100 లోన్‌‌ యాప్స్‌.. రూ.500 కోట్ల వసూలు.. లోన్‌ యాప్స్‌ ముఠా గుట్టు రట్టు

Delhi Police Busts Major Extortion Racket Involving Over 100 Chinese Loan Apps
x

100 లోన్‌‌ యాప్స్‌.. రూ.500 కోట్ల వసూలు.. లోన్‌ యాప్స్‌ ముఠా గుట్టు రట్టు

Highlights

Chinese Loan Apps: కష్టాల్లో ఉన్నవారే వారి లక్ష్యం అప్పు కోసం యాప్‌ను ఆశ్రయిస్తే నిమిషాల్లో డబ్బును అకౌంట్లో జమ చేస్తారు.

Chinese Loan Apps: కష్టాల్లో ఉన్నవారే వారి లక్ష్యం అప్పు కోసం యాప్‌ను ఆశ్రయిస్తే నిమిషాల్లో డబ్బును అకౌంట్లో జమ చేస్తారు. ఇచ్చింది కొంతైతే వసూలు చేసేది మాత్రం కొండంత డబ్బు కట్టమని మొండికేస్తే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో పెడుతామని బెదిరిస్తారు. దీంతో గత్యంతరం లేక రుణం తీసుకున్న దాని కంటే భారీగానే చెల్లిస్తున్నారు. ఇలా వెయ్యో, రెండు వేలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఏకంగా 500 కోట్ల రూపాయలను దోచుకుని చైనాకు తరలించారు. అంతేకాదు సదరు లోన్‌ యాప్స్‌తో సేకరించిన వినియోగదారుల డేటాను చైనానుకు అడ్డంగా అమ్మేస్తున్నారు. ఈ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.

దేశంలో లోన్‌ యాప్‌ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కేటుగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. లోన్‌ యాప్స్‌ వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో లోన్‌ యాప్ప్‌ ముఠా ఆగడాలపై ఢిల్లీ పోలీసులు రెండు నెలలుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు ఈ గ్యాంగ్‌ విస్తరించినట్టు గుర్తించారు. మొత్తం 100కు పైగా లోన్‌ యాప్స్‌ను నిర్వహిస్తూ వినియోగదారుల విలువైన డేటాను చైనా, హాంకాంగ్‌లకు ఈ ముఠా చేరవేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. లక్నోలోని ఓ కాల్‌ సెంటర్‌ను నిర్వహిస్తూ మొదట చిన్న మొత్తంలో రుణాలను ఈ ముఠా మంజూరు చేస్తోంది.

ఈ లోన్‌ యాప్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకుని రుణానికి దరఖాస్తు చేసుకోగానే ఫోన్‌ పలు పర్మిషన్లను అడుగుతుంది. వాటన్నింటిని అనుమతించిన వెంటనే సదరు వినియోగదారుల వివరాలు వెంటేనే చైనా సర్వర్‌కు చేరుతున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ తరువాతే ఈ ముఠా అసలు ఆటకు తెరలేపుతోంది. ఫేక్‌ ఐడీలతో తీసుకున్న పోన్‌ నంబర్లతో లోన్‌ తీసుకున్న వారికి వేర్వేరు నంబర్ల నుంచి కాల్‌ చేస్తారు. రుణం ఇచ్చిన దాని కంటే అధికంగా చెల్లించమని డిమాండ్‌ చేస్తారు. రుణాలను చెల్లించమని ఎవరైనా మొండికేస్తే సదరు వినియోగదారుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ కేపీఎస్‌ మల్హోత్రా పేర్కొన్నారు. వినియోగదారులు భయపడి వారడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నారని ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గంలో చైనాకు తరలిస్తున్నట్టు గుర్తించారు.

నిత్యం వేలాది రూపాయలు లోన్‌ యాప్స్‌ ఖాతాలకు జమ అవుతున్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రతి ఖాతాకు కోటి రూపాయలకు పైగా జమ అవుతున్నాయని ఇప్పటివరకు 500 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొత్తం 22 మంది ముఠాను అరెస్టు చేసినట్టు వివరించారు. దందా కోసం మొత్తం 100 లోన్‌ యాప్స్‌లను వినియోగించినట్టు గుర్తించారు. నిందితుల నుంచి మొత్తం 51 మొబైల్‌ ఫోన్లు, 25 హార్డ్‌ డిస్క్‌లు, 9 ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, మూడు కార్లు, 4 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయుల సూచనల మేరకే ఈ దందాను నిర్వహిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. చైనాకు చెందిన కొంతమంది కేటుగాళ్లను కూడా గుర్తించామని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories