. దీంతో ఈ విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండువారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నిరసన సాగిస్తున్న రైతులు... ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటుండగా.. పరిస్థితి ఉద్విగ్నంగా కనిపిస్తోంది.

ఢిల్లీ-జైపుర్​, రహదారులను దిగ్బంధిస్తామని రైతు నాయకులు తెలిపారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఇవాళ రాజస్తాన్‌లోని షాజహాన్‌పూర్‌ నుంచి ఢిల్లీకి వస్తారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్‌ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు.

రైతు సంఘాల హెచ్చరికలతో ఢిల్లీ నుంచి జైపూర్, వెళ్లే రహదారులపై పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజధాని శివారుల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో కాంక్రీటు దిమ్మలతో అడ్డుకట్టలు వేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహదారులకు పోలీసుల సూచించారు.

ఇక చర్చలపై ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే మునుపటిలాగానే ఆహ్వానిస్తూ లేఖ పంపిచాలని భారతీయ కిసాన్​ నాయకడు రాకేశ్​ తికాయత్​ తెలిపారు. దీనిపై అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశ తేదీని, స్థలాన్ని ప్రభుత్వమే ముందుగా చెప్పాల్సి ఉందన్నారు. చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ రైతులు అంగీకరించబోరని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిసారీ చర్చలకు రైతులు సుముఖత వ్యక్తం చేశారని అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి గుర్తుచేసింది. ప్రభుత్వమే మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆరోపించింది.

ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా 14న సింఘు బోర్డర్‌ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ విస్తరణ ఖాయమని స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories