హస్తినలో మూడో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన

Arun Chilukuri
Published on: 28 Nov 2020 2:21 PM IST
హస్తినలో మూడో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన
X

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. బురారీలోని నిరంకారీ స్టేడియంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా పంజాబ్‌-హరియాణాకు చెందిన రైతులు సింఘులో తమ నిరసనను విరమించలేదు. అక్కడే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో వారితో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారు. రాత్రంతా రహదారులపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు తమ నిరసనని కొనసాగించారు.

ఇక ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో భారీ స్థాయిలో భద్రతా బలగాల్ని మోహరించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది రైతులు నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నానికి మరికొంత మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని సమాచారం. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. మరోవైపు డిసెంబరు 3న చర్చలు చేపట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి వరకు రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story