Rekha Gupta: దిల్లీ పీఠాన్ని 27 ఏళ్ళ తరువాత బీజేపీ ఎలా దక్కించుకుంది?

Rekha Gupta takes oath as Delhi CM
x

దిల్లీ పీఠాన్ని 27 ఏళ్ళ తరువాత బీజేపీ ఎలా దక్కించుకుంది?

Highlights

Rekha Gupta takes oath as Delhi new CM: దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెనే బీజేపీ సీఎం పదవికి ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఏంటి?

దిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఫిబ్రవరి 20న ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రారంభమైన ఆప్ పార్టీకి అంటిన అవినీతి మరకలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణమయ్యాయి.

70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో సింగిల్ డిజిట్ నుంచి 48 స్థానాలకు కమలం పార్టీ తన సంఖ్యా బలాన్ని పెంచుకుంది. ఆప్ 63 స్థానాల నుంచి 22 స్థానాలకు పడిపోయింది. కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్నా దిల్లీ ప్రజలు మాత్రం బీజేపీకి పదేళ్లు అధికారం దక్కనివ్వలేదు.

ఇంతకీ, దిల్లీ పీఠంపై కమలం జెండా ఎగురడానికి 27 ఏళ్లు ఎందుకు పట్టింది? ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని ఎలా అడ్డుకున్నాయి? కేంద్రంలో వరసగా గెలుస్తూ వచ్చిన మోదీ అండ్ పార్టీని దిల్లీ ఓటర్లు ఇన్నాళ్ళూ ఎందుకు దూరం పెట్టారు. అలాంటి వరుస పరాజయాల నుంచి దిల్లీలో బీజేపీ ఎలా గెలుపు జెండా ఎగరేసింది? ఈ విశ్లేషణే నేటి ట్రెండింగ్ స్టోరీ.

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

దిల్లీ రామ్ లీలా మైదానంలో రేఖా గుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్ డీ ఏ పక్షాలకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్వేశ్ సాహెబ్ సింగ్, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా,పంకజ్ కుమార్ సింగ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఫిబ్రవరి 19 రాత్రి దిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభపక్ష నాయకురాలిగా రేఖా గుప్తాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పర్వేశ్ సాహెబ్ సింగ్ పేరు కూడా సీఎం రేసులో వినిపించింది. కానీ, బీజేపీ నాయకత్వం మాత్రం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపారు.

27 ఏళ్ల తర్వాత దిల్లీ సీఎం పీఠంపై బీజేపీ

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత దిల్లీ రాష్ట్రానికి 1952లో చౌదరి బ్రహ్మ ప్రకాశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అయిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత గురుముఖ్ నిహాల్ సింగ్ 1955లో రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ఆ పదవిలో ఏడాది కూడా ఉండలేదు. అయితే, 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత దిల్లీలో ముఖ్యమంత్రి పదవిని రద్దయింది. అప్పటి నుంచి 37 ఏళ్ళు అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండిపోయింది.

అయితే, దిల్లీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడడంతో, 69వ రాజ్యాంగ సవరణతో దిల్లీకి ఎన్సీటీ.. అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా ఇస్తూ, అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని నిర్ణయించారు. దాంతో, 1993 నవంబర్ నెలలో దిల్లీలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆ అయిదేళ్ళ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఖురానా తరువాత సాహిబ్ సింగ్ వర్మ రెండున్నరేళ్లు, ఆ తరువాత సుష్మా స్వరాజ్ నెలన్నర రోజులు దిల్లీ సీఎం పీఠంలో కూర్చున్నారు.

దిల్లీ సీఎంగా చరిత్ర సృష్టించిన షీలా దీక్షిత్

బీజేపీ ముగ్గురు సీఎంల పాలన తరువాత 1998లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆమె ఆ పదవిలో 2013 వరకూ కొనసాగారు. పదిహేనేళ్ళకు పైగా నిరాటంకంగా సీఎంగా పాలన అందించిన షీలా దీక్షిత్... ఒక దశలో ఫేస్ ఆఫ్ దిల్లీగా మారిపోయారు.

ఆ తరువాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, ఆప్ పార్టీ ఆవిర్భావం జరిగాయి. 2013 డిసెంబర్ 28న ఆప్ అధ్యక్షుడు, మాజీ సివిల్ సర్వెంట్ అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా దిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తరువాత 2015లో మరొకసారి దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. మొదటిసారి 48 రోజులు, రెండోసారి ఏడాది పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, 2015 ఫిబ్రవరిలో మళ్ళీ గెలిచాక, 2024 వరకూ ఆ పదవిలో కొనసాగారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్టయిన తరువాత కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆప్ నేత అతిషి మార్లేనా 2024 సెప్టెంబర్లో సీఎం అయ్యారు.

ఇప్పుడు 2025లో మళ్ళీ బీజేపీ గెలిచింది. దిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు.

2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దిల్లీలోని ఎంపీ స్థానాల్లో బీజేపీ సత్తా చూపింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. దీంతో, ఈ కెమిస్ట్రీని బ్రేక్ చేయాలని బీజేపీ పెద్దలు సంకల్పించారు. ఆప్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుందని, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆప్ ప్రముఖ నేతలను సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా జైలుకు పంపించడం ద్వారా బీజేపీ పైచేయి సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

దిల్లీకి బీజేపీ యాత్ర

దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో కమలం పార్టీ లేదా ఆ పార్టీ మిత్రపక్షాలదే అధికారం. కానీ, 33 మిలియన్ల జనాభా ఉన్న దిల్లీ రాష్ట్రంలో అధికారం కోసం ఆ పార్టీ 27 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 2024లో మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్ర, హర్యానా, దిల్లీ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకొంది. దిల్లీలో ఆప్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

దిల్లీ లిక్కర్ స్కాంలో వచ్చిన ఆరోపణలను బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఇంటీరియర్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించి ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అద్దాల మేడ అంటూ కేజ్రీవాల్ ఉపయోగించిన ఇంటిపై బీజేపీ చేసిన ప్రచారం మధ్యతరగతి, పేద ప్రజల్లో చర్చకు కారణమైంది.

ఉచితాలకు మోదీ స్వతహాగా వ్యతిరేకం. అయితే దిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ మెట్టు దిగింది. ఆప్ కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని స్వయంగా మోదీ హామీ ఇచ్చారు. ఆప్ వాగ్దానాలకు రెట్టింపు వాగ్దానాలు కమలం పార్టీ చేసింది. దీల్లీలోని అన్ని వర్గాల ప్రజలను తన ప్రచారం ద్వారా బీజేపీ ఆకట్టుకుంది.

దీనికి తోడు కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లతో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే సుమారు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్ధులు విజయం సాధించేవాళ్లు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లు వచ్చాయి. దిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా తన ఉనికిని కాపాడుకునేందుకు హస్తం పార్టీ చేసిన ప్రయత్నం ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి.

రేఖా గుప్తాకే సీఎం పదవి ఎందుకు?

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెనే బీజేపీ సీఎం పదవికి ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఆప్ చీఫ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను కాదని సీఎం పదవికి ఆమెను ఎందుకు ఎంపిక చేశారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో ఉంది. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి 30 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు.

విద్యార్ధిగా ఉన్న సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. దిల్లీ యూనివర్శిటీలో ఆమె చదువుకునే సమయంలో ఏబీవీపీలో కొనసాగారు. దిల్లీ యూనివర్శిటీలో ఏబీవీపీ జెండా ఎగురవేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. 1996 లో దిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో మూడు సార్లు కౌన్సిలర్ గా, ఒకసారి మేయర్ గా ఆమె పనిచేశారు. బీజేపీ మహిళామోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

2007లో దిల్లీలోని నార్త్ పితంపురా కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2012 లో కూడా ఆమె ఇదే స్థానం నుంచి గెలిచారు. సౌత్ దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా ఆమె పనిచేశారు. మేయర్ గా పనిచేసిన సమయంలో ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో ఆమె తనదైన ముద్ర వేశారు. వెనుకబడిన వర్గాల విద్యార్థినులు ఉన్నత విద్య అభ్యసించేలా ఆర్ధిక సాయం కోసం సుమేథ యోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు.

దిల్లీ ముఖ్యమంత్రిగా 1998 అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 3 వరకు సుష్మా స్వరాజ్ కొనసాగారు. అప్పట్లో ఉల్లిపాయల ధరలు పెరగడంతో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. షీలా దీక్షిత్ 15 ఏళ్లు దిల్లీలో ఆమె సీఎంగా కొనసాగారు. ఐదు నెలలు దిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రేఖాగుప్తా సీఎం బాధ్యతలు చేపట్టారు.

70 అసెంబ్లీ స్థానాల్లో 9 మంది మహిళా అభ్యర్ధులను బీజేపీ బరిలోకి దింపింది. ఇందులో నలుగురు మాత్రమే గెలిచారు. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.మహిళల ఓట్లపై ఆశపెట్టుకున్న ఆప్ నకు నిరాశే ఎదురైంది. ఆప్‌ పార్టీతో పోటీగా బీజేపీ కూడా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు హామీనిచ్చింది. మహిళలకు నెలకు 2500 ఇస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. ఇలాంటి హామీలు కూడా బీజేపీ గెలుపునకు కూడా కలిసి వచ్చింది.

ఏబీవీపీలో పనిచేసిన అనుభవం ఉన్న రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయడం వెనుక పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలనే లక్ష్యంగా కూడా ఉంది. గతంలో దిల్లీలో ఆ పార్టీకి సుష్మా స్వరాజ్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ లాంటి నాయకులు ఉండేవారు. ఆ తరం తర్వాత బీజేపీకి అదేస్థాయిలో నాయకులు లేరు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో రేఖా గుప్తాను ఆ పార్టీ ఎంపిక చేసింది.

హామీల అమలు ఎలా?

ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నాయకత్వం ఎడాపెడా హామీలు ఇచ్చారు. అయితే మహిళల ఖాతాల్లో 2500 రూపాయాలు జమ చేస్తామన్న హమీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని ఆప్ కోరుతోంది. గర్భిణీ మహిళలకు 21 వేలు ఆర్ధిక సహాయం అందిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఎల్ పీ జీ సిలిండర్ కు 500 సబ్సిడీ అందిస్తామని చెప్పారు. అంతేకాదు హోలీ లేదా దీపావళికి ఒక్క సిలిండర్ ను ఉచితంగా అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల ఇచ్చే 2500 ఆర్ధిక సహాయానికి సంబంధించి తొలి కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

అయితే ఈ హామీలను సమర్ధంగా అమలు చేయకపోతే వాటిని అమలు చేయాలని ఆప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ హామీల అమలుకు అవసరమైన ఆర్ధిక వనరులు కూడా రాష్ట్రానికి ఉండాలి. హామీల అమలు విషయంలో కొన్ని రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆర్ధిక సమస్యలతో హామీల అమలును వాయిదా వేస్తున్నాయి.

దిల్లీకి ఇప్పటివరకు పనిచేసిన ముగ్గురు మహిళా సీఎంలలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే షీలా దీక్షిత్ 15 ఏళ్లు సుదీర్ఘంగా పాలన చేశారు. అతిశీ, సుష్మా స్వరాజ్ కొంత కాలం మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ పదవిలో ఉన్నారు. రేఖా గుప్తాకు మాత్రం అందుకు భిన్నంగా సీఎం పదవిని కమలం పార్టీ అప్పగించింది. పార్టీ నమ్మకాన్ని రేఖా గుప్తా నిలబెట్టుకుంటారా? వెయిట్ అండ్ వాచ్.

Show Full Article
Print Article
Next Story
More Stories