హస్తిన సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు

Farmers Protest Going on in Hasthina Borders
x

ఫైల్ ఇమేజ్

Highlights

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా చక్కా...

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో గత నెల 26న చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. రైతులు ఆందోళన చేస్తున్న సరిహద్దుల్లో డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఘాజీపుర్‌ సరిహద్దుల్లో మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేశారు. జలఫిరంగులు సిద్ధంగా ఉంచారు.

గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఈసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చక్కా జామ్‌ దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. అటు సింఘు, టిక్రీ సరిహద్దుల్లోనూ భారీగా భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి.

దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైతులు రహదారులను దిగ్బంధనం చేయనున్నారు. అయితే ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌లకు మినహాయింపునిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలు తెలిపారు. అంబులెన్సులు, స్కూల్‌ బస్సులు వంటి అత్యవసర, తప్పనిసరి సేవలకు ఆటంకం కలిగించబోమని కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది. చక్కా జామ్‌ను పూర్తి శాంతియుతంగా నిర్వహిస్తామని ఎస్‌కేఎం సీనియర్‌ నేత వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు చక్కా జామ్‌ ముగియగానే ఒక నిమిషం పాటు హారన్‌ మోగించనున్నట్లు రైతు నేతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories